హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే శ్వేతపత్రాల పేరుతో నాటకం
విశాఖలో గీతం భూ ఆక్రమణల గురించి ఎందుకు మాట్లాడలేదు
మాజీ మంత్రి మేరుగు ధ్వజం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఓ బూటకమని, అబద్ధాలతో కూడిన నిందల పత్రమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు మోపి, అనరాని మాటలు అనడానికే ఈ తంతు సాగించారని మండిపడ్డారు.
ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అత్యంత దారుణంగా పొగరు, కొవ్వు, ఉన్మాదం, మదం వంటి పదజాలం వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సీఎం స్థానంలో ఉన్న బాబు నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరానికి అకౌంట్‌బులిటీ ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. శ్వేతపత్రంలోని ప్రతి అంశం టీడీపీ వారికి సంబంధించినవేనని చెప్పారు. నాగార్జున చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
హామీలు అమలు చేయకుండా దృష్టిని మళ్లించడానికే
చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి, ఇప్పుడు ఇస్తున్న పథకాలను కూడా ఆపేసి, డబ్బుల్లేవని చెబుతున్నారు. ఎన్నికలప్పుడు ఈ విషయం తెలియదా? హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే శ్వేతపత్రాల తంతు తీసుకొచ్చారు. బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు జగన్ మాత్రమేనని, అలా నిలబడలేకే బాబు దూషణలకు పరిమితమయ్యారు.
దసపల్లా భూములు ప్రభుత్వానివి కావని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా దాన్ని పట్టుకుని బాబు నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని మాట్లాడుతున్న చంద్రబాబు గీతం కాలేజీ అక్రమాలపై ఎందుకు నోరెత్తరు? వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ ముసుగులో మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి స్వాహా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందులో 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఎందుకు మాట్లాడరు?
ఇళ్ల పట్టాలపై నిరాధార ఆరోపణలు
వైఎస్ జగన్ నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపైనా చంద్రబాబువి నిరాధార ఆరోపణలు. వైఎస్ జగన్ 28వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకిచ్చారు. మరో 25వేల ఎకరాలు అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎప్పుడైనా ఒక్క కుటుంబానికి సెంటు భూమైనా ఇచ్చారా? పైపెచ్చు కేసులతో అడ్డుకున్నారు. రాజధానిలో 52 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించే దమ్ము బాబుకు ఉందా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేయించండి
ల్యాండ్ రీసర్వే, టైట్లింగ్ చట్టంపైనా చంద్రబాబు అవహేళనగా, తప్పుడు మాటలు కూడా మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది సరైంది కాదని అనుకుంటే, బాబే ప్రధానమంత్రి మోదీని ఒప్పించి, ఆ చట్టాన్ని రద్దు చేయించవచ్చు. ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?
అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దోపిడీ
ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి అడ్డూ అదుపూ లేకుండా ఇసుకను దోచుకుంటున్నారు. ఇసుక ఉచితం అని చెప్పి సీనరేజ్, రవాణా చార్జీల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదీ గర్భాల్లో ఉన్న ఇసుకను కొల్లగొట్టిన గజదొంగలు కూడా బాబు పార్టీ మనుషులే. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఒక్కటీ పారదర్శకంగా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్లాట్‌ఫాం మీద టెండర్లు పిలిచారు. మా ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు, ఐదేళ్లలో రూ.3,825 కోట్లు ఆదాయం వచ్చింది.
గతంలో బాబు పాలనలో ఇన్ని వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయి? దశాబ్దాలుగా గనులను దోచుకుని, అడ్డగోలుగా సంపాదించింది బాబు మనుషులే. ఆయన హయాంలో మైన్స్‌పై ఆదాయంలో పెరుగుదల (సీఏజీఆర్) 17 శాతం నమోదైతే, వైఎస్ జగన్ హయాంలో 40 శాతం. అంటే దోపిడీ బాబు మనుషులు చేసినట్టు కాదా? బాబు హయాంలో నిరుపేదలకు ఒక్కరికి కూడా ఒక ఎకరం భూమి ఇవ్వలేదు.
పైగా రికార్డుల్లో క్లారిటీ లేదంటూ లేనిపోని సాకులు చూపి లక్షలాది ఎకరాలను నిషేధిత జాబితా (22 ఏ)లో చేర్చారు. దీంతో ఆ భూములపై హక్కులు దక్కక, ఆపత్కాలంలో అమ్ముకునే అవకాశం లేక లక్షలాది రైతు కుటుంబాలు నానా ఇబ్బంది పడ్డాయి. అందుకే జగన్ చుక్కల భూములు, నిషేధిత భూములను ఆ జాబితాల నుంచి తొలగించి, అటవీ, ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించి, మేలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment