
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల దాడి చేశారు. కరోనా మహమ్మారి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నా కేంద్ర చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. మౌనంగా ఉంటూ కరోనాకు మోదీ లొంగిపోయాడని ఘాటుగా ట్వీట్ చేశారు. జూన్ 9 తర్వాత కరోనాపై కేంద్ర మంత్రుల బృందం భేటీ జరగలేదు. జూన్ 11 తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా సంక్షోభంపై సమీక్ష చేయలేదు. ఈ అంశాలకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన వార్తను శనివారం ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరాడకుండా మోదీ చేతులెత్తేశారని విమర్శించారు.
(చదవండి : భారత్‌లో 5లక్షలు దాటిన కరోనా కేసులు)
కాగా, దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రికార్డుస్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండగా... మరణాలు కూడా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం నాటికి దేశంలో కరోనా కేసులు సంఖ్య 5లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 18,552 కేసులు నమోదు కాగా, 384 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో 5,08,953 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 15,685 మంది మృతి చెందగా, 2,95,881 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 1,97,387 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment