సాక్షి, న్యూఢిల్లీ : మేఘాలయ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్ హిందీలో ప్రసంగించడం వల్ల పలు వర్గాల నుంచి ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. మనం బతుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పొరపాటు పడడం లేదా తప్పుగా అర్థం చేసుకోవడం అత్యంత సహజం. అందుకనే ఏ విషయాన్నైనా అన్ని కోణాల నుంచి పరిశీలించి విశ్లేషించాల్సి ఉంటుంది. గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉపయోగించే ఇంగ్లీషు భాషను కాదని ఉద్దేశపూర్వకంగానే హిందీ భాషలో మాట్లాడారా?
అలా అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే మేఘాలయ, ముఖ్యమంత్రి ఈశాన్య రాష్ట్రాలు తమ భాషా, సంప్రదాయాలకు ఇచ్చే ప్రాధాన్యతను గుర్తించడంలో మేఘాలయ గవర్నర్ గంగా ప్రసాద్ విఫలమయ్యారని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. అలాంటప్పుడు ఇది అమాయకత్వంతో జరిగిన పొరపాటా? ఏమో కావచ్చు! కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. హిందీ రాష్ట్రాల్లో ప్రాబల్యం కలిగిన ఆ పార్టీ జాతీయ భాషగా హిందీని నిర్బంధం చేయాలని యోచిస్తున్న విషయం తెల్సిందే. కేంద్ర ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో తమకు అనుకూలంగా గవర్నర్లను ఉపయోగించిన విషయం కూడా అనుభవ పూర్వకమే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ హిందీలో మాట్లాడారన్నది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒకే దేశం, ఒకే గుర్తింపు, ఒకే భాష అన్న నినాదంతో బీజేపీ లబ్ధి పొందాలనుకుంటోందన్నది కాంగ్రెస్ వాదన.
గవర్నర్ హిందీలో మాట్లాడినంత మాత్రాన స్థానిక భాష కూడా హిందీ అవుతుందా? రాష్ట్రం కాషాయం పులుపుకుంటుందా? రాష్ట్ర గవర్నర్‌కు ఇంగ్లీషుకన్నా హిందీలోనే అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం ఉందేమో! ప్రభుత్వ పాలన, ప్రజల సాధికారత, పారదర్శక ప్రాధాన్యత గురించి ప్రతిపక్షం పాలకపక్షాన్ని నిలదీస్తే బాగుంటుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకత్వాన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన రోజున ఆ పార్టీ జెండాలకన్నా రాష్ట్రంలో ఎక్కడ చూసిన బీజేపీ జెండాలే కనిపించాయి. 60 సీట్లుగల రాష్ట్ర అసెంబ్లీలో కేవలం రెండు సీట్లు సాధించిన బీజేపీ చాలా అతి చేసిందని, బ్రాండ్ ఇమేజ్‌కు బాగా బాకా ఊదేందుకు ప్రయత్నించిందంటూ సోషల్ మీడియాలో ఫొటోలతో విమర్శలు వెల్లువెత్తాయి. అతికీ ఎవరతీతులు?
Comments
Please login to add a commentAdd a comment