సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్‌సభ సీట్లకు జరుగుతున్న ఎన్నికలను ప్రభావితం చేసే ఓ అంశం నేడు ప్రచారాస్త్రమైంది. అక్రమ వాణిజ్య సంస్థలు, దుకాణాలను మూసువేయడం కోసం కొనసాగుతున్న ‘స్పెషల్ డ్రైవ్’ అది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మొదటి డ్రైవ్ 2006లోనే ప్రారంభంకాగా, తాజా డ్రైవ్ 2017, డిసెంబర్ నెలలో ప్రారంభమైంది. దీని క్రింద 2019, జనవరి 31వ తేదీ నాటికి ఢిల్లీ నగరంలో 10,533 షాపులను మూసివేశారు.
ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ సీలింగ్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ మూడు పాలక మండళ్లలోను బీజేపీయే అధికారంలో ఉంది. ఈ దుకాణాదారులంతా సంప్రదాయంగా బీజేపీ విధేయులు. ఇప్పుడు వారంతా బీజేపీ ఆగ్రహంతో రగిలిపోతున్నారని, వారు ఈసారి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయక పోవచ్చని బీజేపీలోని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీలింగ్‌కు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులంతా రోడ్డెక్కి ఆందోళన చేయడంతో స్థానిక బీజేపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. వ్యాపారుల సమస్యకు సామరస్య పరిష్కారాన్ని వెతకాలంటూ ఓ వర్గం వ్యాపారుల పక్షం వహిస్తోంది. ఏదేమైనా ఈ సమస్య ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మీదకు నెట్టివేసేందుకు ఇరువర్గాలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి.
ఢిల్లీ మాస్టర్ ప్లాన్‌ను అధికారంలోని ఆప్ ప్రభుత్వం మార్చిందని, అలా మార్చకపోయి ఉన్నట్లయితే నేడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేశ్ భాటియా వాదిస్తున్నారు.
మరోపక్క అరవింద్ కేజ్రివాల్ వివిధ వ్యాపార వర్గాల నాయకులతో ఇప్పటికే పలు విడతలుగా చర్చలు జరిపారు. రాష్ట్ర హోదాకు వారి సమస్యలకు లింకు పెట్టారు. రాష్ట్ర హోదా వచ్చినట్లయితే వ్యాపారం మరింత విస్తరిస్తోందంటూ వారికి ఆశ చూపిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వచ్చినట్లయితే పది రోజుల్లో మూసివేసిన షాపులను తెరిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఏదేమైనా వ్యాపారుల సమస్యే నేడు హాట్ ఠాపిక్‌గా మారింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12వ తేదీన పోలింగ్ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment