హైకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేల విజయ సంకేతం
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హతను రద్దుచేస్తూ కేసును మళ్లీ విచారించాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం తీరును కోర్టు తప్పుబట్టింది. అనర్హతపై కేంద్రానికి ఈసీ చేసిన ప్రతిపాదనలను సహజ న్యాయాన్ని, ఎమ్మెల్యేల హక్కులను నీరుగార్చటంగా అభివర్ణించిన ధర్మాసనం.. వారిపై వేటువేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.
ఈసీపై కోర్టు మండిపాటు
‘ఎన్నికల కమిషన్ జనవరి 19న ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉద్దేశం చట్టాలను నీరుగార్చటమే. సహజన్యాయ చట్టాలను అమలు చేయటంలో ఎన్నికలసంఘం విఫలమైంది’ అని 79 పేజీల తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ‘అనర్హతపై ఆప్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని భారత ఎన్నికల సంఘం విని, క్షుణ్ణంగా విచారించాలి. ఆ తర్వాత ప్రభుత్వంలో లాభదాయక పదవులు అంటే ఏమిటనే ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటరీ సెక్రటరీలుగా పిటిషనర్లు (ఆప్ ఎమ్మెల్యేలు) అనుభవించిన లాభదాయక పదవులపై నిష్పాక్షికంగా పునఃసమీక్ష జరపాలి’ అని ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించింది.
మేం వదలబోం: కాంగ్రెస్
ఆప్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎన్నికల సంఘం వద్ద తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ‘లాభదాయక పదవులపై మా పోరాటం కొనసాగుతుంది. హైకోర్టు వీరు తప్పుచేయలేదని నిర్ధారించ లేదు. ఎమ్మెల్యేల వాదన వినలేదనే అంశంపై సామాజిక న్యాయం జరగలేదని మాత్రమే అభిప్రాయపడింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ అనుమతించారు.
అసలు వివాదమేంటి?
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2015 మార్చిలో 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. ఎమ్మెల్యేలుగా వేతనం తీసుకుంటూనే పార్లమెంటు సెక్రటరీలుగా లాభం పొందే పదవులను అనుభవించటంపై బీజేపీ, కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాయి. 2016లో వీరి నియామకాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో ఈ 20 మందిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఈ స్థానాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీకి సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment