aravind subramanyan
-
నోట్ల రద్దు దారుణం..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై కేంద్ర మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు దారుణమైన చర్యంటూ... ద్రవ్య విధానానికి పెద్ద షాక్‌లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధి రేటు మరింత వేగంగా పడిపోవడానికి ఇదే కారణమని అరవింద్ పేర్కొన్నారు. త్వరలో విడుదల కానున్న ‘ఆఫ్ కౌన్సిల్ – ది చాలెంజెస్ ఆఫ్ మోదీ– జైట్లీ ఎకానమీ‘ పేరిట రాసిన పుస్తకంలో అరవింద్ ఈ అంశాలు ప్రస్తావించారు. పుస్తకంలో దీనికోసం ప్రత్యేకంగా టూ పజిల్స్ ఆఫ్ డీమానిటైజేషన్ – పొలిటికల్ అండ్ ఎకనమిక్’ అనే అధ్యాయాన్ని కేటాయించారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ముద్రించిన ఈ పుస్తకాన్ని డిసెంబర్ 7న ముంబైలో, 9న ఢిల్లీలో ఆవిష్కరిస్తారు. నాలుగేళ్ల పాటు ముఖ్య ఆర్థిక సలహాదారుగా కొనసాగి... ఇటీవలే అరవింద్ వైదొలిగారు. ‘నోట్ల రద్దు చాలా భారీ స్థాయి దారుణమైన చర్య. ద్రవ్య విధానానికి షాక్. ఒక్క దెబ్బతో చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించారు. డీమోనిటైజేషన్ కన్నా ముందు కూడా వృద్ధి రేటు నెమ్మదించింది! కానీ పెద్ద నోట్ల రద్దుతో అమాంతంగా పడిపోయింది. డీమోనిటైజేషన్‌కు ఆరు త్రైమాసికాల ముందు వృద్ధి రేటు సగటున 8 శాతంగా ఉండగా.. పెద్ద నోట్ల రద్దు తరవాతి ఏడు త్రైమాసికాల్లో 6.8 శాతానికి పడిపోయింది‘ అని అరవింద్ వివరించారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. రాజకీయంగా అసాధారణం... డీమోనిటైజేషన్ వల్ల వృద్ధి నెమ్మదించిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని.. కాకపోతే ఎంత స్థాయిలో మందగించిందన్నదే చర్చనీయమని అరవింద్ తన పుస్తకంలో తెలిపారు. రాజకీయ కోణంలో చూస్తే.. ఇటీవలి కాలంలో ఏ దేశం కూడా సాధారణ సందర్భాల్లో ఎకాయెకిన డీమోనిటైజేషన్ వంటి అసాధారణ చర్య తీసుకోలేదని స్పష్టంచేశారు. ‘‘సాధారణ పరిస్థితులున్నప్పుడు కరెన్సీని రద్దు చేయాల్సి వస్తే అది క్రమానుగతంగా మాత్రమే జరగాలి. అలాకాక యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ సంక్షోభం, రాజకీయ సంక్షోభం (2016లో వెనెజులా) వంటి పరిస్థితుల్లో మాత్రమే నోట్ల రద్దు వంటి అసాధారణ చర్యలు ఉంటాయి. భారత్‌లో ప్రయోగం మాత్రం ప్రత్యేకమైనది’’ అని అరవింద్ వివరించారు. డీమోనిటైజేషన్ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వెనుక గల కారణాలను కూడా ఆయన విశ్లేషించారు. నోట్ల రద్దు వల్ల పేద ప్రజానీకానికి కష్టాలు ఎదురైనా, అక్రమార్కులు.. సంపన్నులు తమకన్నా ఎక్కువ నష్టపోతారన్న ఆలోచనతో వారు ఆ ఇబ్బందులను భరించడానికి సిద్ధపడ్డారన్నారు. ‘‘నాది ఒక మేకే పోయింది. కానీ వాళ్ల ఆవులన్నీ పోయాయి కదా! అనే భావనలో ఉంటారు. ఈ సందర్భంలోనూ అదే జరిగి ఉండొచ్చు. నిజానికి పెద్ద లక్ష్యాలను సాధించే క్రమంలో సామాన్యులకు కొంత కష్టం తప్పకపోవచ్చు. కానీ ఈ సందర్భంలో తప్పించేందుకు అవకాశం ఉండేది’’ అన్నారు. ఐఎల్ఎఫ్ఎస్... నియంత్రణ సంస్థ వైఫల్యం.. నియంత్రణ సంస్థ వైఫల్యం వల్లే ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తలెత్తిందని అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. దీనికి రిజర్వ్ బ్యాంకే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గొప్ప సంస్థగా ఆర్బీఐకి మంచి పేరున్నప్పటికీ.. ప్రతీ సందర్భంలో అది సరైన నిర్ణయాలే తీసుకుంటోందనడానికి లేదని చెప్పారాయన. ‘‘రుణాల చెల్లింపు సమస్యలు, నీరవ్ మోదీ కుంభకోణాల్లాంటివాటి తీవ్రతను అది గ్రహించలేకపోయింది. ఇటీవలి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభాన్ని బట్టి ఆర్బీఐ వైఫల్యం వాణిజ్య బ్యాంకుల నియంత్రణకే పరిమితం కాలేదని, ఎన్‌బీఎఫ్‌సీల విషయంలోనూ అలాగే ఉందని అర్థమవుతోంది’’ అని తన పుస్తకంలో అరవింద్ పేర్కొన్నారు. ఆర్బీఐ పర్యవేక్షణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని, సమస్యల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు కావాల్సిన మూలధనాన్ని సమకూర్చేందుకు తన వద్ద భారీగా ఉన్న నిల్వలను ఉపయోగించాలని సూచించారు. -
పరుగెత్తే నీటికి నడక నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా ఎక్కడికక్కడ ఒడిసిపట్టుకొని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువుపట్టుగా మార్చుకొని సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వలతో, వర్షాలతో, పడబాటు (రీ జనరేటెడ్)తో వచ్చే నీటితో చెరువులను నింపే వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. పరుగెత్తే నీటికి నడక నేర్పాలని సూచించారు. ఏడాదంతా తెలంగాణలోని అన్ని చెరువులూ నిండుకుండల్లా కళకళలాడాలని ఆకాంక్షించారు. కాల్వలను చెరువులకు అనుసంధానిస్తూ మండలాలవారీగా ఇరిగేషన్ మ్యాపులను సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల కాలువలతో గొలుసుకట్టు చెరువుల అనుసంధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రి టి. హరీశ్‌రావు, ఎంపీలు కె.కేశవరావు, బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, దివాకర్‌రావు, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధర్, సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు. గొలుసుకట్టు చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇస్రో రూపొందించిన మ్యాపింగ్‌పై ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) కమిషనర్ మల్సూర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలోని వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీరు అందించే అవకాశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. చెరువులు మన వారసత్వ సంపద... ‘మనకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులు ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 1974లోనే తెలంగాణలోని చెరువులకు 265 టీఎంసీల నీటిని కేటాయించింది. అంటే అంత భారీగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యంగల గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉంది. సమైక్యపాలనలో చెరువులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనం మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభించి చెరువులను పునరుద్ధరించుకుంటున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. అలా నిర్మించుకున్న ప్రాజెక్టులతో పొందే నీటిలో ఒక్క చుక్క కూడా వృథా కాకుండా చెరువులకు మళ్లించాలి. గొలుసుకట్టు చెరువులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టులో మొదటి చెరువును గుర్తించి ప్రాజెక్టు కాలువకు అనుసంధానించాలి. దాన్ని నింపుకుంటూ వెళ్తే కింద ఉన్న చెరువులూ నిండుతాయి. దీనికోసం కట్టు కాలువ (ఫీడర్ చానల్), పంట కాలువ (క్రాప్ కెనాల్)లను సిద్ధం చేయాలి. ప్రతి మండల అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర ఆ మండలంలోని చెరువుల మ్యాపులు ఉండాలి. ఏ కాలువతో ఏ చెరువును నింపాలనే దానిపై వ్యూహం ఖరారు చేయాలి. ఏ చెరువు అలుగు పోస్తే ఏ చెరువుకు నీరు పారుతుందో తెలిసుండాలి. ప్రాజెక్టుల కాల్వల నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న వేలాది చెక్ డ్యాములతోపాటు పడబాటు, వానలతో వచ్చే ప్రతి నీటి బొట్టునూ చెరువులకు మళ్లించాలి. తెలంగాణలో నీళ్లు పరిగెత్త కూడదు. అవి మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువుల నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపోతుంది. వర్షాలూ బాగా కురుస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి’అని ముఖ్యమంత్రి వివరించారు. రెండు నెలల్లో వ్యూహం... రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహం ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా అన్ని చెరువులూ నింపేందుకు అవసరమైన కాల్వల నిర్మాణం చేపట్టాలని, దీనికోసం నిధులు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ‘వచ్చే ఏడాది జూన్ నుంచి కాళేశ్వరం నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే చెరువుల అనుసంధానం పూర్తి కావాలి. దీన్ని అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదలశాఖ గుర్తించాలి. చెరువులు, కట్టు కాలువలు, పంట కాల్వలను పునరుద్ధరించాలి. అవి ఎప్పటికీ బాగుండేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ఆయకట్టుదారులే కాల్వలు, తూములను మరమ్మతు చేసుకునే వారు. ఎండాకాలంలో చెరువుల్లోని మట్టిని పూడిక తీసేవారు. మళ్లీ ఆ రోజులు రావాలి. గ్రామీణ ప్రజలకు దీనిపై అవగాహన, చైతన్యం కలిగించాలి. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటిపారుదల ఇంజనీర్లతో సమావేశం నిర్వహిస్తాం. నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల్లో మనకున్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకొవడానికి వీలుగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందో గుర్తించాలి. అక్కడ అవసరమైన ఎత్తిపోతలు, కాలువలు, రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కడెంకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉండే కుఫ్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలి. దీంతో కుంటాల జలపాతానికీ నీటి వనరు ఏర్పడుతుంది. కృష్ణా నదిలోనూ కావాల్సినంత నీరు ఉంది. ఈ నీటినీ సమర్థంగా వినియోగించుకునేలా వ్యూహం అమలు చేయాలి’అని సీఎం చెప్పారు. ‘రైతు బంధు’కు దేశవ్యాప్తంగా ప్రశంసలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘తెలంగాణలో 65 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా ఇంతవరకు వ్యవసాయాన్ని అప్రాధాన్యతా రంగంగా చూశారు. అది దురదృష్టకరం. యూరప్, అమెరికాలలో రైతులతోపాటు పంట ఉత్పత్తులు, ఉత్పాదకత పెంచేందుకు అక్కడి ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మన దగ్గర సమైక్య పాలనలో రైతులు వంచనకు గురయ్యారు. తెలంగాణ వచ్చాక రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవిక దృక్పథంతో ఆలోచించబట్టే ఇంత మంచి పథకాల రూపకల్పన జరిగింది. రైతు బంధు పథకాన్ని ఆర్థికవేత్తలు అభినందిస్తున్నారు. ఈ పథకాన్ని ఒక మార్గదర్శకంగా కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభివర్ణించారు’అని కేసీఆర్ చెప్పారు. -
ప్రైవేటు బ్యాంకుల్లోనే స్కామ్‌లు ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ 11,400 కోట్ల రూపాయలకు ముంచారని వార్తలు వెలువడినప్పుడు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేయడం మంచిదని సూచనలు వచ్చాయి. అదే ఉత్తమమంటూ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్‌తోపాటు భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్ఐసీసీఐ), భారత వాణిజ్య అనుబంధ మండళ్లు (ఏసీసీఐ) వంతపాడాయి. ఆ తర్వాత నెల రోజులకు ప్రైవేటురంగంలోని ఐసీసీఐ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంకుల్లో కూడా ఆర్థిక కుంభకోణాలు జరిగిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతైనా ప్రైవేటు బ్యాంకుల్లో స్కామ్‌లు తక్కువేలే అంటున్నవాళ్లు ఉన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ స్కాములు జరుగుతున్నాయా, ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువ స్కామ్‌లు జరుగుతున్నాయా ? అన్న అంశాన్ని కచ్చితంగా తేల్చుకునేందుకు లెక్కలు ప్రజలకు అందుబాటులో లేవు. రుణాలు చెల్లించే స్థోమత ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా రుణాలు చెల్లించని వారిని ‘విల్‌ఫుల్ డీఫాల్టర్లు’గా వ్యవహరిస్తారు. వీరి నుంచి తీసుకున్న రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు లీగల్ కేసులు దాఖలు చేస్తాయి. ఆ కేసుల వివరాలను బ్యాంకులు ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్’కు అందజేస్తాయి. అలా ఓ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ వద్ద గత పదేళ్ల డేటాను సేకరించగా, డీఫాల్టర్లపై కేసులు దాఖలు చేసిన ప్రవైటు బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులకన్నా ఎక్కువున్నాయి. ఈ కేసుల ద్వారా మనకు రెండు విషయాలు మన దృష్టికి వస్తాయి. అందులో ఒకటే నిజం కావొచ్చు, మరోటి తప్పుకావచ్చు. లేదంటే రెండింట్లోనూ కొంత, కొంత వాస్తవం ఉండొచ్చు. డీఫాల్టర్ల నుంచి రుణాలను రాబట్టడడం కోసం ప్రైవేటు బ్యాంకులు క్రియాశీలకంగా వ్యవహరించి కేసులు పెట్టి ఉండవచ్చు. లేదా నిజంగానే రుణాలు ఎగ్గొట్టిన వారు ప్రభుత్వ బ్యాంకులకన్నా ఎక్కువే ఉండొచ్చు. కొంత అటూ ఇటుగాను ఉండొచ్చు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు బ్యాంకుల పరిస్థితి ఆరోగ్యంగా ఉందా, లేదా అన్న అంశాన్ని చెడ్డ రుణాలు లేదా నిరర్థక ఆస్తులను బట్టి అంచనా వేస్తారు. రుణాలు తీసుకున్నవారు కనీసం 90 రోజుల పాటు వడ్డీ లేదా అసలు చెల్లించకపోతే వాటిని నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తారు. బ్యాంకులకు వచ్చే లాభాల్లో ఇలాంటి నిరర్థక ఆస్తులు ఎంత తక్కువగా ఉంటే బ్యాంకుల పరిస్థితి అంత బాగా ఉన్నట్లు లెక్క. ఈ నిరర్థక ఆస్తులు గత కొన్నేళ్ల క్రితం వరకు తక్కువగా ఉండేది. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. 2006 నుంచి 2011 సంవత్సరం మధ్యన భారతీయ బ్యాంకుల నిరర్థక ఆస్తులు లక్ష కోట్ల రూపాయలు ఉండగా, అవి 2017, డిసెంబర్ నెల నాటికి 8.85 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. నిరర్థక ఆస్తులన్నింటికీ ఉద్దేశపూర్వకంగా చెల్లించని డీఫాల్టర్లుగా పరిగణించలేం. పరిశ్రమల కోసం, ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకున్న వారికి లాభాలు రాకపోవడం వల్ల వారు రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉండవచ్చు. ఉద్దేశపూర్వక డీఫాల్టర్లు ఎంత మంది ఉన్నారో, వారు తీసుకున్న మొత్తం ఎంతో ప్రతి బ్యాంకు ప్రతి ఏటా భారతీయ రిజర్వ్ బ్యాంకుకు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. సామాన్యంగా ఈ సమాచారాన్ని ఆర్బీఐ బహిర్గతం చేయదు. కానీ పంజాబ్ జాతీయ స్కామ్ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులకు చెందిన డీఫాల్టర్ల వివరాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. విల్‌ఫుల్ డీఫాల్టర్లు డిసెంబర్, 2017 నాటికి ఎగ్గొట్టిన మొత్తం 1,10,050 కోట్ల రూపాయలు. మొత్తం బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో ఈ మొత్తం ఏడు శాతం మాత్రమే. ప్రైవేటు బ్యాంకుల డీఫాల్టర్ల వివరాలను సమాచార హక్కు కింద కూడా వెల్లడించడానికి వీల్లేదు. అయితే డీఫాల్టర్ల వివరాలను, వారి నుంచి వాటిని వసూలు చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు అందజేయాలి. వాటిని ఆ బ్యాంకు బహిర్గతం చేయదు. అయితే ఈ వివరాలను బ్యాంకులు క్రెడిట్ రేటింగ్ కంపెనీలకు అందజేస్తాయి. అలా సీఐబీఎల్ సంస్థ నుంచి కోటి, ఆపైన రుణాలు తీసుకున్న మొత్తం డీఫాల్టర్లపై 40 బ్యాంకులు దాఖలు చేసిన కేసుల వివరాలను, 25 లక్షలు, ఆపైనా రుణాలు తీసుకుని కేసులు దాఖలైన వారి వివరాలను సేకరించి అధ్యయనం చేయగా, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. 25లక్షలపైన తీసుకొని ఎగ్గొట్టిన వారి రుణాల మొత్తం ప్రైవేటు బ్యాంకుల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 14.2 శాతం ఉండగా, ఆ మొత్తం ప్రభుత్వ బ్యాంకుల్లో 12.3 శాతం మాత్రమే ఉంది. ప్రైవేటు బ్యాంకుల్లో కోటికి పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన రుణాల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 42. 9 శాతం కాగా, ప్రభుత్వ బ్యాంకుల్లో వారు ఎగ్గొట్టిన మొత్తం 33.1 శాతంగా ఉంది. రుణాల వసూళ్లకు ఎక్కువ విలువైన కేసులను దాఖలు చేసిన ప్రైవేటు బ్యాంకుల్లో ‘కోటక్ మహీంద్ర బ్యాంక్’ మొదటి స్థానంలో ఉండగా, ధనలక్ష్మీ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ఇక ప్రభుత్వ బ్యాంకుల్లో విజయ బ్యాంక్ మొదటి స్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ఈ వివరాలను బట్టి కూడా ప్రైవేటు బ్యాంకుల్లో డీఫాల్టర్లు ఎగ్గొట్టిందీ ఎక్కువా లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో ఎగ్గొట్టిందీ ఎక్కువ ? అన్న విషయం స్పష్టం కాదు. నిరర్థక ఆస్తుల మొత్తం ఎంతో తెలిస్తేగానీ ఆ విషయం తెలీదు. ఎప్పటికప్పుడు బ్యాంకు రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తారు కనుక నిరర్థక ఆస్తులు మాఫీ అవుతూ వస్తుంటాయి. ప్రైవేటు బ్యాంకులు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు రుణాలు ఎక్కువగా ఇస్తాయి. లాభం వస్తుందో, లేదో తెలియని మౌలిక సౌకర్యాల రంగానికి ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఎక్కువగా ఇస్తుంటాయి. ఈ లెక్కన అందుబాటులో ఉన్న అంకెల ప్రకారం ప్రైవేటు బ్యాంకుల్లోనే స్కాములు ఎక్కువగా ఉన్నట్లు లెక్క. -
జీడీపీ వృద్ధి అంచనాల్లో కోత!
- డిసెంబర్ 18న పార్లమెంట్లో కేంద్రం మధ్యంతర ఆర్థిక నివేదిక సమీక్ష - 8% దిగువకు తగ్గించే అవకాశం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం డిసెంబర్ 18న పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని భావిస్తోన్న మధ్యంతర ఆర్థిక నివేదిక సమీక్షలో ఈ విషయం వెల్లడికానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధ భాగపు చివరి నాటి ఆదాయ వ్యయాల విశ్లేషణల ఆధారంగా మధ్యంతర ఆర్థిక నివేదిక రూపకల్పన జరుగుతుంది. ఈ మధ్యంతర ఆర్థిక నివేదిక.. వృద్ధి అంచనాలు, వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, స్థూల ఆర్థిక పరిస్థితులు వంటి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని ఒక బృందం ఈ మధ్యంతర ఆర్థిక నివేదిక ముసాయిదాను రూపొందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు 8.1-8.5 శాతంగా ఉండవచ్చని ముందస్తు బడ్జెట్ ఆర్థిక సర్వే ఇదివరకే పేర్కొంది. ఇక ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కాగా మధ్యంతర ఆర్థిక నివేదిక ప్రకారం.. 2015-16కి సంబంధించి జీడీపీ వృద్ధి 8 శాతం దిగువనే ఉండవచ్చని సమాచారం. గ త ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ద భాగంలో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం.