సూపర్‌ సిక్స్‌ కాస్త డకౌట్‌ అయ్యింది: బుగ్గన | Buggana Rajendranath Strong Counter To Chandrababu Naidu Finance White Paper In Assembly | Sakshi
Sakshi News home page

Buggana Rajendranath Press Meet: చంద్రబాబు ఆర్థిక శ్వేతపత్రంపై.. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన కౌంటర్‌

Published Sat, Jul 27 2024 11:19 AM | Last Updated on Sat, Jul 27 2024 4:45 PM

Buggana Rajendranath Strong Counter To CBN Finance White Paper

శ్వేతపత్రాల అర్థం మార్చిన చంద్రబాబు

గత ప్రభుత్వంపై నిందలు, ఆరోపణలు

అన్నింటికీ బాధ్యులను చేస్తూ ఆక్షేపణ

హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారు

అందుకే శ్వేతపత్రాల పేరుతో కాలయాపన

సూపర్‌సిక్స్‌ అమలు ఊసే ఎత్తని ప్రభుత్వం

తొలి ఓవర్‌లోనే బాబు సర్కార్‌ డక్‌అవుట్‌

రాష్ట్ర అప్పులపై పదే పదే అసత్యాలు

అప్పుడూ, ఇప్పుడూ అవే ప్రచారాలు

సంపద సృష్టిస్తామన్నారు. ఏమైంది?

అప్పులు చేస్తూ పోవడమే సంపదా?

సూటిగా ప్రశ్నించిన బుగ్గన

హైదరాబాద్‌, సాక్షి:  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికే అర్ధం మార్చిన చంద్రబాబు.. రాష్ట్రాభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ..  అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తూ.. వైట్‌పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు.

ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌.. అమలుకు ముందే, తొలి ఓవర్‌లోనే డకౌట్‌ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

అది హాస్యాస్పదం
రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు.. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకున్నారన్న బుగ్గన.. అదే చంద్రబాబు ఇప్పుడు తమ సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు.  బాబు వైఖరి చూస్తుంటే.. ‘మీరంతా కొండను ఎత్తి, నా నెత్తిపై పెట్టండి. నేను దాన్ని మోస్తాను’ అన్నట్లు ఉందని బుగ్గన  వ్యాఖ్యానించారు.

ఎలా ప్రకటించారు?
రాష్ట్ర ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు కాగా.. రెగ్యులర్‌ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు, ఇతర పరిపాలన అవసరాల కోసమే రూ.2.50 లక్షల కోట్లు ఖర్చవుతుందన్న ఆయన.. ఆ అవసరల కోసమే ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.  మరి అలాంటప్పుడు ఏటా, దాదాపు లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను చంద్రబాబు ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. వాటిని అమలు చేయలేరన్న విషయం తెలుసు కాబట్టే.. ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు.

వీటి కోసం ఎదురుచూస్తున్నారు
తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో తల్లికి వందనం అమలు కావాల్సి ఉందని గుర్తు చేశారు.

తప్పుడు లెక్కలు
తమ హయాంలో 2014–19 మ«ధ్య, స్ధూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు వైట్‌పేపర్‌లో చెప్పుకోవడాన్ని తప్పు పట్టిన బుగ్గన, కోవిడ్‌ పీరియడ్‌.. అది లేని కాలంతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు.   నిజం చెప్పాలంటే.. టీడీపీ పాలన కంటే, తమ హయాంలోనే స్థూల ఉత్పత్తిలో కాస్త వృద్ధి సాధించామన్న ఆయన.. 2014 నుంచి 2019 వరకు దేశ స్ధూల ఉత్పత్తిలో రాష్ట్ర స్ధూల ఉత్పత్తి నిష్పత్తి 4.47 కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4.82 గా నమోదైందని చెప్పారు. అది 0.4 శాతం ఎక్కువని వివరించారు.

అసత్య ప్రచారాలు
అదే విధంగా పారిశ్రామిక రంగానికి సంబ«ంధించి, దేశ జీడీజీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014 నుంచి 2019 వరకు 2.98 శాతం కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4 శాతమని గుర్తు చేసిన ఆయన, తమ హయాంలో 1.1 శాతం పెరిగిందని.. అయినా తమ పాలనలో ఇక్కడికి పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేశారని ఆక్షేపించారు.

తలసరి ఆదాయం
రాష్ట్రంలో టీడీపీ పాలన చివరి ఏడాది 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38 శాతం అని చెప్పారు. అదే తమ ప్రభుత్వ పాలనలో చివరి ఏడాది.. 2023–24లో  తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా, అది 13.98 శాతం పెరుగుదల అని వెల్లడించారు. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరిందని చెప్పారు. అంతేకాక, సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్టం వరసగా నెంబర్‌ వన్‌గా నిల్చిందన్న బుగ్గన, ఇది అభివృద్ధి కాక, మరేమిటని ప్రశ్నించారు.

మద్యాన్ని నియంత్రించాం
టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మద్యం విక్రయాలు ప్రైవేటు వారి చేతిలో ఉండేవని, దాంతో వారంతా సిండికేట్‌గా ఏర్పడి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మారని మాజీ మంత్రి బుగ్గన గుర్తు చేశారు. అంతే కాకుండా, ప్రతి షాప్‌కు ఒక పర్మిట్‌రూమ్, ఊరూరా బెల్టు షాప్‌లు.. మొత్తం 43 వేల బెల్టు షాప్‌లు ఉండేవని చెప్పారు. 

తమ ప్రభుత్వం రాగానే, వైన్‌ షాప్‌లను 33 శాతం తగ్గించడంతో పాటు, అన్ని పర్మిట్‌రూమ్‌లు, బెల్టు షాప్‌లను రద్దు చేశామని తెలిపారు. షాప్‌లను పూర్తిగా ప్రభుత్వమే నడపడం, మద్యం విక్రయ వేళలు తగ్గించడం, మరోవైపు ధరలు పెంచడం వల్ల, మద్యం అమ్మకాలు తగ్గినా, ప్రభుత్వ ఆదాయం పెరిగిందని తెలిపారు.

అలా ఎలా ఆపాదిస్తారు?
అన్నింటి కంటే ఎక్కువగా జీత భత్యాలకే రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్న ఆయన, జీత భత్యాల వ్యయం ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల వ్యయం పెరిగిందని చెప్పారు. మరోవైపు సామాజిక పెన్షన్ల వ్యయం రూ.33 వేల కోట్లు కాగా.. దాన్ని కూడా ఇతరులకు ఎలా ఆపాదిస్తారని నిలదీశారు.

ఇది పట్టదా?
నాడు, రాష్ట్రావసరాల కోసం అప్పు చేస్తే.. అప్పులతోనే నెట్టుకొస్తున్నామంటూ నిత్యం దుయ్యబట్టిన ఎల్లో మీడియా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే పని చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.

ఇవీ ఈ ప్రభుత్వ అప్పులు
టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసిందని మాజీ ఆర్థిక మంత్రి తెలిపారు. గత జూన్‌ 20న రూ.2 వేల కోట్లు, జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16న మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ఎందుకు రాయదని ప్రశ్నించిన ఆయన.. ‘మరి మేం చేస్తే అప్పు, టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తే నిప్పా’ అని కడిగి పారేశారు. అంతకు ముందు హయాంలో ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసినా, ఎల్లో మీడియా రాయలేదని ఆక్షేపించారు.

గతంలోనూ వారివే ఎక్కువ
2014–19 మధ్య రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే, తమ హయాంలో 2019–24 మధ్య ఆ పెరుగుదల 12 శాతం మాత్రమే అని మాజీ ఆర్థిక మంత్రి వెల్లడించారు.  రాష్ట్ర విభజన తరవాత, ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే, 2019 నాటికి, అంటే టీడీపీ ప్రభుత్వం గద్దె దిగేనాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరుకున్నాయని.. అంటే టీడీపీ హయాంలో అప్పులు 21.63 శాతం పెరిగాయని చెప్పారు. 

