చోటా మోదీ ఎక్కడ? | Opposition parties stall proceedings in Parliament over Nirav Modi-PNB fraud | Sakshi
Sakshi News home page

చోటా మోదీ ఎక్కడ?

Published Wed, Mar 7 2018 2:11 AM | Last Updated on Wed, Mar 7 2018 2:11 AM

Opposition parties stall proceedings in Parliament over Nirav Modi-PNB fraud - Sakshi

లోక్‌సభ వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులు

న్యూఢిల్లీ: వరుసగా రెండోరోజు కూడా పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్‌ కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోసం విపక్షాలు పట్టుబట్టడంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు బుధవారానికి వాయిదాపడ్డాయి. పీఎన్‌బీ, ఇతర బ్యాంకు స్కాంలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా... చోటా మోదీ (నీరవ్‌ మోదీ) ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. ప్రాంతీయ పార్టీలు కూడా తమ డిమాండ్లపై ఆందోళన కొనసాగించ డంతో ఉభయసభలు నిరసనలతో హోరెత్తాయి. తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలని టీఆర్‌ఎస్, మరాఠీకి ప్రాచీన హోదా కోసం ఎన్డీఏ మిత్రపక్షం శివసేన,  కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకేలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశాయి.

లోక్‌సభలో రెండో రోజూ అదే తీరు..
లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే నినాదాలు చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వాయిదా వేశారు. అనంతరం సభ సమావేశమయ్యాక కూడా అదే పరిస్థితి కొనసాగింది. ‘చోటా మోదీ (నీరవ్‌ మోదీ) ఎక్కడికి పారిపోయారు.. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. నీరవ్‌ను భారత్‌కు తీసుకురండి’ అంటూ కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేశారు. ఆందోళనల మధ్యే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బ్యాంకింగ్‌ రంగంలో ఆర్థిక అవకతవకలపై చర్చకు కేంద్రం సిద్ధమని, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానమిస్తారని చెప్పారు. అయినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్‌ సభను బుధవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభ మూడుసార్లు వాయిదా..
బ్యాంకు కుంభకోణాలు, ఇతర ప్రాంతీయ అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల ఆందోళనలతో రాజ్యసభలో రెండో రోజు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు సిద్ధమని చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌లు చెప్పినా గందరగోళం సద్దుమణగలేదు. దీంతో మూడు సార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో సభ బుధవారానికి వాయిదా పడింది.

త్రిపురలో సైద్ధాంతిక విజయం: మోదీ
త్రిపురలో కమ్యూనిస్టు ప్రభుత్వంపై బీజేపీ భారీ గెలుపును సైద్ధాంతిక విజయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇరవై ఐదేళ్లపాటు కొనసాగిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయటం పార్టీ ఆలోచననే మార్చివేసిందని వ్యాఖ్యానించారు. ఇదే ఊపును రాబోయే నెలల్లోనూ కొనసాగించేందుకు కష్టపడి పనిచేయాలని పార్టీ నేతలను కోరారు. మంగళవారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ‘మన విజయపరంపర కొనసాగుతోంది. ఇప్పుడు కర్ణాటక వంతు అంటూ నేతలు ప్రధానికి స్వాగతం పలికారు’ అని మంత్రి అనంత్‌కుమార్‌ మీడియాకు చెప్పారు. మరోవైపు, జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(ఎన్‌హెచ్‌పీఎస్‌) ‘ఆయుష్మాన్‌ భారత్‌’ అమలు దిశగా సాగుతున్న ఏర్పాట్లపై ప్రధాని మోదీ సమీక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement