సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి, టీడీపీ, సీపీఎంతో పాటు అన్ని లౌకిక శక్తులతో కలిసి పోరాటాలు చేస్తామని సీపీఐ పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్, టెండర్లు, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర మహాసభలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్‌లమంగళవారం జరిగిన మూడో రోజు సభల వివరాలను పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాకు వెల్లడించారు.
ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ కాజేశారని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపిస్తే కుటుంబంతో సహా ఆయన జైలుకెళ్లడం ఖాయమన్నారు. కేసీఆరే సీబీఐ విచారణ కోరి పారదర్శకత నిరూపించుకోవాలన్నారు. ‘‘నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా గొర్రెలు, మేకలు, చేపల పేరుతో ఆయా వర్గాలకు అంతర్గత అన్యాయం చేస్తున్నారు. ఇంటింటికీ ఉద్యోగమిస్తామన్న టీఆర్‌ఎస్ ఇప్పుడు మోసం చేసింది. రైతులకు చేసిందేమీ లేదు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లివ్వలేదు. రాష్ట్రంలో 6 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు.
కేవలం రూ.5 వేల కోట్లతో పాలమూరులోని పెండింగు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు. సీఎం సహాయ నిధి నుంచి పేదలను ఆదుకోవడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ప్రధాని మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో రెవెన్యూ మిగులు బూటకం. అప్పులు భారీగా పెరిగాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ నిధులు, వినియోగంపై ఆర్థిక సంఘం విచారణ జరిపించాలి. రైతులను ఆదుకోవడంలో, మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజా ఉద్యమాలకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? సచివాలయానికి రాని, ప్రజల సమస్యలను వినని సీఎం ప్రజలకెందుకు?’’అని దుయ్యబట్టారు.
ఫాసిస్టు మోదీ: అతుల్ కుమార్
కేంద్రంలో ఫాసిస్టు తరహాలో మోదీ పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ విమర్శించారు. ‘‘మోదీ పాలన హిట్లర్ తరహాలోనే ఉంది. కార్పొరేట్లకు, సంపన్నులకు, బడా పెట్టుబడిదారులకు ఆయన ఊడిగం చేస్తున్నారు’’అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment