సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన సెటిలర్ల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సెటిలర్లు, అందులోనూ ఏపీకి చెందిన ఓటర్లకు ఎలా దగ్గర కావాలన్న అంశంపై ప్రత్యేక కసరత్తు చేస్తోంది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న దాదాపు 30 నియోజకవర్గాలపై టీపీసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో ఆరేడు సీట్లలో సెటిలర్లనే రంగంలోకి దింపాలని యోచిస్తోంది.
మిగతా చోట్ల కూడా సెటిలర్లలో సానుకూలత ఉన్నవారిని, వారి సామాజిక వర్గాలకు చెందినవారిని ఎన్నికల గోదాలోకి దింపి ప్రయోజనం పొందేందుకు వ్యూహం రచిస్తోంది ఇందులో భాగంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి ఆంధ్ర ప్రాంతం వారిని నిలబెట్టాలని యోచిస్తోంది. సెటిలర్ల ఓట్లు ఎక్కువున్న ప్రాంతాల నుంచి మాజీ స్పీకర్ (ఉమ్మడి ఏపీ) నాదెండ్ల మనోహర్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వంటి వారిని రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఆదిలాబాద్ టు కోదాడ
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 30 స్థానాల్లో సెటిలర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న (రంగారెడ్డి, మెదక్‌లతో కలిపి) 10 నియోజక వర్గాలకుతోడు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సెటిలర్లు ఉన్నారని, వారి ఓట్లను కొల్లగొడితేనే అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు దక్కుతాయని భావిస్తోంది. గత ఎన్నికల్లో సెటిలర్లు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ సరైన ప్రదర్శన కనబర్చకలేకపోయిందన్న నిర్ధారణకు వచ్చిన టీపీసీసీ నాయకత్వం... ఈసారి కనీసం 15 స్థానాలకంటే ఎక్కువగా గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఇందులో భాగంగానే సిర్పూర్, చెన్నూరు (ఆదిలాబాద్), బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ రూరల్ (నిజామాబాద్), ములుగు (వరంగల్), కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర, పాలేరు, ఖమ్మం (ఖమ్మం), అలంపూర్, గద్వాల, మక్తల్ (మహబూబ్‌నగర్), పఠాన్‌చెరు, సంగారెడ్డి (మెదక్), కోదాడ, సూర్యాపేట (నల్లగొండ), కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి (హైదరాబాద్, రంగారెడ్డి) స్థానాలను ఎంచుకుని ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
అస్త్రాలు రెడీనా?
సెటిలర్లకు దగ్గరవడంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోపాటు ఇతర ముఖ్య నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపారు. గత ఎన్నికలలో గెలవని ప్రాంతాలను టార్గెట్‌గా పెట్టుకోవాలని, ఇందులో సెటిలర్లు ప్రభావితం చేసే నియోజకవర్గాలే కీలకమన్న అభిప్రాయానికి వచ్చారు. సెటిలర్లకు, ముఖ్యంగా ఏపీ సెటిలర్లలో ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి టీఆర్‌ఎస్ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదనే భావన ఆ వర్గాల్లో ఉందన్న అంచనాకు వచ్చారు. ఖమ్మం పట్టణంలో జరిగిన కమ్మ సామాజికవర్గ సమావేశంలో టీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరిగిందని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఓ నేత ప్రస్తావించారు. తుమ్మలతో వెళ్లి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వెంట నడిచినా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావన ఆ సమావేశంలో వ్యక్తమైనట్లు సదరు నేత చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడ్డాక సెటిలర్లకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది.
ప్రచారాస్త్రంగా ‘హోదా’
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్‌సీపీ తదితర పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా టీఆర్‌ఎస్ సభ్యులు లోక్‌సభలో వ్యవహరించిన తీరును కూడా ప్రధానాస్త్రంగా ఎంచుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అవిశ్వాసానికి మద్దతిచ్చి తాము కూడా నోటీసు ఇచ్చామని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరిగిన పోరాటంలో రాహుల్‌గాంధీ ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం తెలిపారన్న అంశాలతోపాటు టీఆర్‌ఎస్ కావాలనే అవిశ్వాసాన్ని అడ్డుకుందన్న అంశాన్ని సెటిలర్లకు వివరించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సెటిలర్లలో ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మల్చుకోవాలని, ఇళ్లు, పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని నిర్ణయించారు.
దీనిపై పీసీసీ ముఖ్యుడొకరు మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి టీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు. ఇతర పార్టీల నుంచి గెలిచిన కొందరు ఆంధ్రా ప్రాంత నేతలను పార్టీలోకి తీసుకున్నారు కానీ వారికి ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. తెలంగాణ ఇవ్వాల్సిందే అని నినదించిన సంఘాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా ప్రత్యేక హోదా కోసం పల్లెత్తు మాట మాట్లాడకుండా కనీసం అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకున్నారు. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాం. సెటిలర్లకు స్పష్టమైన హామీ ఇచ్చి వారిని ఆకట్టుకునేలా మా మేనిఫెస్టో రూపొందిస్తున్నాం’’అని చెప్పారు.
ఎక్కడ్నుంచి ఎవరెవరు..?
అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ భావిస్తోంది. సెటిలర్ల నియోజకవర్గాల్లో ప్రభావం చూపే సామాజిక వర్గాలకు చెందిన నేతలను అభ్యర్థులుగా బరిలో నిలపాలని నిర్ణయించింది. టీపీసీసీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు టికెట్ ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంలో అప్పటి స్పీకర్‌గా మనోహర్ పోషించిన పాత్రతో పాటు ఆయన కుటుంబం హైదరాబాద్‌లోనే స్థిరపడిందన్న కోణంలో ఆయనకు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఆ నియోజకవర్గంలో మనోహర్ సామాజికవర్గం ఓట్లు కూడా ఆయన గెలుపునకు సహకరిస్తాయని యోచిస్తోంది.
అలాగే మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని, తమ పార్టీలోకి వస్తే ఖమ్మం లోక్‌సభ స్థానానికి నామా నాగేశ్వరరావును నిలబెట్టాలనే చర్చ జరుగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి, సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును పార్టీలోకి తీసుకువచ్చి నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ లేదా నిజామాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేయించాలని యోచిస్తోంది. మొత్తంగా సామాజిక వర్గాల కూర్పు, సెంటిమెంట్‌లను ఆసరాగా చేసుకుని సెటిలర్లు ఎక్కువున్న నియోజకవర్గాల్లో గెలుపు తీరాన్ని చేరాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment