
మాట్లాడుతున్న బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి
ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే అని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇన్‌చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. స్థానిక హోటల్ మౌర్యాలో ఆదివారం విలేకరుల సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు ఏపీలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని చెప్పుకోవడం కేవలం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే అనేది ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సబబో సమాధానం చెప్పాలన్నారు. 2010లో కాంగ్రెస్ హయాంలో చంద్రబాబుపై బాబ్లీ కేసు నమోదైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వాయిదాకు కూడా హాజరుకాకపోవడం, సమాధానం చెప్పక పోవడంవల్లే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయిందన్నారు. అయితే దానికి మోడీనే కారణమంటూ చంద్రబాబు మాట్లాడడం కేవలం ప్రతి అంశాన్ని కేంద్రంపైకి నెట్టి రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం వల్లే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని, అయితే వాటి ధరలు తగ్గించేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారన్నారు. దేశంలో పార్టీలు ప్రజాప్రయోజనాలను గాలికి వదిలి స్వార్థ రాజకీయాలను నడుపుతున్నాయన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి అంటూ పార్టీలు ముందుకొస్తున్నాయని, అయితే బీజేపీ తరఫున స్పష్టంగా చెబుతున్నాం మా ప్రధాని అభ్యర్థి మోడీ అని, మరి మహాకూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు కారణంగానే ప్రకాశం జిల్లా వెనుకబాటుకు గురైందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వద్ద వెనుకబడిన జిల్లాల జాబితాలో మన రాష్ట్ర పరిధిలో ఏడు జిల్లాలు మాత్రమే ఉన్నాయని, ఎనిమిదో జిల్లాగా చేర్పించేందుకు బీజేపీ తరఫున తాము కృషి చేస్తున్నామన్నారు. మరో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రామాయపట్నం పోర్టుపై నాలుగున్నర సంవత్సరాలుగా మౌనంగా ఉండి నేడు మైనర్ పోర్టు నిర్మాణం అంటూ ముందుకు రావడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో స్పష్టం చేయాలన్నారు. ప్రతిపాదన పంపితే మేజర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా చంద్రబాబు ముందుకు రాకుండా రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి వెంకట కృష్ణారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కందుకూరి సత్యన్నారాయణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఖలీఫాతుల్లాభాషా, ప్రధాన కార్యదర్శి శెగ్గెం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
మండలానికే ఇన్‌చార్జుల నియామకం
ఒంగోలు: పార్టీలో పనిచేసేవారికే గుర్తింపు ఉంటుందని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం స్థానిక హోటల్ మౌర్యాలో నిర్వహించిన జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండలాల ఇన్‌చార్జుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలో పదవులు పొందిన వారు సమావేశాలకు హాజరుకాకపోవడం సరికాదన్నారు. ఒక్కో పోలింగ్‌బూత్‌లో వెయ్యి ఓట్లు ఉంటే కనీసం 500 నుంచి 600 మందిని ప్రభావితం చేసేందుకు కృషిచేయాలన్నారు. వార్డుల పరిధిలో శక్తి కమిటీలో ఏవైనా ఖాళీలు ఉంటే వాటిని వెంటనే భర్తీ చేసుకోవాలన్నారు. జిల్లా పదాధికారులను నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా కాకుండా మండలాలకు ఇన్‌చార్జులుగా నియమిస్తున్నామంటూ ప్రతి మండలానికి ఒక ఇన్‌చార్జిని ప్రకటించారు.
ఈనెల 25వ తేదీలోగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని సూచించారు. చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్లపై టీడీపీ నేతలు చేస్తున్న రాద్ధాంతాన్ని రాజకీయ అవసరాలకోసం వాడుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు. పథకాల అమల్లో అక్రమలు చోటుచేసుకుంటున్నాయంటూ పార్టీ నాయకులు దగ్గుబాటి పురంధేశ్వరి దృష్టికి తెచ్చారు. అక్రమాలు ఎక్కడైనా ఉంటే గ్రామస్థాయిలో పార్టీ నాయకులు నిర్ధారించి నివేదికను నెలరోజుల్లోగా జిల్లా అధ్యక్షునికి పంపాలని ఆమె సూచించారు. అక్టోబరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఉంటుందని కనుక పార్టీ నాయకులంతా అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. సమావేశానికి ముందుగా దగ్గుబాటి పురంధేశ్వరిని మౌర్యా హోటల్ అధినేత బత్తిన నరసింహారావు సతీమణి వసుంధరాదేవి, కుమారుడు మహేష్‌లు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పులి వెంకట కృష్ణారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కందుకూరి సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు పేర్ల సుబ్బన్న, ఖలీఫాతుల్లా భాషా, శెగ్గెం శ్రీనివాసరావు, విన్నకోట సురేష్‌బాబు, శివాజి, మీనాకుమారి, రావులపల్లి నాగేంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు.