Nara Devansh
-
అబద్దం చెప్పిన నానమ్మ..
-
నారా దేవాన్ష్‌కు అప్పుడే ట్విటర్ అకౌంటా!
ట్విటర్లో యమా యాక్టివ్‌గా ఉండే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తన నాలుగేళ్ల కుమారుడు దేవాన్ష్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేస్తున్న ట్వీట్లు తీవ్రచర్చనీయాంశంగా మారాయి. తన కుమారుడు దేవాన్ష్‌ను(@naradevaansh) ట్యాగ్ చేస్తూ పలు సందర్భాల్లో లోకేశ్ ట్వీట్లు చేశారు. దేవాన్ష్ చాలా త్వరగా పెద్దవాడు అయిపోతున్నాడని, అతనితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానంటూ గురువారం ట్విటర్లో నారాలోకేశ్ పోస్ట్ పెట్టారు. దేవాన్ష్‌తో గడిపిన మధుర క్షణాలు, ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఇప్పటికే నారా దేవాన్ష్ పేరుతో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లతోపాటూ వివిధ సామాజిక మాధ్యమాలలో కూడా అకౌంట్లు ఉన్నాయి. అయితే ఇవి అధికారిక అకౌంట్లా కాదా అనేదానిపై స్పష్టత లేదు. కానీ ఏకంగా నారా లోకేశే దేవాన్ష్ పేరుతో ఉన్న అకౌంట్‌ను పలు సందర్భాల్లో ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడంతో అది దేవాన్ష్ అకౌంటే అని స్పష్టమవుతోంది. ‘మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నదే ప్రధానంగా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది’ అంటారు శంకరాచార్యుడు. చిన్న పిల్లలు తెలిసో తెలియకో సామాజిక మాధ్యమాలపై ఎక్కువగా దృష్టిపెడితే ఎదుగుదలలో బహు ముఖ వికాసం లోపించి, వృధా వ్యవహారాల్లో మునిగి తేలుతూ మేధోమరుగుజ్జుతనానికి లోనయ్యే అవకాశం ఉంది. అందుకే పలు సామాజిక వెబ్సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీస వయసు ఉండాలనే నిబంధనలను పెట్టాయి. ట్విటర్ అకౌంట్ వాడాలంటే కనీస వయసు 13 ఏళ్లు ఉండాలనే నిబంధన ఉంది. ఈ విషయం కూడా తెలియకుండా ఏపీ ఐటీ మంత్రిగా ఎలా పని చేస్తున్నారంటూ లోకేశ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి నుంచే దేవాన్ష్‌కు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లను పెంచాలనే ఆలోచన నారా లోకేష్‌కు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే దేవాన్ష్‌కు దీర్ఘకాలంలో ఫాలోవర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఫాలోవర్లు, లైకులు, షేర్లు, ట్రెండింగ్ అంటూ చిన్న పిల్లాడి మదిలో అనవసరపు చర్చ జరిగితే అది అతని మనస్తత్వంపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
ఇది నారా దేవాన్ష్ కాలనీ..
సాక్షి, అమరావతిబ్యూరో : ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీకి సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరు పెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అధికారులెవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. గ్రామస్తులు మాత్రం సొమ్మొకరిది.. సోకొకరిది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఆ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కొందరు ఎన్ఆర్ఐలు తమ వంతు సాయం అందించగా.. ఆ పనులు కూడా తామే చేపట్టామని సీఎం కుటుంబసభ్యులు పేర్కొంటుండటం విశేషం. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 2015 సెప్టెంబరులో దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ జనాభా సుమారు 2,200. ఎన్టీఆర్ భార్య బసవరామతారకం ఈ గ్రామంలోనే జన్మించారు. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించి దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత పలు దఫాలుగా ఆమె గ్రామాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ఆ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధులతోపాటు గ్రామస్తులు వితరణ ఇచ్చిన డబ్బును కలుపుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. అభివృద్ధి అంతా ఆమె చలువే అంటూ.. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత.. ప్రభుత్వ నిధులతోపాటు పామర్రు జెడ్పీటీసీ దంపతుల సొంత నిధులు కలుపుకుని ఆ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించారు. రైతుల కోసం గ్రామంలో ఉన్న డొంకరోడ్లను జేఎస్పీ రహదారులుగా మార్పు చేసేందుకు ప్రభుత్వం రూ. 45.50 లక్షలు మంజూరు చేసింది. అలాగే భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి రూ. 4.40 కోట్లు, అంతర్గత సిమెంటు రోడ్లకు రూ. 2.06 కోట్లు, 1.7 కిలోమీటర్ల పొడవున్న జిల్లా పరిషత్ రోడ్డును సిమెంటురోడ్డుగా మార్చేందుకు రూ. 1.70 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన అమరలింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి వారి దేవస్థానం పునః నిర్మాణానికి దేవదాయ శాఖ రూ. 38 లక్షలు మంజూరు చేసింది. అలాగే గ్రామస్తులు మరో రూ. 15 లక్షలు వితరణ ఇచ్చారు. ఇలా.. పంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు కూడా ప్రభుత్వ నిధులే కావడం విశేషం. అయితే గ్రామంలో ఈ అభివృద్ధి అంతా నారా భువనేశ్వరి వల్లే జరిగిందని ఆమె బంధువులు, అధికారపార్టీ నాయకులు చెప్పుకోవడాన్ని చూసి గ్రామస్తులు విస్తుపోతున్నారు. హౌసింగ్ కాలనీకి దేవాన్ష్ పేరు.. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద కొమరవోలు గ్రామానికి గృహనిర్మాణ శాఖ అధికారులు 250 పక్కా గృహాలు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికీ ప్రభుత్వం 1.50 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామంలో చేపట్టిన 150 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో ఒకే చోట 54 ఇళ్లను ఇటీవలే పూర్తి చేశారు. ప్రభుత్వ నిధులకు అదనంగా లబ్ధిదారులు కూడా కొంత మొత్తం జమ చేసి వాటిని నిర్మించుకోవడం జరిగింది. తమ సొంత నిధులు రూపాయి కూడా వెచ్చించకుండా సీఎం దంపతులు ఆ కాలనీకి తమ ముద్దుల మనవడు దేవాన్ష్ పేరు పెట్టేశారు. ప్రభుత్వ నిధులకు తోడుగా ఎవరైనా దాతలు తమ వంతు సాయం చేస్తే.. వారు కోరినట్లుగా కాలనీలకు గాని, భవనాలకు గాని పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని.. ఈ కాలనీ నిర్మాణం కేవలం ప్రభుత్వ నిధులతో జరిగిందని.. దానికి పథకం పేరు తప్ప వేరే పేరు పెట్టడానికి వీల్లేదని గృహనిర్మాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
భారీగా పెరిగిన చంద్రబాబు మనవడి ఆస్తులు
సాక్షి, అమరావతి: స్వతహాగా రూపాయి కూడా సంపాదించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మనవడు నారా దేవాన్ష్ పేరిట ఆస్తులు ప్రతిఏటా రూ.కోట్లల్లో పెరిగిపోతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఆస్తులు ప్రకటించినప్పుడు రూ.11.54 కోట్లుగా వున్న దేవాన్ష్ ఆస్తుల విలువ ఈ ఏడాది ఏకంగా రూ.7.17 కోట్లు పెరిగి.. రూ.18.71 కోట్లకు చేరింది. ఎలాంటి ఆదాయం లేని మనవడి పేరు మీద ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో చెప్పకుండా తమ ఆస్తుల పేరిట చంద్రబాబు కుటుంబం కాకిలెక్కలను ప్రకటించడం, అది కూడా ప్రస్తుత మార్కెట్ విలువ కాకుండా కేవలం కొనుగోలు ధరలను మాత్రమే చెపుతుండడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను తాజాగా వెల్లడించారు. ఆ ఇంటి విలువ రూ.18.35 కోట్లేనా? ఈ ఏడాది ఖరీదైన మూడు గృహాలను విక్రయించగా వచ్చిన సొమ్మును చూపించకుండా ఆస్తులను ప్రకటించి, కొత్తగా కొన్న ఆస్తులు విలువలను కూడా ప్రస్తుత మార్కెట్ విలువ కంటే తక్కువే చూపిస్తూ ప్రపంచంలో తమకంటే నిజాయితీపరులైన కుటుంబం లేదంటూ ప్రచారం చేసుకోవడం ఒక్క నారా వారికే చెల్లింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు కుటుంబం అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్న రూ.వందల కోట్ల విలువ చేసే భవనం ఖరీదును కేవలం రూ.18.35 కోట్లుగా చూపించినప్పుడే ఈ ఆస్తుల ప్రకటనకు అర్థం లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. కేవలం కొనుగోలు ధరనే ప్రకటిస్తున్నామంటున్నప్పుడు 2011లో రూ.96.50 లక్షలుగా పేర్కొన్న ఇంటి విలువను 2017–18లో రూ.17.85 కోట్లుగా, 2018–19లో రూ.18.35 కోట్లుగా ఇలా కొద్దికొద్దిగా పెంచుతూ ఎలా చూపిస్తున్నారో ఏ ఆర్థిక నిపుణుడికీ అంతుబట్టట్లేదు. అలాగే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా లోకేశ్ రూ.5.29 కోట్ల రుణాలను ఎలా తీర్చారన్నది ఎక్కడా పేర్కొనలేదు. సీఎం జీతభత్యాలు ఎటుపోతున్నాయో? ‘‘నాకు రూపాయి ఖర్చులేదు. నా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. హైదరాబాద్ వెళితే అన్నీ నా భార్యే చూసుకుంటుంది. అందుకే నా జేబులో రూపాయి కూడా వుండదు. వేలికి ఉంగరం, చేతికి గడియారం ఉండదు’’ అని ఊదరగొట్టే సీఎం చంద్రబాబు సేవింగ్స్ ఖాతాలోంచి రూ.35.20 లక్షలు తరిగిపోయాయి. మరి సీఎంగా ఆయన అందుకుంటున్న జీతభత్యాలు ఎక్కడికి పోతున్నాయనే విషయం కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరిట గతంలో ఉన్న ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్లలో కొన్ని ఏమైపోయాయో వివరణ లేదు. ఇలా అసమగ్ర, అసంబద్ధ సమాచారంతో చంద్రబాబు కుటుంబం ఏటా ప్రకటిస్తున్న ఆస్తులను పరిశీలిస్తే సామాన్య జనంలో అనేకానేక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రజల ప్రశ్నలకు సీఎం సమాధానం చెపుతారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సమాధానం చెప్పగలరా? - స్థిర, చరాస్తుల కొనుగోలు విలువనే చూపిస్తున్నప్పుడు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఉమ్మడి ఇంటి విలువను గతం కంటే రూ.50 లక్షలు అదనంగా చూపించడానికి కారణం ఏమిటి? - గతంలో నారావారిపల్లెలో 0.97 ఎకరాల భూమిని చంద్రబాబుకు గిఫ్ట్‌గా వచ్చినట్లు ఇన్నాళ్లు చూపించి, ఇప్పుడు దీని విలువను రూ.23.84 లక్షలుగా ఎందుకు చూపించారు? బహుమతి రూపంలో వచ్చిన ఆస్తికి విలువ ఎలా కడతారు? - రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లిలో 5 ఎకరాల భూమిని లోకేశ్‌కు నాయనమ్మ గిఫ్ట్‌గా ఇచ్చారని గతంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ స్థలం విలువను ఎందుకు చూపించలేదు? - తండ్రికి నారావారిపల్లెలో గిఫ్ట్‌గా వచ్చిన భూమి విలువను చూపించి, కుమారుడు లోకేశ్‌కు గిఫ్ట్‌గా వచ్చిన భూమి విలువను చూపకపోవడంలో ఉన్న అసలు మతలబు ఏమిటి? - నాకు రూపాయి ఖర్చు లేదు అని నిత్యం చెప్పే ముఖ్యమంత్రి సేవింగ్స్ ఖాతాలో రూ.35 లక్షలు ఎలా మాయమయ్యాయి? ముఖ్యమంత్రిగా ఆయనకు వస్తున్న జీతభత్యాలు ఎక్కడికి పోతున్నాయి? - భువనేశ్వరి పేరిట ఉన్న ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ హెరిటేజ్ ఆగ్రో మెరైన్ ప్రైవేటు లిమిటెడ్, హెరిటేజ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, నిర్వాణ మీడియా పెట్టుబడులు ఏమయ్యాయి? వాటి వివరాలను ఈసారి ఎందుకు ప్రకటించలేదు? - లోకేశ్ ఈ ఏడాది కాలంలో రూ.5.29 కోట్ల రుణాలను ఎలా తీర్చాడు? దీనికి సంబంధించిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? - చంద్రబాబు కోడలు బ్రహ్మణి పేరిట జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 19లో 650 చదరపు గజాల స్థలంలో ఉన్న ఇంటి మార్కెట్ విలువను 2016లో రూ.3.50 కోట్లుగా చూపించారు. ఈ ఏడాది ఆ ఇంటిని ఎంతకు అమ్మారో ఎందుకు చూపలేకపోయారు? - జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 1లో 723 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని రూ.8.82 కోట్లకు ఈ ఏడాది కొనుగోలు చేశారు. ఈ రెండు స్థలాల మార్కెట్ విలువల్లో వాస్తవాలు ఎంత? - బ్రహ్మణి ఈ ఏడాదిలో చేసిన అప్పులు రూ.5.3 కోట్లు ఏమయ్యాయి? - పైసా సంపాదన లేని మనవడు దేవాన్ష్ ఆస్తులు ఏడాదిలోనే రూ.7.17 కోట్లు ఎలా పెరిగాయి? - దేవాన్ష్ పేరిట జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో ఉన్న ఇంటిని విక్రయించగా వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయాయి? - చంద్రబాబు కుటుంబానికి చెందిన పెట్టుబడుల సంస్థ నిర్వాణ హోల్డింగ్స్ ఆస్తులు రూ.9.51 కోట్లు ఏ విధంగా పెరిగాయి? ఈ ఇల్లు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మెటీరియల్‌తో భారీ ఖర్చుతో అత్యంత విలాసవంతంగా నిర్మించారు. 2,479 గజాల విస్తీర్ణంలో.. 20,383 చదరపు అడుగుల నిర్మాణం ఇది. సెల్లార్, రెండు అంతస్తులున్నాయి. సెల్లార్లో 19 కార్ల పార్కింగ్ సదుపాయం ఉంది. ఇంకా అత్యాధునిక లిఫ్ట్‌లు, వీఐపీ లాంజ్‌లు తదితర అనేక సదుపాయాలున్నాయి. చినుకు పడితే చిల్లులు పడిపోయే తాత్కాలిక సచివాలయానికి చదరపు అడుగుకు చంద్రబాబు లెక్క ప్రకారం రూ.11 వేలకుపైగా ఖర్చయింది. అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఈ భవనం.. మెటీరియల్, స్థలం విలువతో కలుపుకుంటే రూ.100 కోట్లు పైమాటేనని నిపుణులంటున్నారు. అత్యంత ఖరీదైన భవంతి కనుకనే పార్టీవారికి గానీ, బంధువులకు గానీ ఇందులో ప్రవేశం లేదని చెప్పుకుంటుంటారు. ఈ నూరు కోట్ల భవనం చంద్రబాబు, లోకేష్ ఇద్దరి పేరుమీద ఉంది. అందులో సగం బాబు వాటా అనుకుంటే రూ. 50 కోట్లు. అయితే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.2.33 కోట్లేనని లోకేష్ బాబు చూపించారు.. ఆస్తుల ప్రకటన వార్త చూసినవారెవరైనా వచ్చి ఆ రూ. 2.33 కోట్లకు మరో రూ.3 కోట్లు ఇస్తాం ఇల్లు ఇచ్చేస్తారా అని అడిగితే ఏం చెప్తారో.. -
అ–అమరావతి ఆ–ఆదాయం
- మనుమడితో అక్షరాలు దిద్దించిన చంద్రబాబు - తిరుమలలో నారా దేవాన్ష్ అక్షరాభ్యాస కార్యక్రమం - కొత్త సంప్రదాయానికి అంకురార్పణ చేశామన్న సీఎం సాక్షి, తిరుమల: సీఎం చంద్రబాబు నాయుడు మనుమడు దేవాన్ష్ అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో నిర్వహించారు. ఇందులో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, దేవాన్ష్ తల్లిదండ్రులు నారా లోకేశ్, బ్రాహ్మణి, ఇతర కుటుంబీకులు మాత్రమే పాల్గొన్నారు. అక్షారాభ్యాసం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు తన మనుమడు దేవాన్ష్ తో అ–అమ్మ, ఆ–ఆంధ్రప్రదేశ్, అ–అమరావతి, ఆ–ఆనందం, ఆ–ఆరోగ్యం, ఆ–ఆదాయం అన్న అక్షరాలను దిద్దించారు. అనంతరం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయానికి వచ్చిన సీఎంకు మహద్వారం వద్ద టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తికపాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మూల మూర్తి పాదాలవద్ద ఉంచిన శేషవస్త్రాన్ని వేదపండితులు సీఎంకు బహూకరించారు. తర్వాత హుండీలో కానుకలు, ముడుపులను సీఎం, కుటుంబసభ్యులు సమర్పించారు. తదుపరి వారికి రంగనాయకుల మండ పంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీని వాసరాజు శ్రీవారి చిత్రపటం అంద జేశారు. అనంతరం ఆలయం వెలుపల సీఎం మీడియాతో మాట్లాడారు. తమ కులదైవం శ్రీవేంకటేశ్వరస్వామివారని, అందుకే గతంలో తిరుమలలోనే తమ మనుమడు దేవాన్ష్ అన్న ప్రాసన చేశామని, ప్రస్తుతం అక్షరాభ్యాసం కూడా చేయించామని చెప్పారు. అక్షరాభ్యాసం లో భాగంగా దేవాన్ష్ తో అ–అమ్మ, ఆ–ఆంధ్రప్రదేశ్, అ–అమరావతి, ఆ–ఆనందం, ఆ–ఆరోగ్యం, ఆ–ఆదాయం.. అన్న అక్షరాల్ని దిద్దించి నూత న సంప్రదాయానికి అంకురార్పణ చేయించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు విద్యనందించి మేధస్సు పెంచాలన్నారు. జన్మనిచ్చిన తల్లి పేరుతో ‘అమ్మకు వందనం’ కార్యక్రమం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలిని త్వరలోనే నియమిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఆలయ పవిత్రతతోపాటు సేవ చేసేవారినే కొత్త కమిటీలో నియమిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేసి, తాగునీరు, సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ ఏడాదికి హంద్రీ–నీవా నీళ్లిస్తామని, వచ్చేఏడాది గాలేరు–నగరి, మలిదశలో మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి చేస్తామని, దీనిపై టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలిచ్చానని పేర్కొన్నారు. ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం ఆలయాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.