అదే తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు రూ.5.18 లక్షల కోట్లు కాగా, అది 2019–24 మధ్య కేవలం 12.9 శాతం పెరుగుదల మాత్రమే అని తెలిపారు. అయినా ఎల్లో మీడియా దారుణంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

సంపద సృష్టి ఒట్టి మాటే..
సంపద సృష్టిలో తాము స్పెషలిస్టులమని చంద్రబాబు చెప్పుకుంటారని.. కానీ అది పూర్తిగా అవాస్తవమని బుగ్గన వెల్లడించారు.
2014–15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు కాగా, 2019లో ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ మొత్తం కేవలం రూ.1,14,671 కోట్లు మాత్రమే అన్న ఆయన, ఆదాయం ఏటా  6.09 శాతం పెరిగిందన్నారు. 
అదే తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం 16.7 శాతం పెరిగిందన్న ఆయన, ఆ గణాంకాలు చెబుతూ.. 2019–20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు కాగా, 2023–24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరిందని వివరించారు.
ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన తరవాత, 2019 జూలైలో అయినా పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టామన్న ఆయన, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌కు పోవడాన్ని ప్రశ్నించారు.

వాస్తవాలు బయటపడతాయనే..
పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే.. పథకాలకు కేటాయింపులు, రాష్ట్ర అప్పులతో సహా, అన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంటుందని.. టీడీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో గొప్పగా ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని.. అందుకే ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌కు వెళ్తున్నారని ఆక్షేపించారు.

అంతే కాకుండా, మా హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేశామని, అదేపనిగా దుష్ప్రచారం చేశారని.. ఇష్టానుసారం అంకె చెప్పి, తాము 14 లక్షల కోట్ల అప్పులు చేశామని కూడా ఆరోపించారని గుర్తు చేశారు.

నిజానికి తాము అంత అప్పు చేయలేదని, రాష్ట్ర అప్పు ఎంత అన్నది.. ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మరోవైపు సీఏజీ, ఆర్బీఐ రిపోర్టుల్లో ఉందని తెలిపారు. ఆ వివరాలన్నీ బయట పడతాయన్న భయంతోనే, ఈ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌కు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.

ఇవీ వాస్తవ అప్పులు
నిజానికి రాష్ట్ర నికర అప్పు రూ.4,38,278 కోట్లు అన్న బుగ్గన, పబ్లిక్‌ అకౌంట్స్‌ లయబిలిటీ కింద మరో రూ.80,914 కోట్ల రుణాలున్నాయని తెలిపారు. కార్పొరేషన్‌ రుణాలు రూ.2.18 లక్షల కోట్లు కాగా, అవి రూ.2.48 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
 కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.90 వేల కోట్లు, ఇంకా అప్‌లోడ్‌ చేయలేదన్న ఆయన, వాటిని రుణాలుగా ఎలా చూపుతారని ప్రశ్నించారు. ఇంకా ఉద్యోగుల బకాయిలు కూడా కలుపుకున్నా, మొత్తం అప్పులు దాదాపు రూ.7 లక్షల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.

ప్రాధాన్య రంగాలకు ఎక్కువ
 తమ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్య రంగాలకు ఎక్కువ ఖర్చు చేశామని మాజీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌ వెల్లడించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, కీలక మౌలిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. 

 టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ రంగంపై కేవలం రూ.13,255 కోట్లు ఖర్చు చేస్తే, తాము అంతకు మూడు రెట్లకు పైగా ఎక్కువ రూ.47,800 కోట్లు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రి  ఉదహరించారు.

ఇంకా, తాము తీసుకొచ్చిన ‘గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌’ (జీపీఎస్‌) ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement