పోరుకు సిద్ధంకండి | CPM Leaders Slams Modi And Govt | Sakshi
Sakshi News home page

పోరుకు సిద్ధంకండి

Published Thu, Apr 19 2018 2:05 AM | Last Updated on Sat, Oct 20 2018 5:26 PM

CPM Leaders Slams Modi And Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత తాత్వికతను హిందుత్వగా మార్చేందుకు సంఘ్‌ పరివార్‌ శక్తులు కుట్ర చేస్తున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉండే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రగతిశీల, వామపక్ష శక్తులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయన్నారు. గోరక్షణ పేరుతో దళితులు, మైనార్టీలను ప్రైవేటు సైన్యాలు చంపేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న మతతత్వ దాడుల నుంచి దేశ సమైక్యతను కాపాడే బాధ్యత సీపీఎం కార్య కర్తలపై ఉందని, ఆ దిశగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం నగరంలో ప్రారంభమైన సీపీఎం 22వ జాతీ య మహాసభల్లో ఏచూరి ప్రారంభోపన్యాసం చేశారు. భారత సమాజంలో అమానవీయత చొరబడిందని, మతతత్వం కోసం అత్యాచారాలను ఆయుధంగా వాడుకునే దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఏచూరి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

మతతత్వాన్ని ఓడించాలి 
ప్రజలు, ప్రజాస్వామ్య గణతంత్రం బహుముఖ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలోని కేంద్ర సర్కారు విధానాలు ప్రజలను తీవ్ర కష్టాలకు గురిచేస్తున్నాయి. సామాజిక శక్తుల ఐక్యత, సమైక్యతకు విఘాతం కలిగిస్తున్నాయి. భారత సమాజంలో అమానవీయత చొరబడిందనేందుకు కఠువా, ఉన్నావ్‌లలో జరిగిన అత్యాచార ఘటనలే నిదర్శనం. మతతత్వ ఎజెండాలో భాగంగా అత్యాచారాలను ఆయుధంగా వాడుకోవడం సిగ్గుచేటు. దీన్ని కచ్చితంగా ఓడించాలి. ఈ సవాళ్లకు తోడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మరో నాలుగు విధానాలు ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసేలా, దేశ గణతంత్రాన్ని బలహీనపరిచేలా ఉన్నాయి. నయా ఉదారవాద విధాన దాడులు దేశంలో అనేక కోణాలను ఆవిష్కరిస్తున్నాయి. మతతత్వ శక్తులు గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక ఐక్యతను §ðదెబ్బతీస్తోంది. పార్లమెంటరీ, రాజ్యాంగ వ్యవస్థలపై అప్రజాస్వామికంగా దాడులు జరుగుతున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదానికి భారత్‌ భాగస్వామిగా మారిపోతోంది. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని విస్మరించి అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా–ఇజ్రాయెల్‌–భారత్‌ కుమ్మక్కవుతున్నాయి. 

సంక్షోభంలో వ్యవసాయం 
నయా ఉదారవాద విధానాల కారణంగా దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. ఒక్క శాతం ఉన్న ధనవంతులు దేశంలోని 73 శాతం సంపదను పోగుచేసుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమవడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ గాలికొదిలేశారు. నోట్లరద్దు, జీఎస్టీతో దేశంలోని చిన్న తరహా పరిశ్రమలు ఛిన్నాభిన్నం అయిపోయాయి. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేని రంగం లేదు. ప్రైవేటీకరణ కాని ప్రభుత్వ రంగ సంస్థ లేదు. శ్రామిక వర్గం ఆందోళనలో ఉంది. కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కుతున్నారు. 

గోరక్షణ పేరుతో చంపుతున్నారు 
దేశంలో ఎక్కడికక్కడ ప్రైవేటు సైన్యాలు ఏర్పాటవుతున్నాయి. గోరక్షణ పేరుతో దళితులు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చంపుతున్నారు. ఏం ధరించాలో, ఏం తినాలో, ఎవరితో స్నేహం చేయాలో కూడా వారే చెబుతున్నారు. వారి మాట వినని వారిపై దాడులు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల నేతృత్వంలోని ఈ ప్రైవేటు సైన్యాలు సామాజిక స్థితులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కశ్మీర్‌ లోయలో అస్థిరత నెలకొంది. మేధావులపై దాడులు చేస్తున్నారు. హేతుబద్ధతపై అహేతుకత దాడి చేస్తోంది. భారత చరిత్రను వక్రీకరించి దాని స్థాయిని హిందూ పురాణాల స్థాయికి తీసుకెళ్తున్నారు. ప్రగతిశీల ఆలోచనలపై దాడులు చేస్తున్నారు. 

వారి బారి నుంచి కాపాడాల్సింది మనమే 
మతతత్వ శక్తులకు వామపక్షాలను లక్ష్యంగా చేసుకున్నాయి. బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి. వందలాది మంది వామపక్ష కార్యకర్తలను చంపేస్తున్నారు. మతతత్వ శక్తుల బారి నుంచి ప్రజాప్రయోజనాలను కాపాడడంలో మనం ముందునుంచీ ఛాంపియన్‌గానే ఉన్నాం. దేశ ఐక్యతను పెంచే ప్రత్యామ్నాయ విధానాలను తీసుకురావాల్సింది వామపక్షాలే. అనితర ప్రజాపోరాటాలను నిర్మించడంలో వామపక్షాల ఐక్యత ఎంతో అవసరం. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసేలా పోరాటాలు నిర్మించాలి. దేశంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఈ శక్తుల ప్రత్యామ్నాయ విధానాలే మార్గం కావాలి. లౌకిక ప్రజాస్వామిక శక్తులను సమీకరించి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలి. ప్రజా పోరాటాలను ఉధృతం చేసి దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సాధించాలి. 

తరలివచ్చిన ఎర్రదండు 
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. ఇందులో కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్, బిమన్‌బోస్, బృందా కారత్, ఎం.ఏ.బేబీ, ఎస్‌.రామకృష్ణన్‌ పిళ్‌లై, కె.బాలకృష్ణన్, సూర్యకాంత్‌ మిశ్రా, ఎ.కె.పద్మనాభన్, హన్నన్‌ముల్లా, సుభాషిణీ అలీ, ఎండీ సలీం, జి.రామకృష్ణన్, బీవీ రాఘవులతో పాటు తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్, పోతినేని సుదర్శన్, పుణ్యవతి, చెరుపల్లి సీతారాములు, అరుణ్‌కుమార్, టి.సాగర్, ఎస్‌.వీరయ్య, ఎస్‌.రమ, నున్నా నాగేశ్వరరావుతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 846 మంది ప్రతినిధులు హజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement