బ్యాంకింగ్ వ్యవస్థపై శ్వేతపత్రానికి కాంగ్రెస్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : భారీ కుంభకోణాలు వెలుగుచూస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థలో వాస్తవ పరిస్థితి ప్రతిబింబిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్‌డీఏ సర్కార్‌ను కోరింది. గత ఐదేళ్లుగా బ్యాంకింగ్ రంగంలో రూ 61,000 కోట్ల విలువైన స్కామ్‌లు చోటుచేసుకున్నాయని ఆ పార్టీ పేర్కొంది. బ్యాంకులను మోసం చేస్తున్న వారికి బీజేపీ సర్కార్ అండదండలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థపై శ్వేతపత్రాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు.
బిలియనీర్ జ్యూవెలరీ నీరవ్ మోదీ పీఎన్‌బీని రూ 17,000 కోట్లకు ముంచిన కుంభకోణం వెలుగుచూడగా, తాజాగా రొటోమాక్ అధినేత విక్రమ్ కొఠారీ భారత బ్యాంకులకు రూ 800 కోట్లు ఎగవేసిన మరో స్కాం బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోందన్నారు. బ్యాంకులను మోసం చేసిన అక్రమార్కులు, ఎన్‌పీఏలకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రచురించి, వారి పేర్లను వెల్లడించాల్సిందిగా అన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని తివారీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment