
వైఎస్ జగన్‌తో మాట్లాడుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పక్కన దగ్గుబాటి హితేష్, వైవీ సుబ్బారెడ్డి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దివంగత ఎన్టీఆర్ పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు హితేష్ చెంచురాంతో కలిసి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. లోటస్ పాండులో ఆదివారం మధ్యాహ్నం జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను, తన కుమారుడు హితేష్ చెంచురాం జగన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఈ మేరకు ఆయన్ను కలిసినట్లు వెంకటేశ్వరరావు చెప్పారు. త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు దగ్గుబాటి మీడియా ముందు ప్రకటించారు. దీంతో దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్‌సీపీ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
గత కొంతకాలంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాంలు వైఎస్సార్ సీపీ లో చేరతారన్న ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు ఆదివారం వారిద్దరూ వైఎస్ జగన్‌ను కలవడంతో ఉత్కంఠకు తెరపడింది. వెంకటేశ్వరరావు జగన్ ను కలిశారన్న వార్త ఆదివారం మధ్యాహ్నం మీడియాలో ప్రసారం కావడంతో జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్‌సీపీ లో చేరితే పార్టీ జిల్లాలో మరింతగా బలోపేతమౌతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment