నేడే ఢిల్లీ పోలింగ్‌ | Delhi Election 2020 Is On 08-02-2020 | Sakshi
Sakshi News home page

నేడే ఢిల్లీ పోలింగ్‌

Published Sat, Feb 8 2020 1:07 AM | Last Updated on Sat, Feb 8 2020 4:55 AM

Delhi Election 2020 Is On 08-02-2020 - Sakshi

ఢిల్లీలో పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్‌ సామగ్రితో విధులకు వెళ్తున్న పోలింగ్‌ అధికారిణి

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం నాటి పోలింగ్‌కు ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ రణ్‌బీర్‌ సింగ్‌ వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టంపై షహీన్‌బాగ్‌లో నిరసనలు, జేఎన్‌యూలో హింస వంటి ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 75 వేల మంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలు, 190 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ను  బందోబస్తు కోసం వినియోగించుకుంటున్నట్లు స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రవీర్‌ రంజన్‌ వెల్లడించారు. 

ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఓటింగ్‌పై నగర ప్రజల్లో నిరాసక్తత పోగొట్టడానికి ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. ఓటర్లను గుర్తించడానికి ఎన్నికల సిబ్బంది క్యూఆర్‌ కోడ్స్, మొబైల్‌ యాప్స్‌ని వాడుతున్నారు. ఓటర్లు స్మార్ట్‌ ఫోన్‌లను వెంట తెచ్చుకోవడానికి కూడా అనుమతినిచ్చారు. ఓటరు కార్డు లేకపోయినా క్యూ ఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేసి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తారు. షహీన్‌బాగ్‌లో నిరసనకారుల్ని ఎన్నికల సిబ్బంది స్వయంగా కలుసుకొని ఓటు వేయాలని కోరారు. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు తరలిరావడానికి వీలుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న 30 నియోజకవర్గాల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచే కార్యక్రమాలను ఈసీ చేపట్టింది. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు ఉచితంగా చేరవేస్తామని టూవీలర్‌ ట్యాక్సీ సేవల సంస్థ ర్యాపిడో ప్రకటించింది. మూడు కిలోమీటర్ల వరకు ఓటర్ల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపింది. కాగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 28 మంది, పటేల్‌నగర్‌ నుంచి అతి తక్కువగా నలుగురే పోటీలో  ఉన్నారు. 

కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసు
మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. శనివారం సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇతర పార్టీలన్నీ సీఏఏ, హిందూ–ముస్లిం, మందిరం–మసీదు గురించే మాట్లాడుతుండగా కేజ్రీవాల్‌ మాత్రం అభివృద్ధి, సంక్షేమం గురించే చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇది నిబంధనావళిని ఉల్లంఘించడమేనంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

మొత్తం స్థానాలు: 70
మొత్తం ఓటర్లు: 1.47 కోట్లు
బరిలో ఉన్న అభ్యర్థులు: 672
పోలింగ్‌ బూత్‌లు: 13, 750

కేజ్రీవాల్‌ పనితీరు భేష్‌
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై శివసేన పార్టీ ప్రశంసలు కురిపించింది. ‘అయిదేళ్లలో ఆప్‌ సర్కార్‌ చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేపట్టింది. ఢిల్లీ మోడల్‌ పేరుతో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలను అమలు చేయాలి’ అంటూ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. ప్రధాని, కేంద్ర మంత్రులు, 200 మంది ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కలిసి వచ్చినా కేజ్రీవాల్‌దే పైచేయి అని ఆ సంపాదకీయంలో పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement