సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమన్న భావనలో ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రంలో విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెస్తోంది. తమతో కలసి రావాలంటూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతోపాటు టీడీపీతో సంప్రదింపులు జరుపుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ సుముఖంగానే ఉంది. ఆ పార్టీ తెలంగాణ నేతలు దాదాపుగా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇటీవల విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో సమావేశం సందర్భంగా.. కొందరు కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన ప్రతిపాదనను తెలంగాణ టీడీపీ నేతలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున దీనిపై ఇప్పుడే ఓ అభిప్రాయానికి రావడం మంచిది కాదని బాబు వారించినా.. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీకి బలమైన కేడర్, ఓట్లు ఉన్న దాదాపు 20 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడొకరు గడచిన ఎన్నికల్లో టీడీపీకి లభించిన ఓట్ల వివరాలతో ఓ నివేదికను సిద్ధం చేసుకున్నారు. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో సీపీఐ ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో తమకు 6 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరుతోంది. ఆ పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి పలుమార్లు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. సీపీఎం కూడా తమతో వస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మినహా మెజారిటీ నేతలు కాంగ్రెస్‌తో కలసి పోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. ఓవైపు జేఏసీ నేత కోదండరాం కొత్త పార్టీ కోసం సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు పార్టీ వద్దంటూ కాంగ్రెస్ సీనియర్లు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నందున బీజేపీతో పొత్తు విషయంలో పీసీసీ సుముఖంగా లేకపోయినా ఆ పార్టీ నేతలు కొందరు రాష్ట్ర స్థాయిలో పొత్తు పెట్టుకున్నా ఫర్వాలేదన్న ధోరణిలో ఉన్నారు. అదే నిజమైతే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఓ వైపు టీఆర్‌ఎస్, మజ్లిస్, ఇంకోవైపు విపక్ష పార్టీలు పోటీ పడతాయి.
సర్వే ఫలితాలతో ఏకీకరణ యత్నాలు
ఎన్నికలకు ఏడాది సమయం మిగిలి ఉన్న తరుణంలో కాంగ్రెస్ నేతలు కొందరు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించారు. ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల్లో (పాత) టీఆర్‌ఎస్ గణనీయమైన స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఐదు లేదా ఆరు స్థానాలు మించి రాకపోవచ్చని ఆ సర్వేల్లో తేలింది. దక్షిణ తెలంగాణలోని ఐదు జిల్లాల్లో (పాత) గడచిన ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ బాగా పుంజుకున్నా.. టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు చెపుతున్నాయి.
దీంతో ఒంటరిగా పోటీ చేయడం కంటే.. కమ్యూనిస్టు పార్టీలు, టీడీపీతో కలసి వెళ్తే బాగుంటుందని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే టీడీపీ నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. టీడీపీ, లెఫ్ట్ పార్టీలతో కలసి పోటీ చేస్తే ఉత్తర తెలంగాణలో 11 నుంచి 15 స్థానాలు, దక్షిణ తెలంగాణలో 20 నుంచి 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందన్న అంచనాల్లో కాంగ్రెస్ ఉంది. అన్ని పార్టీలు కలసి పోటీ చేస్తే పరిస్థితుల్లో మార్పులు వస్తాయని, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి రావడానికి దోహదపడు తుందని ఆ పార్టీ నేతలంటున్నారు.
‘‘ఈ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. అయితే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరుగుతోంది. ఉద్యోగుల్లో కూడా వ్యతిరేక ధోరణి కనిపిస్తోంది. కానీ అది టీఆర్‌ఎస్ విజయావకాశాలను దెబ్బతీసే స్థాయిలో లేదు’’అని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. సీపీఐ, సీపీఎం, టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్తే మాత్రం గెలుపు కోసం టీఆర్‌ఎస్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని, విజయావకాశాలు చెరిసగం ఉంటాయని ఆ నేత విశ్లేషించారు.
టీడీపీ కలసి వస్తుందా?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ తమతో కలసి వస్తుందా లేదా అన్న అంశంపై కాంగ్రెస్‌కు ఇంకా స్పష్టత లేదు. టీఆర్‌ఎస్‌కు లోపాయికారిగా టీడీపీ మద్దతు ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం కాంగ్రెస్‌తో కలసి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు.
తమ అభిప్రాయంతో నాయకత్వం విభేదిస్తే తెలంగాణలో టీడీపీ ఆనవాళ్లు కూడా ఉండవని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. పొత్తులనేవి ఎన్నికల సమయంలో తీసు కోవలసిన నిర్ణయాలని అధినేత చెపుతున్నారని, అందువల్ల కాంగ్రెస్ తో కలసి ఎన్నికలకు వెళ్లకపోవడం అన్నది ఉండదని ఆ నేత అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోలేకపోతున్నా అంతిమంగా కాంగ్రెస్‌తోనే పొత్తు ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యుడొకరు చెప్పారు.
‘‘మాకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అది బాగా తగ్గిపోయింది. ఇప్పటికీ మాకు కొన్ని నియోజకవర్గాల్లో 12 నుంచి 15 శాతం ఓట్లు ఉన్నాయి. అలాంటి 15 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అవకాశం ఇస్తే పొత్తు ఉంటుంది. సీట్ల విషయంలో రెండు మూడు తగ్గినా పెద్దగా పట్టింపు ఉండదు’’ అని ఆ రాజ్యసభ మాజీ సభ్యుడు పేర్కొన్నారు.
సీపీఐ ఓకే.. బెట్టు చేస్తున్న సీపీఎం
కాంగ్రెస్‌తో వెళ్లేందుకు సీపీఐ దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. తమకు 4 సీట్లలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్‌కు సూచించింది. సీపీఎం విషయంలోనే ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో అయిష్టంగా ఉన్నారు. పార్టీలో మెజారిటీ నేతలు, కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్‌తో కలసి వెళ్లాలని కోరుతున్నారు.
ఈ విషయంలో వీరభద్రం మొండిగా వ్యవహరిస్తే పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని మాజీ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే 2019 తర్వాత పార్టీ దుకాణాన్ని మూసుకోవడమేనని ఓ సీనియర్ నేత స్పష్టం చేశారు. ‘మా పార్టీ వేదికల్లోనూ ఇదే చెపుతున్నాం. కానీ కొందరు పార్టీని ప్రైవేట్ ఆస్తిగా పరిగణిస్తున్నారు. అది ఎంతో కాలం నడవదు’ అని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
కోదండరాంతో కాంగ్రెస్ సంప్రదింపులు
పార్టీ పెట్టవద్దంటూ జేఏసీ నేత కోదండరాంను కాంగ్రెస్ నేతలు బతిమాలుతున్నారు. పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేస్తే అది టీఆర్‌ఎస్‌కు మేలు చేస్తుందని వారంటున్నారు, అయితే కోదండరాం ఈ వాదనను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసినా, చేయకపోయినా తనకంటూ ఓ జెండా, ఎజెండా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
ఇప్పటికిప్పుడు కాకపోయినా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు తనకు అవకాశం ఉందని ఆయన విశ్వసిస్తున్నారు. తనను కలిసిన కాంగ్రెస్ నేతలతోనూ ఆయన ఈ అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు. జేఏసీలో చురుగ్గా ఉన్న వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇప్పించుకోవడానికి ఆయన సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. కోదండరాం అంగీకరిస్తే ఆయన పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ కూడా సుముఖంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment