రాజ్యసభ సభ్యుడు జినేంద్ర కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్న సభ్యులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు. వరుసగా మూడోరోజూ ఉభయ సభలు ఎటువంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలతో పాటు ఎన్‌డీఏలోని మిత్రపక్షాలైన శివసేన, టీడీపీ, అన్నాడీఎంకే వివిధ అంశాలపై లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనకు దిగాయి.
అట్టుడికిన లోక్‌సభ..
బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, శివ సేన, టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే, తృణ మూల్ కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ వివిధ అంశాలపై నినాదాలతో హోరెత్తించాయి. విగ్రహాల ధ్వంసం, బ్యాంకింగ్ కుంభకోణం, ఏపీకి ప్రత్యేక హోదా, రిజర్వేషన్లు తదితర అంశాలపై నిరసనకు దిగాయి. రూ. 13 వేల కోట్ల బ్యాంకింగ్ కుంభకోణంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అన్నాడీఎంకే, ఆప్ పార్టీలు వెల్‌లోకి దూసుకొచ్చి పెరియార్ విగ్రహం ధ్వంసానికి నిరసన తెలిపింది.
తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ, టీడీపీ, మరాఠీకి ప్రాచీన భాష హోదా కల్పించాలని శివసేన ఆందోళనకు దిగాయి. ఏపీ విభజన చట్టాలన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ నిరసన తెలిపింది. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే స్పీకర్ వాయిదా వేశారు. సభా కార్యకలాపాలకు సభ్యులు అంతరాయం కలిగించడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్య సభలోనూ ఇదే అంశాలపై సభ్యులు నిరస నకు దిగారు. ప్రతిపక్షాలు ఆందోళన చేయ డంపై చైర్మన్ వెంకయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సరైన చర్య కాదని, ప్రజాస్వామ్యానికి విఘాతమని హితవు పలి కారు. అయినా సభ్యులు వినిపించు కోకపోవ డంతో సభను వాయిదా వేశారు.
అఖిలపక్ష భేటీతోనూ కానరాని పరిష్కారం
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం సాయంత్రం అఖిలపక్షాల నేతలతో భేటీ అయి, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. సభకు అంతరాయం కలిగించవద్దని ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లను కోరారు. ఒకట్రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుందనీ, అప్పటి దాకా సంయమనం పాటించాలన్నారు. అయితే, బ్యాంకింగ్ స్కాంపై చర్చ ఏ నిబంధన కింద జరపాలన్న విషయం తేలలేదని కొందరు ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో చర్చతోపాటు ఓటింగ్ కూడా జరపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment