సాక్షి, అమరావతి: స్వతహాగా రూపాయి కూడా సంపాదించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మనవడు నారా దేవాన్ష్ పేరిట ఆస్తులు ప్రతిఏటా రూ.కోట్లల్లో పెరిగిపోతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఆస్తులు ప్రకటించినప్పుడు రూ.11.54 కోట్లుగా వున్న దేవాన్ష్ ఆస్తుల విలువ ఈ ఏడాది ఏకంగా రూ.7.17 కోట్లు పెరిగి.. రూ.18.71 కోట్లకు చేరింది. ఎలాంటి ఆదాయం లేని మనవడి పేరు మీద ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో చెప్పకుండా తమ ఆస్తుల పేరిట చంద్రబాబు కుటుంబం కాకిలెక్కలను ప్రకటించడం, అది కూడా ప్రస్తుత మార్కెట్ విలువ కాకుండా కేవలం కొనుగోలు ధరలను మాత్రమే చెపుతుండడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను తాజాగా వెల్లడించారు.
ఆ ఇంటి విలువ రూ.18.35 కోట్లేనా?
ఈ ఏడాది ఖరీదైన మూడు గృహాలను విక్రయించగా వచ్చిన సొమ్మును చూపించకుండా ఆస్తులను ప్రకటించి, కొత్తగా కొన్న ఆస్తులు విలువలను కూడా ప్రస్తుత మార్కెట్ విలువ కంటే తక్కువే చూపిస్తూ ప్రపంచంలో తమకంటే నిజాయితీపరులైన కుటుంబం లేదంటూ ప్రచారం చేసుకోవడం ఒక్క నారా వారికే చెల్లింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు కుటుంబం అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్న రూ.వందల కోట్ల విలువ చేసే భవనం ఖరీదును కేవలం రూ.18.35 కోట్లుగా చూపించినప్పుడే ఈ ఆస్తుల ప్రకటనకు అర్థం లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. కేవలం కొనుగోలు ధరనే ప్రకటిస్తున్నామంటున్నప్పుడు 2011లో రూ.96.50 లక్షలుగా పేర్కొన్న ఇంటి విలువను 2017–18లో రూ.17.85 కోట్లుగా, 2018–19లో రూ.18.35 కోట్లుగా ఇలా కొద్దికొద్దిగా పెంచుతూ ఎలా చూపిస్తున్నారో ఏ ఆర్థిక నిపుణుడికీ అంతుబట్టట్లేదు. అలాగే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా లోకేశ్ రూ.5.29 కోట్ల రుణాలను ఎలా తీర్చారన్నది ఎక్కడా పేర్కొనలేదు.
సీఎం జీతభత్యాలు ఎటుపోతున్నాయో?
‘‘నాకు రూపాయి ఖర్చులేదు. నా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. హైదరాబాద్ వెళితే అన్నీ నా భార్యే చూసుకుంటుంది. అందుకే నా జేబులో రూపాయి కూడా వుండదు. వేలికి ఉంగరం, చేతికి గడియారం ఉండదు’’ అని ఊదరగొట్టే సీఎం చంద్రబాబు సేవింగ్స్ ఖాతాలోంచి రూ.35.20 లక్షలు తరిగిపోయాయి. మరి సీఎంగా ఆయన అందుకుంటున్న జీతభత్యాలు ఎక్కడికి పోతున్నాయనే విషయం కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరిట గతంలో ఉన్న ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్లలో కొన్ని ఏమైపోయాయో వివరణ లేదు. ఇలా అసమగ్ర, అసంబద్ధ సమాచారంతో చంద్రబాబు కుటుంబం ఏటా ప్రకటిస్తున్న ఆస్తులను పరిశీలిస్తే సామాన్య జనంలో అనేకానేక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రజల ప్రశ్నలకు సీఎం సమాధానం చెపుతారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు సమాధానం చెప్పగలరా?
- స్థిర, చరాస్తుల కొనుగోలు విలువనే చూపిస్తున్నప్పుడు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఉమ్మడి ఇంటి విలువను గతం కంటే రూ.50 లక్షలు అదనంగా చూపించడానికి కారణం ఏమిటి?
- గతంలో నారావారిపల్లెలో 0.97 ఎకరాల భూమిని చంద్రబాబుకు గిఫ్ట్‌గా వచ్చినట్లు ఇన్నాళ్లు చూపించి, ఇప్పుడు దీని విలువను రూ.23.84 లక్షలుగా ఎందుకు చూపించారు? బహుమతి రూపంలో వచ్చిన ఆస్తికి విలువ ఎలా కడతారు?
- రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లిలో 5 ఎకరాల భూమిని లోకేశ్‌కు నాయనమ్మ గిఫ్ట్‌గా ఇచ్చారని గతంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ స్థలం విలువను ఎందుకు చూపించలేదు?
- తండ్రికి నారావారిపల్లెలో గిఫ్ట్‌గా వచ్చిన భూమి విలువను చూపించి, కుమారుడు లోకేశ్‌కు గిఫ్ట్‌గా వచ్చిన భూమి విలువను చూపకపోవడంలో ఉన్న అసలు మతలబు ఏమిటి?
- నాకు రూపాయి ఖర్చు లేదు అని నిత్యం చెప్పే ముఖ్యమంత్రి సేవింగ్స్ ఖాతాలో రూ.35 లక్షలు ఎలా మాయమయ్యాయి? ముఖ్యమంత్రిగా ఆయనకు వస్తున్న జీతభత్యాలు ఎక్కడికి పోతున్నాయి?
- భువనేశ్వరి పేరిట ఉన్న ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్స్ హెరిటేజ్ ఆగ్రో మెరైన్ ప్రైవేటు లిమిటెడ్, హెరిటేజ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, నిర్వాణ మీడియా పెట్టుబడులు ఏమయ్యాయి? వాటి వివరాలను ఈసారి ఎందుకు ప్రకటించలేదు?
- లోకేశ్ ఈ ఏడాది కాలంలో రూ.5.29 కోట్ల రుణాలను ఎలా తీర్చాడు? దీనికి సంబంధించిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది?
- చంద్రబాబు కోడలు బ్రహ్మణి పేరిట జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 19లో 650 చదరపు గజాల స్థలంలో ఉన్న ఇంటి మార్కెట్ విలువను 2016లో రూ.3.50 కోట్లుగా చూపించారు. ఈ ఏడాది ఆ ఇంటిని ఎంతకు అమ్మారో ఎందుకు చూపలేకపోయారు?
- జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 1లో 723 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని రూ.8.82 కోట్లకు ఈ ఏడాది కొనుగోలు చేశారు. ఈ రెండు స్థలాల మార్కెట్ విలువల్లో వాస్తవాలు ఎంత?
- బ్రహ్మణి ఈ ఏడాదిలో చేసిన అప్పులు రూ.5.3 కోట్లు ఏమయ్యాయి?
- పైసా సంపాదన లేని మనవడు దేవాన్ష్ ఆస్తులు ఏడాదిలోనే రూ.7.17 కోట్లు ఎలా పెరిగాయి?
- దేవాన్ష్ పేరిట జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో ఉన్న ఇంటిని విక్రయించగా వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయాయి?
- చంద్రబాబు కుటుంబానికి చెందిన పెట్టుబడుల సంస్థ నిర్వాణ హోల్డింగ్స్ ఆస్తులు రూ.9.51 కోట్లు ఏ విధంగా పెరిగాయి?
ఈ ఇల్లు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మెటీరియల్‌తో భారీ ఖర్చుతో అత్యంత విలాసవంతంగా నిర్మించారు. 2,479 గజాల విస్తీర్ణంలో.. 20,383 చదరపు అడుగుల నిర్మాణం ఇది. సెల్లార్, రెండు అంతస్తులున్నాయి. సెల్లార్‌లో 19 కార్ల పార్కింగ్ సదుపాయం ఉంది. ఇంకా అత్యాధునిక లిఫ్ట్‌లు, వీఐపీ లాంజ్‌లు తదితర అనేక సదుపాయాలున్నాయి.
చినుకు పడితే చిల్లులు పడిపోయే తాత్కాలిక సచివాలయానికి చదరపు అడుగుకు చంద్రబాబు లెక్క ప్రకారం రూ.11 వేలకుపైగా ఖర్చయింది. అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఈ భవనం..
మెటీరియల్, స్థలం విలువతో కలుపుకుంటే రూ.100 కోట్లు పైమాటేనని నిపుణులంటున్నారు.
అత్యంత ఖరీదైన భవంతి కనుకనే పార్టీవారికి గానీ, బంధువులకు గానీ ఇందులో ప్రవేశం లేదని చెప్పుకుంటుంటారు. ఈ నూరు కోట్ల భవనం చంద్రబాబు, లోకేష్ ఇద్దరి పేరుమీద ఉంది. అందులో సగం బాబు వాటా అనుకుంటే రూ. 50 కోట్లు. అయితే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.2.33 కోట్లేనని లోకేష్ బాబు చూపించారు.. ఆస్తుల ప్రకటన వార్త చూసినవారెవరైనా వచ్చి ఆ రూ. 2.33 కోట్లకు మరో రూ.3 కోట్లు ఇస్తాం ఇల్లు ఇచ్చేస్తారా అని అడిగితే ఏం చెప్తారో..
Comments
Please login to add a commentAdd a comment