సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, చిత్రంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తదితరులు
కడప కార్పొరేషన్ : ఏదైనా జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఏవైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చేపడతారేమో, కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారేమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు, వైఎస్‌ఆర్ జిల్లాకు 25 సార్లు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిసారీ చెప్పినవే చెప్పి మోసం చేశారు, ఇప్పుడు మళ్లీ ఈనెల 17వ తేది ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు డిమాండ్ చేశా రు. మంగళవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో బద్వేల్ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వెంకటసుబ్బయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బద్వేల్‌కు రెండుసార్లు వచ్చారని, ఆ రెండు సందర్భాల్లోనూ వందల కోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారని, ఎక్కడో మూలన పడిన తెలుగుగంగ ప్రాజెక్టుపై రాష్ట్ర స్థాయి అధికారులందరినీ పిలి పించి సమీక్ష నిర్వహించడం ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాలుగేళ్లుగా వచ్చిన ప్రతిసారీ జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని, రైల్వేకోడూరులో హార్టి కల్చ ర్ కళాశాల, టెక్స్‌టైల్ పార్కు ఏర్పా టు చేస్తామని చెబుతూనే ఉన్నారుగానీ ఒక్క అడుగు ముందుకు వేయలేదని ఎద్దేవా చేశారు.
పేదలకు మూడు సెంట్ల స్థలం ఇచ్చి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, పాత ఇళ్లకు రంగులేసి గృహప్రవేశాలు చేశారని మండిపడ్డారు. వైఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఇళ్లు కట్టించారని, జిల్లాలో అనేక చోట్ల కొత్త కాలనీలు ఏర్పా టు చేశారని గుర్తు చేశారు. కడప– కర్నూల్ జాతీయ రహదారి పనులు వైఎస్ హయాం లో శాంక్షన్ చేశారని, అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకూ భూసేకరణ కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. కడప–తిరుపతి రహదారి అత్యంత దారుణంగా తయారైందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పది కిలోమీటర్ల రోడ్డు వేశారా, కొత్తగా హాస్పిటల్‌గానీ, పీహెచ్‌సీగానీ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. విద్యారంగంలో వైఎస్ మండలానికో కస్తూర్బా స్కూల్, ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, ఈ ప్రభుత్వం కొత్తగా ఒక హాస్టల్ ఏర్పాటు చేసిందా, ఒక కళాశాల నిర్మించిందా, పోనీ ఒక అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేశారా అని ఎద్దేవా చేశారు. రైతు రథం ట్రాక్టర్లు ఇన్‌చార్జి మంత్రి ఎవరికి చెబితే వారికి ఇస్తున్నారని, దళారులు ౖరైతులను నట్టేట ముంచుతున్నారని దుయ్యబట్టారు. శ్రీశైలంలో 200 టీఎంసీలు నీరుంటే 50వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారని, ఇది చాలా అన్యాయమన్నారు.
పట్టిసీమ నీళ్లు, శ్రీశైలం నీరు రెండూ క్రిష్ణా డెల్టాకేనా, రాయలసీమకు ఇవ్వరా అని సూటిగా ప్రశ్నించారు. తెలుగుగంగ కెనాల్ మరమ్మతులు చేయాలని తాము ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలుగోడు వద్ద 0–18 కి.మీ కెనాల్‌కు లైనింగ్ చేస్తే శ్రీశైలం వరదనీటిని తెచ్చుకొనే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదని మండిపడ్డారు. జిల్లాలో టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని, అది ప్యాచప్ చేసుకోవడానికే సీఎం జిల్లాకు వస్తున్నారా.. లేక బద్వేల్‌లో నీరు–చెట్టు కింద నామినేషన్‌పై చేసిన రూ.200కోట్ల పనులకు సంబంధించి డబ్బులు కార్యకర్తలకు అందాయో లేదో తెలుసుకోవడానికి వస్తున్నారా.. అని ఎద్దేవా చేశారు. బద్వేల్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపు రం, రాయచోటిల్లో టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదుర్చడానికే సీఎం వస్తున్నారే తప్పా ప్రజల కోసం కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ కాలనీల్లో ఉచిత విద్యుత్ ఇస్తుంటే, బాబు సీఎం అయ్యాక మీటర్లు బిగించి వేలకు వేలు బిల్లులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్‌కు పేరు వస్తుందనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ నగర ప్రధా న కార్యదర్శి శ్రీరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment