సాక్షి, న్యూఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంగా సీపీఐ జాతీయనేతగా ఉన్న డి. రాజా ఎన్నికను సీపీఐ జాతీయ మండలి సమావేశం ఆమోదించింది. 2012 నుంచి సురవరం సుధాకర్ రెడ్డి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం మరో రెండేళ్లు ఉండగా అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో డి. రాజాను పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికున్నారు.
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజాను ప్రతిపాదిస్తూ సురవరం ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని రాష్ట్రాల కార్యదర్శులు ఆమోదం తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నప్పటికీ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతానని సురవరం చెప్పారు. రాజా నాయకత్వంలో పార్టీ పురోగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌తో పాటు, ఒడిశాకు చెందిన యువ నాయకుడు రామకృష్ణ పండాను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తున్నట్లు సురవరం తెలిపారు. మొత్తం 13 అంశాలపై సమావేశంలో తీర్మానాలు చేసి ఆమోదించినట్లు పేర్కొన్నారు.
72 ఏళ్ల వయసున్న డీ రాజా తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆ రాష్ట్రం నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యువజన ఉద్యమాల నుంచి క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చారు. 1985లో సీపీఐ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు.1995 నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఢిల్లీ నుంచి పని చేస్తున్నారు. ప్రస్తుతం రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment