నాకు..నా బిడ్డకు టిక్కెట్లు! | Controversy On Redya nayak Comments in TRS Party | Sakshi
Sakshi News home page

నాకు..నా బిడ్డకు టిక్కెట్లు!

Published Sat, Nov 18 2017 12:33 PM | Last Updated on Sat, Nov 18 2017 3:02 PM

Controversy On Redya nayak Comments in TRS Party - Sakshi - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తనకు, తన కూతురు, మాజీ ఎమ్మెల్యే కవితకు టీఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని డోర్నకల్‌ ఎమ్మె ల్యే రెడ్యానాయక్‌ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రెడ్యా వ్యాఖ్యల అంతరార్థం ఏమిటో తెలియక శ్రేణులన్నీ ఆలోచనల్లో తలమునకలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్‌ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెడ్యానాయక్, ఆయన కూతురు మాలోతు కవిత పోటీచేశారు. రెడ్యానాయక్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సత్యవతి రాథోడ్‌పై గెలిచి, ఆతర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కవిత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌ చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

అయినా ఎమ్మెల్యేతో కలిసి ఏ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, నియోజకవర్గంలోనే పర్యటిస్తూ తన అనుచరులకు, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. డోర్నకల్‌ నియోజకవర్గంలో సత్యవతిరాథోడ్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగే ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని వారు పావులు కదుపుతున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచిన, ఓడిన అభ్యర్థులు అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్నారు. ఇరువర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పనిచేస్తూ వస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలతో..
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే సీట్లు అంటూ సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. తాజాగా సిట్టింగ్‌లకు మూడు నెలలు ముందుగానే టిక్కెట్లు ఇచ్చి నియోజకవర్గాలకు పంపుతానని ఆయన చెప్పారు. సీఎం కేసీఆ ర్‌ పదేపదే ఇలా చెప్పడంతో ఆశావహులు సీఎం వ్యా ఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర కమిటీలో పలువురికి పదవులను కట్టబెట్టారు. ఇందులో భాగంగా డోర్నకల్‌ టికె ట్‌ ఆశిస్తున్న సత్యవతిరాథోడ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, మహబూబాబాద్‌లో టికెట్‌ ఆశిస్తున్న కవిత కు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. టిక్కెట్లు సర్థుబాటు చేయలేని వారికే పార్టీ పదవులను ఇచ్చారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అందుకే సత్యవతిరాథోడ్‌ నియోజకవర్గంలో తిరగడాన్ని తగ్గించుకుందని కూడా చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో సత్యవతి అనుచరులను రెడ్యానాయక్‌ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా ఉంది.

దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో రేపో, మాపో సత్యవతి వర్గీయులు రెడ్యా వెంట వెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కానీ, మహబూబాబాద్‌ నియోజకవర్గంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రెడ్యానాయక్‌ కూతురు, మాజీ ఎమ్మెల్యే కవిత నియోజవర్గంలో సిట్టింగు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు తగ్గకుండా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు, జనానికి ఎమ్మెల్యేతో పోటీపడుతూ పరామర్శిస్తున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. శంకర్‌నాయక్‌ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడనే ఆలోచనలో ఉన్న ఆమె తనకే టికెట్టు ఖచ్చితంగా వస్తుందనే భావనలో ఉన్నారు.

రెడ్యా వ్యాఖ్యలతో...
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెడ్యానాయక్‌ వచ్చే ఎన్నికల్లో ‘నాకు.. నా కూతురుకు టిక్కెట్లు’ అని వ్యాఖ్యలు చేశారు. రెడ్యా వ్యాఖ్యల తీరు, నియోజకవర్గంలో కవిత పర్యటిస్తున్న జోరు చూస్తుంటే డోర్నకల్‌లో రెడ్యానాయక్‌కు, మహబూబాబాద్‌లో కవితకు టిక్కెట్లు వస్తాయనే భావన కలుగుతోంది. కానీ, ఒకే కుటుంబంలో తండ్రీ కూతుళ్లకు టిక్కెట్లు ఇస్తారా? మూడున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి అధికార పార్టీలో చేరిన ఆశావాహుల సంగతేంటి? ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఇస్తే రాష్ట్రంలోనూ మరెన్నో కుటుంబాల నుంచి ఈ డిమాండ్‌ వస్తుందనే చర్చ జరుగుతోంది. రెడ్యానాయక్‌ ఎంపీగా పోటీచేస్తారని, కవిత డోర్నకల్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని.. అలా రెడ్యానాయక్‌ రెండు టికెట్లు అని ప్రకటించి ఉంటారని మరో చర్చ వినిపిస్తోంది.

అదే నిజమనుకుంటే రెడ్యానాయక్‌ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు రవిచంద్రనాయక్‌ ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారనే విషయం కూడా ఉంది. అదీకాక రెడ్యానాయక్‌ వ్యూహాత్మకంగా తన మనస్సులో ఉన్న మాటను అధిష్టానానికి తెలియజేసేందుకు ఈ ప్రకటన చేశారనే వాదన కూడా లేకపోలేదు. మొత్తానికి రెడ్యానాయక్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ వర్గీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శంకర్‌నాయక్‌ కూడా ఎంత వరకైనా సరే నియోజకవర్గాన్ని, టిక్కెట్టును వదిలేది లేదనే పట్టుదలగానే ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగులకే సీట్లన్న సీఎం కేసీఆర్‌ అభీష్టానికి వ్యతిరేకంగా రెడ్యానాయక్‌ మాట్లాడటం, కవిత వ్యవహరిస్తుండటం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని శంకర్‌నాయక్‌ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జిల్లాలో రెడ్యానాయక్‌ వ్యాఖ్యల అంతరార్థమేమిటో అంతుబట్టక టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement