సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దూరంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు మేరకు సీఎస్ ...ముఖ్యమంత్రి సమీక్షలకు హాజరు కాలేదు. కాగా పోలింగ్ ముగిసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చే నెల 27వ తేదీ వరకు అమల్లో ఉంది. అప్పటి వరకు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించరాదని ఎన్నికల నియావళి స్పష్టం చేస్తోంది. కేవలం ప్రకృతి వైపరీత్యాల సంభవించిన సమయంలో లేదా శాంతి భద్రతలకు విఘాతం సంభవించడం వంటి అత్యవసర పరిస్థితిల్లో చక్కపెట్టేందుకు మాత్రమే సీఎం వ్యక్తిగత పర్యవేక్షణ, సమీక్ష చేయవచ్చునని, మిగతా ఎటువంటి సమీక్షలు చేయరాదని ఎన్నికల ప్రవర్తనా నియామవళి స్పష్టం చేస్తోంది.
అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ఇప్పుడు నియావళిని తుంగలో తొక్కుతూ నిన్న (బుధవారం) పోలవరం ప్రాజెక్టుపై ప్రజావేదిక నుంచి సమీక్ష నిర్వహించగా గురువారం ఏకంగా సచివాలయానికి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుని మరీ సీఆర్‌డీఏ పనులపై సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షలకు అధికారులు హాజరు కాకూడదు. అలాగే ముఖ్యమంత్రి కూడా అధికారులను ఆహ్వానించరాదు. అయితే చంద్రబాబు అధికారులను ఇరకాటంలో పెడుతూ తనకు కావాల్సిన వారికి ఖాజానా నుంచి బిల్లుల చెల్లించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు సమీక్షల పేరుతో హడావిడి చేస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈసీ మరోసారి స్పష్టం చేయడంతో చంద్రబాబు నాయుడు హోంశాఖ సమీక్షను రద్దు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment