Samata Sainik Dal
-
‘చంద్రబాబు ఒక అరాచక శక్తి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు అనర్హుడని.. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అన్నారు. ఈ నెపంతో రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అశాంతిని పెంచాలనే కుట్రతో 40 రోజులుగా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తోన్న చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే.. వేల కోట్లు ఖర్చు పెట్టి శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాశ్వత హైకోర్టు, శాసనసభ, సచివాలయాలు లేవని.. తాత్కాలిక భవనాలతో వేల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వేల ఎకరాలను దోచేశారని ధ్వజమెత్తారు. 13 జిల్లాల అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తెచ్చారని.. టీడీపీ దీనిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి మాత్రమే కాదని..13 జిల్లాల అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే శాసనమండలిలో ఎమ్మెల్సీలు అరాచకం సృష్టించారని తెలిపారు. చంద్రబాబు, చైర్మన్లు కలిసి శాసనమండలి ఔన్నత్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు 29 గ్రామాలకు ప్రతిపక్ష నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకుని..చంద్రబాబు పైశాచిక ఆనందం.. నిన్నటి రోజు చరిత్రలో బ్లాక్‌డే గా మిగిలిపోతుందని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగాని గురునాథం అన్నారు. చంద్రబాబు మంది బలంతో చట్టాలను చుట్టంగా చేసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల బలం ఉందని పేర్కొన్నారు. 13 జిల్లాల అభివృద్ధిని అడ్డుకుని చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. 40 సంవత్సరాల అనుభవంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు,యనమల రామకృష్ణుడు చేసిన కుటిల రాజకీయాలు మండలి సాక్షిగా బహిర్గతమయ్యాయన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి.. రాయలసీమ వాసులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర నేత రాజ్‌కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు మండలిలో ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఐదు కోట్ల ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాయలసీమ రాజధాని కోసం తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు కుల ఉన్మాదాన్ని పెంచి పోషించారు’
సాక్షి, విజయవాడ : రాజధాని ప్రాతంలో చంద్రబాబు కుల ఉన్మాదాన్ని పెంచి పోషించారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వర్ రావు మండిపడ్డారు. తాడికొంత దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై తెలుగుదేశం కార్యకర్తల కుల వివక్ష దాడిని ఖండిస్తూ సమతా సైనిక్ దళ్ నాయకులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు కులం వారే ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసేవారని, బాబు పాలనలో సైతం దళితులపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. విద్యావంతులైన మహిళ ఎమ్మెల్యేను కులం పేరుతో దూషించిన వారిని చంద్రబాబు పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ పార్టీ.. దళిత వ్యతిరేక పార్టీ అని, ఇలాంటివి మళ్లీ జరిగితే దళిత సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
చంద్రబాబును ఓడించాలని కోరుతూ బస్సు యాత్ర
సాక్షి, కృష్ణా: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఓడించాలని కోరుతూ సమతా సైనిక్ దళ్ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దళిత, మైనార్టీ, మహిళలు, బహుజన వ్యతిరేకి అయిన చంద్రబాబును ఓటమే లక్ష్యంగా సమతా సైనిక్ దళ్ కడప నుంచి వైజాగ్ వరకు బస్సు యాత్ర చేపట్టింది. మంగళవారం ఈ బస్సు యాత్ర కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం చేరుకుంది. టీడీపీని ఓడించడం దళిత, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చారిత్రక అవసరం అని వారు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ బస్సు యాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ విక్టర్ ప్రసాద్‌లతో పాటు రాష్ట్ర కార్యవర్గం పాల్గొంది. -
చంద్రబాబు ఓటమి చారిత్రక అవసరం
కడప రూరల్: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు ఓటమి చారిత్రక అవసరమని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు అన్నారు. గురువారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అన్ని విధాలా మోసగించారన్నారు. ఎస్సీ, ఎస్టీలను అత్యంత హీనంగా చూశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఉద్యమానికి మద్దతు ప్రకటించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మునిమనవడు రాజారత్నం అశోక్ అంబేడ్కర్‌ను విజయవాడలో అరెస్ట్ చేసి అవమానపరిచారన్నారు. ఈ టీడీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని మహేశ్వరరావు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమం కేవలం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమతా సైనిక్ దళ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అత్యున్నత దర్యాప్తునకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరాకరించడంలో మతలబేంటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి కంచర్ల చిట్టిబాబు, జిల్లా అధ్యక్షుడు మల్లిఖార్జున, నాయకులు పిల్లి సురేంద్రబాబు, ప్రత్తిపాటి రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.