సింగం 3 మరోసారి వాయిదా..?
సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సీరీస్ సింగం. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ సీరీస్లో ఇప్పుడు మూడో భాగం రెడీ అయ్యింది. తొలి రెండు భాగాలకు మించి భారీ బడ్జెట్తో మరింత రేసీ స్క్రీన్ప్లేతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సింగం 3 సినిమాను ముందుగా డిసెంబర్ 16నే రిలీజ్ చేయాలని భావించారు.
అయితే అందుకు వారం ముందు ధృవ సినిమా రిలీజ్ కావటంతో సింగం 3ని డిసెంబర్ 23కు వాయిదా వేశారు. కానీ ఇప్పుడు 23న కూడా ఈ సినిమా రిలీజ్ ఉండదనే టాక్ వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో పాటు వర్థ తుఫాను దెబ్బకు విలవిలలాడిన ప్రజలు అప్పుడే థియేటర్లకు వస్తారా.. అన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. అదే సమయంలో సెన్సార్ బోర్డ్ సింగం 3 సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వటం కూడా వాయిదాకు కారణం అన్న టాక్ వినిపిస్తోంది.
తమిళనాట యు సర్టిఫికేట్ వచ్చిన సినిమాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో మరోసారి రివ్యూ కమిటీకి వెళ్లి సింగం 3కి యు సర్టిఫికేట్ తెచ్చుకోవాలని భావిస్తున్నారట. అందుకే సినిమాను మరో వారం పాటు వాయిదా వేస్తే బెటర్ అన్న ఆలోచన ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సింగం 3 సినిమా రిలీజ్ డేట్పై గురువారమే నిర్మాత జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇవ్వనున్నారు.