Postponed again
-
మళ్ళీ వాయిదా పడిన పుష్ప 2..?
-
మరోసారి వాయిదా
కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. శుక్రవారం (సెప్టెంబర్ 6న) ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయని కారణంగా మరోసారి వాయిదా పడింది. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది.ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ ‘‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు. -
గ్రూప్-2 వాయిదా యోచనలో తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 2 వాయిదా వేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తం కావడం తో వాయిదాపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. శుక్రవారం సాయంత్రం ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, ఆకునూరి మురళితో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం గ్రూప్-2 వాయిదాపై ప్రకటన చేసే అవకాశం ఉంది.గ్రూప్-2 పరీక్షను ఆగస్టులో నిర్వహించాల్సి ఉండగా, డీఎస్సీ పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉండడం, పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తుండడంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' మళ్లీ వాయిదా !.. కారణం ?
Will Mahesh Babu Sarkaru Vaari Paata Get Postponed Again: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 14) థియేటర్లలో సందడి చేయాల్సింది. దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)ను జనవరి 7న రిలీజ్ చేస్తామని ప్రకటించడం, పలు కారణాలతో 'సర్కారు వారి పాట' మూవీ విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. తర్వాత ఏప్రిల్ ఒకటిన రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే మళ్లీ తాజాగా ఈ డేట్‌కు కూడా విడుదల చేయడం అనుమానమే అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే మహేశ్ బాబుతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ ఇద్దరికి కూడా కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వీళ్లిద్దరూ ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నారు. ఇదే కాకుండా ఇటీవల మహేశ్ బాబుకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇలాంటి కారణాలు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 1 తేదికి సినిమా పూర్తయ్యే సూచనలు కనిపించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 'సర్కారు వారి పాట' రిలీజ్‌ను వాయిదా వేయటం తప్ప మరో అవకాశం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితులన్నీ సవ్యంగా చక్కబడి సినిమా షూటింగ్ పూర్తియ్యాక సినిమాను ఆగస్టు 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదీ చదవండి: సర్జరీ కోసం అమెరికా వెళ్తున్న మహేశ్‌బాబు -
అమెరికా ‘రు(ర)ణ’ రాజకీయం!
అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దేశం అప్పులు.. వాటి చెల్లింపులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ నాటకం ఇంకొన్ని వారాలపాటు సాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి జానెట్ ఎల్లెన్ తాజా ప్రకటనను బట్టి పరిమితిని సకాలంలో పెంచకపోతే డిసెంబరు 15వ తేదీ తరువాత అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారి రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఎదుర్కోనుంది. అమెరికాకు అప్పులేంటి? చెల్లించ లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా.. అలాగే ఇదీనూ. కాకపోతే ఇక్కడ సమస్య డబ్బుల్లేకపోవడం కాదు. అప్పులపై ఉన్న పరిమితిని పెంచితేగానీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం!! పెంచకపోతే ఏమవుతుంది? రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా తొలిసారి తాను చెల్లించాల్సిన రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబరులో ఈ మొత్తం దాదాపు 28 లక్షల కోట్ల డాలర్ల వరకూ ఉంది. సకాలంలో రుణ వాయిదా చెల్లించకపోవడం ప్రతి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాలకు అందే నిధులు తగ్గుతాయి. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ అంచనా ప్రకారం సకాలంలో రుణ పరిమితి పెంచని పక్షంలో అమెరికన్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయంలో నలభైశాతం కోత పడే అవకాశం ఉంది. రక్షణ దళాల సిబ్బందికి పూర్తిస్థాయిలో, సకాలంలో వేతనాలు, ఫింఛన్ల వంటివి చెల్లించలేమని పెంటగాన్ అక్టోబరులోనే ఒక ప్రకటన జారీ చేసింది. వాయిదా చెల్లింపులో విఫలమైతే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఇవన్నీ కలగలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందన్నమాట. తాత్కాలిక ఉపశమనంగా 480 బిలియన్ డాలర్ల అదనపు రుణం తెచ్చుకోవడానికి అక్టోబరులో సెనేట్ ఒకే చెప్పింది.రుణపరిమితిని పెంచుకోవడానికి, రిపబ్లికన్లను ఒప్పించడానికి బైడెన్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్ష రిపబ్లికన్లు ఏమంటున్నారు? వివాదానికి బాధ్యత డెమొక్రాట్లదేనన్నది రిపబ్లికన్ల వాదన. తమ మద్దతు లేకుండా కొత్త అంశాలపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటూండటం వల్లనే వారు నిస్పృహకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. డెమోక్రాట్లు ఇంకోసారి ఏకపక్షంగా పన్నులు విధించడం, ఖర్చు పెట్టడాన్ని తాము అనుమతించేది లేదని మైనార్టీ నేత మిచ్ మెక్కానెల్ స్పష్టం చేశారు. తమ ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు డెమొక్రాట్లు బడ్జెట్ సమీక్షను అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇంత చేయగలిగిన వాళ్లు రుణ పరిమితి పెంపుపై కూడా ఏదో ఒక చర్య తీసుకోవాలని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ డెమొక్రాట్ల వాదనలేమిటి? రుణ పరిమితి పెంపును రిపబ్లికన్లు అడ్డుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని, ప్రమాదకరమైనవని, అమర్యాదకరమైనవి కూడా అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అమెరికన్ సెనేట్‌లో దాదాపు 50 మంది డెమొక్రాట్లు (100 సభ్యులుండే అమెరికా ఎగువసభ సెనేట్‌లో 48 మంది డెమొక్రాట్లకు ఇద్దరు స్వంత్రుల మద్దతు ఉంది. మిగతా 50 మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు) ఉండగా... రుణ పరిమితిని పెంచేందుకు కనీసం మరో పది రిపబ్లికన్ ఓట్లూ అవసరమవుతున్నాయి. మొత్తం రుణాల్లో బైడెన్ హయాంలోనివి మూడు శాతం మాత్రమేనని, మిగిలినవన్నీ గత ప్రభుత్వాలవేనని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్ హయాంలో తాము మూడుసార్లు రుణ పరిమితి పెంపునకు సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమిటీ రుణ పరిమితి కథ? అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరించే పన్నుల మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే అప్పులు చేస్తుంది. ఈ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తుంది. అప్పుల కోసం అగ్రరాజ్యం విడుదల చేసే బాండ్లు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడులుగా భావిస్తారు. 1939లో అమెరికన్ పార్లమెంటు ప్రభుత్వం చేయగలిగే అప్పులపై ఒక పరిమితిని విధిస్తూ చట్టం చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ కనీసం వందసార్లు ఈ పరిమితిని పెంచుకున్నారు. అంటే.. అవసరాన్ని బట్టి మరిన్ని అప్పులు చేసేందుకు ఎప్పటికప్పుడు అవకాశం కల్పించుకున్నారన్నమాట. అయితే ఇలా పరిమితి పెంచుకోవాలన్న ప్రతిసారి కూడా దానిపై కాంగ్రెస్‌లోని ఇరు పక్షాల మధ్య చర్చోపచర్చలు జరుగుతాయి. చివరకు ఇరుపక్షాలు కొన్ని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావడం పరిమితిని పెంచుకోవడం కద్దు. అయితే ఇటీవలి కాలంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. 2013లోనూ రుణ పరిమితిని దాటేసే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యయ ప్రణాళికను రిపబ్లికన్లు పూర్తిగా అడ్డుకున్నారు. అదేమాదిరిగా ఈ సారి కూడా రిపబ్లికన్లు రుణ పరిమితి అంశాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాదాన్ని సృష్టించారు. అయితే... ఇలాంటి విషయాలు చివరి నిమిషం వరకూ సాగడం.. చివరకు రాజీమార్గాలపై తెరవెనుక మంతనాలు, పట్టువిడుపులు, కొన్ని సవరణల తరువాత ఓకే కావడం చరిత్రలో ఇప్పటివరకూ జరిగిన తంతు! -
ప్రధానమంత్రి పెళ్లి మూడోసారి వాయిదా
కోపెన్‌హాగెన్ : పెళ్లి కోసం లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడటం, ఇళ్ల నుంచి పారిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో డెన్మార్క్ ప్రధాని మిట్టే ఫ్రెడ్రిక్సన్ దేశం కోసం మూడోసారి తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఐరోపా సమాఖ్య సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం జరగాల్సిన తన వివాహాన్ని మరోసారి వాయిదా వేశారు. గతంలో కోవిడ్-19 విజృంభణ, లాక్డౌన్ల కారణంగా ఆమె వివాహం రెండుసార్లు వాయిదాపడింది. "ఈ అద్భుతమైన వ్యక్తిని మనువాడేందుకు ఎంతగానో వేచి చూస్తున్నా’ అంటూ తన కాబోయే భర్త ‘బో’తో కలిసున్న ఫోటోను ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. త్వరలోనే తాము ఒకటవుతామని స్పష్టం చేశారు. వివాహం విషయంలో అతను కూడా చాలా ఓపికగా వేచిచూస్తున్నారని చెప్పుకొచ్చిన ఆమె ఐరోపా సమాఖ్య సమావేశాలు డెన్మార్క్ ప్రయోజనాలకు అత్యంత కీలకమని చెప్పారు. ‘వేచిచూడటం అంత సులభం కాదు..మేం ఒక్కటి కావాలనుకున్న శనివారమే బ్రసెల్స్‌లో సమావేశం ఏర్పాటు చేశారు..డెన్మార్క్ ప్రజల ప్రయోజనాలు కాపాడే కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉన్నందున వివాహ తేదీలను మార్చుకోవాల్సి వచ్చింద’ని మిట్టే పేర్కొన్నారు. చదవండి : డీఎన్ఏ గీసిన బొమ్మ -
‘అర్జున్ సురవరం’ మరోసారి వాయిదా!
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న అర్జున్ సురవరం సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టైటిల్ విషయంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడి రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అయితే తాజా సమాచారం ప్రకారం అర్జున్ సురవరం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌తో పాటు సినిమా రిలీజ్‌ను కూడా వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న మజిలీ, చిత్ర లహరి, జెర్సీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటం, అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా భారీ వసూళ్లు సాధిస్తుందన్న టాక్ వినిపిస్తుండటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ అధికారికంగా వెల్లడించారు. మహర్షి రిలీజ్ తరువాత అర్జున్ సురవరం రిలీజ్ అవుతుందని తెలిపారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు. pic.twitter.com/3scqEuhKAO — Asian Cinemas (@AsianCinemas_) 25 April 2019 -
డీఎస్సీ.. వాయిదాలేసి!
టెట్‌కు హాజరైన అభ్యర్థులు : 37వేలు ఎస్జీటీ అభ్యర్థులు : 13వేలు జిల్లాలో ప్రతిపాదిత పోస్టులు : 604 ఆమోదం : 464 కేటాయించిన పీఈటీ పోస్టులు : 103 చూపిన ఖాళీలు : 10 అనంతపురం ఎడ్యుకేషన్/ఎస్కేయూ: డీఎస్సీ ప్రకటన దోబూచులాడుతోంది. అదిగో.. ఇదిగో అనే హడావుడి నిరుద్యోగులను మానసిక సంఘర్షణకు లోనుచేస్తోంది. పోస్టుల విషయంలోనూ ఇప్పటికీ స్పష్టత కొరవడింది. అంకెల గారడీతో ప్రభుత్వం నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తోంది. మొదట 20వేల పోస్టులతో ప్రచారం ప్రారంభించి.. ఆ తర్వాత 14వేలు, 12,400, 9,500.. తాజాగా 6,100 పోస్టులు భర్తీ చేస్తామనడంతో అసలు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనే విషయంలో స్పష్టత కరువైంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ ప్రకటన మంగళవారం విడుదల కావాల్సి ఉంది. అయితే వాయిదా పడింది. ఇంతవరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లపై స్పష్టత రాలేదని కొత్త నాటకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఉద్యోగ నియామకాలకు షెడ్యూల్ ప్రకటించడం, ఆ తర్వాత వాయిదాలు వేయడంపై నిరుద్యోగ అభ్యర్థులు గుర్రుమంటున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించిన విద్యా శాఖ నోటిఫికేషన్లు ఇవ్వకుండానే వాయిదా వేసింది. తాజాగా మూడో దఫా వాయిదా వేయడం గమనార్హం. ఎ‘ట్టెట్టా’.. డీఎస్సీ రాత పరీక్షకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావు 2017 నవంబర్‌లో ప్రకటించారు. టెట్ కమ్ టీఆర్టీ ఒకే పరీక్ష కాకుండా పాత పద్ధతిలోనే టెట్, డీఎస్సీని వేర్వేరుగా నిర్వహిస్తామని టెట్‌కు నోటిఫికేషన్ విడుదల చేశారు. టెట్ ఫలితాలు ప్రకటించిన వెంటనే డీఎస్సీ ప్రకటన చేశారు. మొదటి దఫా ఆన్లైన్లో టెట్ నిర్వహించడంతో సాంకేతిక లోపాలు అధికం కావడానికి తోడు, తిరిగి టెట్ నిర్వహించాలని అభ్యర్థుల కోరిక మేరకు నెల రోజుల వ్యవధిలోనే టెట్‌ను నిర్వహించారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ అంటూ తేదీలు ప్రకటించడం మినహా.. ప్రకటన ఇవ్వకుండా ఊరిస్తూ వస్తున్నారు. దీంతో నిరుద్యోగులు ఆశతో కోచింగ్ సెంటర్లను వదలకుండా శిక్షణ తీసుకుంటూనే ఉన్నారు. ఇంటికి తిరిగి వెళ్లలేక.. కోచింగ్ సెంటర్లలో ఉండలేక నలిగిపోతున్నారు. అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడు డీఎస్సీ షెడ్యూల్ తరచూ వాయిదా పడుతుండటంతో నిరుద్యోగ అభ్యర్థులకు ఖర్చు భారంగా మారుతోంది. అనంతపురం నగర కేంద్రంలోనే కాకుండా.. అవనిగడ్డ, కర్నూలులో ప్రత్యేకంగా డీఎస్సీ శిక్షణ తీసుకుంటున్నారు. గతంలో చివరిసారిగా నిర్వహించిన టెట్‌కు అనంతపురం జిల్లాలో 37వేల మంది పరీక్ష రాశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో బీఈడీ అభ్యర్థులకు డీఎస్సీలో ఎస్జీటీకి అవకాశం కల్పించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల సంఖ్య 50 వేలకు చేరుతోంది. ఇందులో 40వేల మంది దాకా ఇప్పటికే కోచింగ్ తీసుకున్నారు. అనంతపురం నగరంలో డీఎస్సీకి ఒక్కో అభ్యర్థికి రూ.15 వేల ఫీజు, నెలకు హాస్టళ్లకు రూ.2,500, ఇతరత్రా ఖర్చులు రూ.2,500.. ఇలా గత రెండు సంవత్సరాల నుంచి సన్నద్ధమవుతున్నారు. ఏడాదికి ఒక్కో అభ్యర్థికి ఒక లక్షదాకా ఖర్చయింది. అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఫీజు రూ.30 వేలు, నెలకు హాస్టల్‌కు రూ.5 వేల దాకా ఖర్చయినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. ఇలా నిరుద్యోగ అభ్యర్థులు అప్పులు చేసి.. శిక్షణ తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. నిర్దిష్టమైన సిలబస్ అయినప్పటికీ ‘ఆన్లైన్’ డీఎస్సీ ఒక నిర్దిష్టమైన సిలబస్(లిమిటెడ్ సిలబస్) ఉన్న రాత పరీక్ష. డీఎస్సీ నూతనంగా ఆన్లైన్లో జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల షెడ్యూల్ ప్రకటించడమే ఇందుకు తార్కాణం. ఎస్జీటీ రాత పరీక్షకు సాధారణంగా సింహభాగం ఉంటారు. దీంతో ఒక వారం రోజుల పాటు 14 సెషన్లలో పరీక్ష జరుగుతుంది. లిమిటెడ్ సిలబస్ ఉన్న పరీక్ష ఒకే రోజు.. ఒకే సమయంలో.. అభ్యర్థులందరికీ ఏకకాలంలో జరపాలి. కానీ ఇక్కడ విరుద్ధంగా ఆన్లైన్లో జరపాలనే నిర్ణయం వివాదాస్పదమవుతోంది. లిమిటెడ్ సిలబస్‌లో ఉన్న సబ్జెక్టులకు తరచూ ఆన్లైన్ పరీక్ష జరగడంతో ఆఖరు రోజున జరిగే పరీక్ష అభ్యర్థులకు ఏ రకమైన ప్రశ్నలు వస్తాయో అంచనా వేసే అవకాశం ఉంది. కొన్ని ప్రశ్నలు రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల జరిగిన టెట్ ఆన్లైన్లో జరగడంతో ఇలాంటి లోపాలు బహిర్గతమయ్యాయి. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న సెంటర్లలో మూకుమ్మడిగా ప్రతిపాదన చేసుకుని.. అక్కడి సెంటర్లలో పరీక్షలు రాసి.. మాస్‌కాపీయింగ్‌కు పాల్బడినట్లు ఆరోపణలు రావడంతో ప్రకాశం జిల్లాలో ఇటీవలే ఒకర్ని సస్పెండ్ చేశారు. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ ఆన్లైన్ పరీక్షకు మొగ్గు చూపడం.. పాయింట్ మార్క్ వ్యత్యాసంతో ఉద్యోగాలు కోల్పోయే డీఎస్సీ లాంటి పరీక్షలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. గతంలో ఆఫ్‌లైన్ పరీక్షలు జరిపినప్పుడు రెస్పాన్స్ షీట్ ఇచ్చినట్లే.. ఆన్లైన్ పరీక్షలకు రెస్పాన్స్ షీట్లు ఇవ్వకపోవడం కొసమెరుపు. దీన్ని బట్టి ఆన్లైన్ పరీక్షలకు ఎలాంటి విశ్వసనీయత, ప్రామాణికత ఉందో అర్థమవుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. టెట్ రెండుసార్లు నిర్వహించారు డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఇప్పటికి రెండు సార్లు టెట్‌ను నిర్వహించారు. తిరిగి టెట్ కమ్ టీఆర్టీ పేరుతో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటిస్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. నాకు టెట్‌లో 128 మార్కులు వచ్చాయి. 2016 ఆగస్టు నుంచి డీఎస్సీకి సన్నద్ధమవుతున్నాను. నిర్దిష్టమైన సిలబస్‌ను ఇంతవరకు వెల్లడించలేదు. ఇప్పటికైనా కచ్చితమైన డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటించాలి. –శ్రీజ, ధర్మవరం, డీఎస్సీ అభ్యర్థిని ఆన్‌లైన్‌తో భవిత తారుమారు డీఎస్సీ మా భవితను నిర్ణయించే పరీక్ష. పైగా నిర్దిష్టమైన సిలబస్ ఉంటుంది. దీంతో రోజుల తరబడి పరీక్ష నిర్వహిస్తే.. పరీక్షకు ఉన్న విశ్వసనీయత పోతుంది. ఫలితాలు తారుమారవుతాయి. ఒక రోజు ప్రశ్నాపత్రం సులువుగా ఇచ్చి.. తర్వాతి రోజు కఠినంగా ఇస్తే మార్కుల్లో వ్యత్యాసం వచ్చి.. భవిత తారమారయ్యే ప్రమాదం ఉంది. – అనూష, గరిమేకలపల్లి, పేరూరు ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు ప్రతి ఏడాది ఉపాధ్యాయ దినోత్సవానికి డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని స్వయానా మంత్రి గంటా హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లవుతున్నా... కేవలం ఒక డీఎస్సీ నిర్వహించారు. మరోసారి డీఎస్సీ నిర్వహణకు రెండేళ్ల నుంచి దోబూచులాట అడుతున్నారు. మాది నిరుపేద కుటుంబం. ఇప్పటికే రూ.లక్ష దాకా ఖర్చుయ్యింది. నిరుపేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. – రామాంజినేయులు నాయక్, కేకే తండా, గార్లదిన్నె మండలం అప్పులు చేసి హాస్టల్ ఫీజు మాది మధ్య తరగతి కుటుంబం. టీచర్ పోస్టుపై ఆశతో టెట్ రాయగా.. 120 మార్కులు వచ్చాయి. డీఎస్సీ శిక్షణ కోసం ఇప్పటికే రూ.60 వేలు ఖర్చుచేశాను. ఇపుడు అప్పులు చేసి నగరంలోని ఓహాస్టళ్లలో ఉండి డీఎస్సీకి శిక్షణ పొందుతున్నాను. ప్రభుత్వం అదిగో..ఇదిగో అంటూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మా జీవితాలతో చెలగాటమాడుతోంది. సంవత్సరాలుగా ఎదురుచూస్తూ కాలం Výæడుపుతున్నాం. ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకుని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. – భారతి, సంజీవపురం, గార్లదిన్నె మండలం -
చోటా మోదీ ఎక్కడ?
న్యూఢిల్లీ: వరుసగా రెండోరోజు కూడా పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్ కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోసం విపక్షాలు పట్టుబట్టడంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు బుధవారానికి వాయిదాపడ్డాయి. పీఎన్బీ, ఇతర బ్యాంకు స్కాంలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా... చోటా మోదీ (నీరవ్ మోదీ) ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. ప్రాంతీయ పార్టీలు కూడా తమ డిమాండ్లపై ఆందోళన కొనసాగించ డంతో ఉభయసభలు నిరసనలతో హోరెత్తాయి. తెలంగాణలో రిజర్వేషన్ల కోటా పెంచాలని టీఆర్ఎస్, మరాఠీకి ప్రాచీన హోదా కోసం ఎన్డీఏ మిత్రపక్షం శివసేన, కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకేలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశాయి. లోక్‌సభలో రెండో రోజూ అదే తీరు.. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే నినాదాలు చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. అనంతరం సభ సమావేశమయ్యాక కూడా అదే పరిస్థితి కొనసాగింది. ‘చోటా మోదీ (నీరవ్ మోదీ) ఎక్కడికి పారిపోయారు.. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. నీరవ్‌ను భారత్‌కు తీసుకురండి’ అంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. ఆందోళనల మధ్యే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక అవకతవకలపై చర్చకు కేంద్రం సిద్ధమని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తారని చెప్పారు. అయినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ మూడుసార్లు వాయిదా.. బ్యాంకు కుంభకోణాలు, ఇతర ప్రాంతీయ అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల ఆందోళనలతో రాజ్యసభలో రెండో రోజు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు సిద్ధమని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్లు చెప్పినా గందరగోళం సద్దుమణగలేదు. దీంతో మూడు సార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో సభ బుధవారానికి వాయిదా పడింది. త్రిపురలో సైద్ధాంతిక విజయం: మోదీ త్రిపురలో కమ్యూనిస్టు ప్రభుత్వంపై బీజేపీ భారీ గెలుపును సైద్ధాంతిక విజయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇరవై ఐదేళ్లపాటు కొనసాగిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయటం పార్టీ ఆలోచననే మార్చివేసిందని వ్యాఖ్యానించారు. ఇదే ఊపును రాబోయే నెలల్లోనూ కొనసాగించేందుకు కష్టపడి పనిచేయాలని పార్టీ నేతలను కోరారు. మంగళవారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ‘మన విజయపరంపర కొనసాగుతోంది. ఇప్పుడు కర్ణాటక వంతు అంటూ నేతలు ప్రధానికి స్వాగతం పలికారు’ అని మంత్రి అనంత్‌కుమార్ మీడియాకు చెప్పారు. మరోవైపు, జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(ఎన్‌హెచ్‌పీఎస్) ‘ఆయుష్మాన్ భారత్’ అమలు దిశగా సాగుతున్న ఏర్పాట్లపై ప్రధాని మోదీ సమీక్షించారు. -
సింగం 3 మరోసారి వాయిదా..?
సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సీరీస్ సింగం. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ సీరీస్‌లో ఇప్పుడు మూడో భాగం రెడీ అయ్యింది. తొలి రెండు భాగాలకు మించి భారీ బడ్జెట్‌తో మరింత రేసీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సింగం 3 సినిమాను ముందుగా డిసెంబర్ 16నే రిలీజ్ చేయాలని భావించారు. అయితే అందుకు వారం ముందు ధృవ సినిమా రిలీజ్ కావటంతో సింగం 3ని డిసెంబర్ 23కు వాయిదా వేశారు. కానీ ఇప్పుడు 23న కూడా ఈ సినిమా రిలీజ్ ఉండదనే టాక్ వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో పాటు వర్థ తుఫాను దెబ్బకు విలవిలలాడిన ప్రజలు అప్పుడే థియేటర్లకు వస్తారా.. అన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. అదే సమయంలో సెన్సార్ బోర్డ్ సింగం 3 సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వటం కూడా వాయిదాకు కారణం అన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాట యు సర్టిఫికేట్ వచ్చిన సినిమాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో మరోసారి రివ్యూ కమిటీకి వెళ్లి సింగం 3కి యు సర్టిఫికేట్ తెచ్చుకోవాలని భావిస్తున్నారట. అందుకే సినిమాను మరో వారం పాటు వాయిదా వేస్తే బెటర్ అన్న ఆలోచన ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సింగం 3 సినిమా రిలీజ్ డేట్‌పై గురువారమే నిర్మాత జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇవ్వనున్నారు.