సాక్షి, అమరావతి: దేవుడు భూచరాలు, జలచరాలు, ఉభయచరాలు, కేచరాలు (వాయు) లాంటి నాలుగు చరాల జీవులను సృష్టిస్తే తన తోడల్లుడు, సీఎం చంద్రబాబు ఐదో చరం వింతజీవి అని సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు పొద్దున ఒకమాట, మధ్యాహ్నం మరోమాట, సాయంత్రం ఇంకో మాట చెబుతుంటారని దుయ్యబట్టారు. దగ్గుబాటి తన కుమారుడు హితేష్ చెంచురాంతో కలసి మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
పోలవరం.. గీలవరం వద్దన్న బాబు
కేంద్రం నిధులతో చేపట్టిన పోలవరాన్ని తానే నిర్మిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ ప్రాజెక్టు సందర్శన పేరుతో రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని దగ్గుబాటి మండిపడ్డారు. గతంలోనే రాజ్యసభ మాజీ సభ్యుడు యర్రా నారాయణస్వామి ఆధ్వర్యంలో ‘పోలవరం సాధన సమితి’ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని దేవెగౌడ పోలవరం ఇస్తానని అంటే.. పోలవరం వద్దు గీలవరం వద్దు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని దగ్గుబాటి ధ్వజమెత్తారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు రూ.11 కోట్లు, రాష్ట్రంలో ఒక్కో ధర్మపోరాట దీక్షకు రూ.రెండు నుంచి మూడు కోట్లను చంద్రబాబు ఇష్టానుసారంగా ఖర్చు చేశారని చెప్పారు. చంద్రబాబు సభలకు జనాలను సమీకరించేందుకు, వచ్చిన వారు వెళ్లిపోకుండా కాపలాదారుల మాదిరిగా కలెక్టర్లను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జిల్లాలో చంద్రబాబు 90 సార్లు పర్యటించడంతో జనసమీకరణ, ఏర్పాట్లకే సమయం సరిపోయిందని ఇక ప్రజల సమస్యలు పట్టించుకునే సమయం ఎక్కడుందని ఓ కలెక్టర్ తన వద్ద వాపోయినట్టు దగ్గుబాటి తెలిపారు. రాజధాని నిర్మాణంపై ఐదేళ్లుగా డిజైన్లు, గ్రాఫిక్‌లకే పరిమితమై తాత్కాలిక నిర్మాణాలతో సరిపెడుతున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక నిఘా అధికారి
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని దగ్గుబాటి దుయ్యబట్టారు. నిఘా అధికారుల నుంచి ఎస్పీలు, డీఎస్పీలను టీడీపీ కోసం వాడుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు రూ.7 కోట్ల నుంచి రూ.20 కోట్లు వరకు చెల్లించి కొనుగోలు చేయడం వెనుక ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు బేరసారాలు ఆడారని స్పష్టం చేశారు. స్పీకర్ కుర్చీలో సైతం తానే ఉన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా స్పీకర్ వ్యవహరించారన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారిని చేర్చుకోవాలంటే పదవులు, పార్టీకి రాజీనామా చేసి రావాలని గతంలో జాస్తి చలమేశ్వర్ పాల్గొన్న తిరుపతి మహానాడులో టీడీపీ చేసిన తీర్మానాన్ని చంద్రబాబు తుంగలోకి తొక్కారని పేర్కొన్నారు.
జగన్ హామీలనే ప్రభుత్వం అమలు చేస్తోంది...
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలనే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందని దగ్గుబాటి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఐదేళ్లు అయినా రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదన్నారు. బాబు నిర్వాకం కారణంగా డ్వాక్రా మహిళలపై దాదాపు రూ.ఆరున్నర వేల కోట్ల వడ్డీ భారం పడిందని, ఎన్నికల ముందు పోస్ట్ డేటెడ్ చెక్కులతో మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాను ప్రయత్నించినా అది చంద్రబాబుకు ఇష్టం లేదని నాటి స్పీకర్ బాలయోగి తనతో చెప్పారన్నారు. చివరకు పురందేశ్వరి కృషితో ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటు హాలులో ఏర్పాటైందన్నారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు అన్నిట్లో కమీషన్లు...
చంద్రబాబుపై అసూయ, ఈర్ష్యతోనే దగ్గుబాటి తన కుమారుడిని వైఎస్సార్ సీపీలో చేరుస్తున్నట్లు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కొత్త పలుకులో రాయడం పవిత్రమైన జర్నలిజం విలువలను దిగజార్చటమేనని మండిపడ్డారు. చంద్రబాబు అంటే తనకు అసూయ లేదని, సీఎం కుర్చిలో కూర్చుని రోజుకో మాట మార్చే ఆయన్ను చూసి జాలి పడుతున్నానని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. రూ.500 కోట్లతో పూర్తయ్యే పట్టిసీమకు రూ.1,500 కోట్లు ఎందుకు ఖర్చుచేశారని, అందులోనూ రాధాకృష్ణకు కమీషన్ల వాటాలున్నాయని ఆరోపించారు. పోలవరం, హంద్రీ– నీవా తదితర ప్రాజెక్టులతో పాటు రాజధాని నిర్మాణం, ప్రతి కాంట్రాక్టులోనూ రాధాకృష్ణకు కమీషన్లు అందుతున్నాయని పేర్కొన్నారు. జగన్ సీఎం అయితే కమీషన్లు ఆగిపోతాయనే బాధతోనే రా«ధాకృష్ణ ఇలాంటి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.
నేడు వైఎస్సార్‌సీపీలో హితేష్ చేరిక
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను పెంచేలా వైఎస్ జగన్ పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించారని దగ్గుబాటి చెప్పారు. మాట తప్పని జగన్ నైజం ఆయన పట్ల ప్రజల్లో అభిమానాన్ని పెంచిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం పనిచేసే తత్వంతో ఆయన ఇస్తున్న హామీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు. బుధవారం వైఎస్ జగన్ గృహప్రవేశం, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సమక్షంలో తన కుమారుడు హితేష్ వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు దగ్గుబాటి చెప్పారు.
నా తోడల్లుడు ఐదో వింతజీవి
Published Wed, Feb 27 2019 4:15 AM | Last Updated on Wed, Feb 27 2019 4:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment