సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఈ సారి టికెట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఇతర కీలక నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారని టీపీసీసీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఏఐసీసీ అధినేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుని, పూర్తిస్థాయి పనులు ప్రారంభించిన తర్వాత తెలంగాణలో కీలకమార్పులు, పార్టీలో అంతర్గత సంస్కరణలు జరుగుతాయని వారంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగే సాధారణ ఎన్నికలు కాంగ్రెస్‌కే కాకుండా, ఆయనకు వ్యక్తిగతంగా అత్యంత ప్రతిష్టాత్మకం అవుతాయంటున్నారు.
రాహుల్ గాంధీ రాజకీయ మనుగడకు పరీక్ష పెట్టబోయే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థి టికెట్‌పై ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు. ‘రానున్న ఎన్నికల్లో టికెట్ల పంపిణీ, అభ్యర్థుల స్క్రీనింగ్ ఆషామాషీగా ఉండే అవకాశం లేదు. పార్టీలో సీనియర్లు అనే కోణంలో మాత్రమే టికెట్లు వచ్చే అవకాశాల్లేవు. అభ్యర్థి గెలుపోటములు, పనితీరు, వ్యక్తిగత చరిత్రపై ఆధారపడి టికెట్లు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది ఎప్పుడైనా అధిష్టానం పరిధిలోని అంశమే. టీపీసీసీ నుంచి కేవలం ప్రతిపాదనలు, అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి టీపీసీసీ నుంచి వచ్చే ప్రతిపాదనలను కూడా అత్యంత జాగ్రత్తతో పంపించాల్సి ఉంటుంది’ అని పీసీసీ ముఖ్యనాయకుడొకరు వెల్లడించారు.
సీనియర్ అయితే సరిపోదు..
పార్టీలో సీనియర్.. అనే అర్హత ఒక్కటే వచ్చే ఎన్నికల్లో సరిపోదంటున్నారు. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నాయకునికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. టికెట్ల ఎంపికకోసం అభ్యర్థుల జాబితాను పంపేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను త్వరలోనే అధిష్టానం నుంచి వస్తాయని తెలుస్తోంది. మూడుసార్లు ఓడిపోయినవారికి టికెట్‌ను నిష్కర్షగా తిరస్కరించాలనేది ఇందులో ప్రధానమైనదని ఆ నాయకుడు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినవారికి కూడా టికెట్ గల్లంతయ్యే అవకాశముందని ఆయన వివరించారు. వరుసగా మూడుసార్లు అవకాశం ఇచ్చినా గెలవని అభ్యర్థి, ఇక వచ్చే ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం ఉండదనే అంచనాతోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థి వచ్చే ఎన్నికల నాటికి ఈ తేడాను అధిగమించి, గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే అంచనాతో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది.
డీసీసీ అధ్యక్షులకూ...?
అలాగే డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్నవారు కూడా టికెట్లు అడగకూడదని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చాలా స్పష్టంగా సూచనలు చేసింది. అయితే ఈ నిబంధన వల్ల డీసీసీ అధ్యక్షులుగా పనిచేయడానికి చాలామంది నాయకులు విముఖంగా ఉన్నారని, డీసీసీ అధ్యక్షులుగా ఉండటం వల్లనే టికెట్లు నిరాకరిస్తే ఇబ్బంది అవుతుందని అధిష్టానానికి టీపీసీసీ వివరించింది. దీనిపై అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. మరో పక్క డీసీసీ అధ్యక్షులకు కూడా టికెట్లు వస్తాయని, ఆ పదవి టికెట్‌కు అనర్హత కాకుండా చూస్తామని టీపీసీసీ అధ్యక్షుడు భరోసా ఇస్తున్నారు. అయితే పార్టీ అభివృద్ధికోసం జిల్లా అంతా సమన్వయం చేయడానికి డీసీసీ అధ్యక్షుడు పనిచేయాలని, టికెట్లు ఇస్తే డీసీసీ అధ్యక్షుడు కూడా తన నియోజకవర్గానికే పరిమితమైన అనుభవాలు ఉన్నాయని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. నిబంధనల గురించి ఇప్పటికే టీపీసీసీకి ఢిల్లీ వర్గాలనుంచి మౌఖికంగా సమాచారం అందినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment