భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్‌రెడ్డి) (సీపీఎం) , బద్దం నర్సింహారెడ్డి (బీఎన్‌రెడ్డి (కాంగ్రెస్)
ఒకరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కమ్యూనిస్టు ఉద్యమనేత భీమిరెడ్డి నర్సింహారెడ్డి. ఆయనను అందరూ బీఎన్‌రెడ్డి అని పిలుస్తారు. మరొకరు వాస్తుశిల్పిగా ప్రసిద్ధిగాంచిన బద్ధం నర్సింహారెడ్డి. ఈయననూ అందరూ బీఎన్‌రెడ్డి అనే పిలుస్తారు. వీరిద్దరినీ కూడా బీఎన్‌రెడ్డి అంటేనే అందరికీ తెలుస్తుంది. ఈ ఇద్దరూ రద్దయిన మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ప్రత్యర్థులుగా చెరొక పార్టీ నుంచి పోటీపడ్డారు. ఇద్దరికీ ఓటర్లు చెరొకసారి పట్టం కట్టారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రెండుసార్లు బీఎన్‌రెడ్డి వర్సెస్ బీఎన్‌రెడ్డిగా రసవత్తరంగా ఎన్నికలు సాగాయి. ఇరువురు కూడా మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడేసి పర్యాయాలు ఎన్నికైన వారే. మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఏర్పడి 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో రద్దయింది. 1971–77, 1984–89, 1991–96లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి పార్లమెంట్‌కు సీపీఎం తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. 1989–91, 1996–98, 1998–99లో మూడు పర్యాయాలు బద్దం నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు.
రెండుసార్లు ముఖాముఖి
మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీఎన్ రెడ్డి (భీమిరెడ్డి నర్సింహారెడ్డి), బీఎన్ రెడ్డి బద్దం నర్సింహారెడ్డి మధ్య పోటీ నెలకొంది. అప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి 1989లో సీపీఎం తరఫున పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ తరఫున బద్దం నర్సింహారెడ్డి పోటీ చేశారు. బద్దం (కాంగ్రెస్)కి 3,96,615 ఓట్లు రాగా, భీమిరెడ్డి (సీపీఎం)కు 3,61,620 ఓట్లు వచ్చాయి. బద్దం 34,995 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1991లో మరోసారి వీరిద్దరూ మళ్లీ తలపడ్డారు. భీమిరెడ్డికి 3,09,249 ఓట్లు రాగా బద్దం నర్సింహారెడ్డికి 3,00,986 ఓట్లు వచ్చాయి. బద్దంపై భీమిరెడ్డి 8,263 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండుసార్లూ బీఎన్ రెడ్డి వర్సెస్ బీఎన్ రెడ్డిగా ఎన్నికలు సాగడంతో ఓటర్లు తికమకకు గురైనా.. మొత్తానికి ఇద్దరికీ చెరోసారి పట్టం కట్టారు. - మల్లె నాగిరెడ్డి, మిర్యాలగూడ
Comments
Please login to add a commentAdd a comment