
విలేకరులతో మాట్లాడుతున్న పాలేటి మహేశ్వరరావు
కడప రూరల్: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు ఓటమి చారిత్రక అవసరమని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు అన్నారు. గురువారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అన్ని విధాలా మోసగించారన్నారు. ఎస్సీ, ఎస్టీలను అత్యంత హీనంగా చూశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఉద్యమానికి మద్దతు ప్రకటించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మునిమనవడు రాజారత్నం అశోక్ అంబేడ్కర్‌ను విజయవాడలో అరెస్ట్ చేసి అవమానపరిచారన్నారు.
ఈ టీడీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని మహేశ్వరరావు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమం కేవలం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమతా సైనిక్ దళ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అత్యున్నత దర్యాప్తునకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరాకరించడంలో మతలబేంటని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి కంచర్ల చిట్టిబాబు, జిల్లా అధ్యక్షుడు మల్లిఖార్జున, నాయకులు పిల్లి సురేంద్రబాబు, ప్రత్తిపాటి రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment