మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం అర్బన్: నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని కలెక్టరేట్ వద్ద మార్చి ఒకటో తేదీన చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తర్వాత నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమ బాటలో పయనించాలంటే ప్రత్యేకహోదా ఎంతో అవసరమన్నారు. రాష్ట్రానికి హోదా సంజీవని వంటిదని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మొదటినుంచి చెబుతూనే ఉన్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తామని చంద్రబాబు, మోదీలు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకహోదా ఊసే లేదన్నారు.
ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి, అన్యాయ పాలన సాగుతోందన్నారు. ఇసుక, మద్యం, కరెంటు, రాజధాని భూములు, దేవుడి మాన్యాలు, ఇలా ప్రతి ఒక్కటీ చంద్రబాబు, ఆయన మంత్రులు దోచుకుంటుంటే కింది స్థాయిలో పెన్షనర్లు, రేషన్‌కార్డులు, మరుగుదొడ్లు, నీరు–చెట్టు తదితర వాటిల్లో జన్మభూమి కమిటీల సభ్యులు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు దుర్మార్గపాలన, దిగజారుడు రాజకీయాలు ఏ స్థాయికి చేరుకుందంటే అవినీతి, అక్రమాలతో సంపాదించిన సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడేటట్లు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేకహోదా కోరుతుంటే బాబు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకే మొగ్గు చూపారన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఎక్కడ తన కేసులు తిరగదోడతారనే భయంతో చంద్రబాబు ఆ ప్రయత్నమే చేయలేదన్నారు.
ప్రత్యేకహోదా సంజీవని అని, హోదాతో చేకూరే లాభాలు, ప్రయోజనాలను విద్యార్థులకు, ప్రజలకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తూ ప్రతి జిల్లాలో యువభేరి కార్యక్రమాలను నిర్వహించారన్నారు. ఈ సదస్సులకు విద్యార్థులు రాకుండా టీడీపీ అడ్డుకునే సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. హోదా కోసం ఉద్యమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని చంద్రబాబే స్వయంగా హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ బంద్ చేస్తే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను, వామపక్ష పార్టీల నాయకులను ముందస్తుగా గృహనిర్బంధాలు, అరెస్ట్‌లు చేసి జైళ్లలో పెట్టడం వంటివి చేశారన్నారు. హోదా వలన ప్రయోజనాలు లేవని, ప్రత్యేక ప్యాకేజీతోనే అభివృద్ధి అని చంద్రబాబు చెప్పి దానికే మొగ్గు చూపారన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎన్నడూ హోదా కోసం మాట్లాడిన సందర్భం లేదన్నారు. గత ఏడాది కేంద్రబడ్జెట్ ప్రకటిస్తే అన్ని రాష్ట్రాల కంటే మనకే అధికంగా నిధులు కేటాయించారని చంద్రబాబు గొప్పలు చెప్పారని, 2018 కేంద్ర బడ్జెట్ ప్రకటించినపుడు కూడా మాట్లాడని చంద్రబాబు 17 రోజుల తర్వాత కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపణలు చేయడం అతని దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
ప్రత్యేకహోదా కోరుతూ టీడీపీ ప్రభుత్వంపై ప్రజలంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో చంద్రబాబు మాటమార్చి ప్రత్యేకహోదా కోసం కొత్త పల్లవి అందుకోవడం శోచనీయమన్నారు. ప్రత్యేకహోదా కోరుతూ ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పారని, అందుకోసం గడువు కూడా విధించారన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రానికి హోదా కోరుతూ మార్చినెల 1వ తేదీన శ్రీకాకుళంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ ధర్నాకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, వైఎస్సార్ అభిమానులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేయాలని తమ్మినేని పిలుపునిచ్చారు.
హోదాతోనే ఉజ్వల భవిష్యత్
పాతపట్నం: రాష్ట్ర ప్రజల మెరుగైన భవిష్యత్‌కు ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 1న కలెక్టరేట్ వద్ద ధర్నాకు సంబంధించి నియోజకవర్గ ప్రణాళికను మంగళవారం స్ధానిక పంచాయతీ రాజ్ బంగ్లాలో సిద్దం చేశారు. అనంతరం ఆమే విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు హోదా అనే ఆకాంక్షతో బతుకుతున్నట్లు పేర్కోన్నారు. నాలుగేళ్లు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు హోదా కోసం పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. చివరి కేంద్ర బడ్జెట్ కూడా వచ్చిందున దానిలో రాష్ట్రానికి ఎలాంటి వరాలు లేనందున ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే నిరసనలు ఉధృతం చేస్తున్నాట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుది రెండు నాల్కల దోరణి అని, నాలుగేళ్లుగా ప్రజలకు ఇలాగే మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కావాలని, సీఎం అయ్యాక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని, మళ్లీ ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుండంతో హోదా కావాలని కపట నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
రెండు నాల్కల దోరణితో ప్రజలను వంచించొద్దన్నారు. హోదా సాధించాల్సిన సమయం ఆసన్నమైందని, దానికోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనా మాలు సైతం చేస్తున్నారని, టీడీపీ ఎంపీలు మాత్రం రాష్ట్రం లో ఒకలా, డిల్లీలో ఒకలా నటిస్తున్నారని విమర్శించారు. హోదా కోసం మార్చి 1న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, దాని విజయవంతం కోసం అందరూ పెద్ద ఎత్తు న తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ పోరాటానికి విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలవాలని ఆమే కోరారు. కార్యక్రమంలో పాతపట్నం, మెళియాపుట్టి మండల కన్వీనర్లు రెగేటి షణ్ముఖరావు, పాడి అప్పారావు, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగపు ప్రధాన కార్యదర్శి యరుకొల వెంకటరమణ, రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి కొండాల అర్జునుడు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి, సభ్యులు కే.జానకమ్మ, బి.వరలక్ష్మి, కే.పద్మ, మండల ప్రధాన కార్యదర్శి పీ.వి.వి కుమార్, రెడ్డి రాజు, కే.రమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment