సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలను వైఎస్ జగన్ ప్రత్యక్షంగా తెలుసుకున్నారని, ఆయనలా సుదీర్ఘ పాదయాత్ర చేసిన వారు ఎవరూ లేరని అన్నారు. రాజకీయ నాయకుడిగా ఆయన ఎంతో పరిపూర్ణత సాధించారని పేర్కొన్నారు.
మంచి పాలన అందిస్తారన్న నమ్మకంతో గత ఎన్నికల్లో టీడీపీని గెలిపించారని, కానీ ఆ ఆశలన్నీ వమ్ము అయ్యారని వాపోయారు. చంద్రబాబు పరిపాలనను గాలికి వదిలేశారని, రాజకీయమే పరమావధిగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అవినీతి విలయతాండవం చేస్తోందని విమర్శించారు. సామాన్య ప్రజలు డబ్బు చెల్లించకుండా ప్రభుత్వంతో పనులు చేయించుకునే పరిస్థితులు లేవన్నారు. రెండు నెలల్లో ఎన్నికలు ఉంటాయనగా ప్రజలకు పప్పుబెల్లాలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మరని, గతంలో జనం ఇలాంటివి చాలా చూశారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను పూర్తిగా చంద్రబాబు గాలికి వదిలేసి టీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. టీడీపీని ‘తెలుగు కాంగ్రెస్’గా మార్చి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా తయారు చేశారని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీలో టీడీపీని నిమజ్జనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. సిద్ధాంతాలు, విధానాలను తుంగలో తొక్కి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయమన్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలన పోవడం చారిత్రాత్మక అవసరమని, వైఎస్ జగన్ పాలన రావడం చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు.
మార్పు కోరుతున్న ప్రజలు: అవంతి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అవంతి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలను చంద్రబాబు అయోమనానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment