అ–అమరావతి ఆ–ఆదాయం
- మనుమడితో అక్షరాలు దిద్దించిన చంద్రబాబు
- తిరుమలలో నారా దేవాన్ష్ అక్షరాభ్యాస కార్యక్రమం
- కొత్త సంప్రదాయానికి అంకురార్పణ చేశామన్న సీఎం
సాక్షి, తిరుమల: సీఎం చంద్రబాబు నాయుడు మనుమడు దేవాన్ష్ అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో నిర్వహించారు. ఇందులో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, దేవాన్ష్ తల్లిదండ్రులు నారా లోకేశ్, బ్రాహ్మణి, ఇతర కుటుంబీకులు మాత్రమే పాల్గొన్నారు. అక్షారాభ్యాసం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు తన మనుమడు దేవాన్ష్ తో అ–అమ్మ, ఆ–ఆంధ్రప్రదేశ్, అ–అమరావతి, ఆ–ఆనందం, ఆ–ఆరోగ్యం, ఆ–ఆదాయం అన్న అక్షరాలను దిద్దించారు. అనంతరం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయానికి వచ్చిన సీఎంకు మహద్వారం వద్ద టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తికపాల్ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మూల మూర్తి పాదాలవద్ద ఉంచిన శేషవస్త్రాన్ని వేదపండితులు సీఎంకు బహూకరించారు. తర్వాత హుండీలో కానుకలు, ముడుపులను సీఎం, కుటుంబసభ్యులు సమర్పించారు. తదుపరి వారికి రంగనాయకుల మండ పంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీని వాసరాజు శ్రీవారి చిత్రపటం అంద జేశారు. అనంతరం ఆలయం వెలుపల సీఎం మీడియాతో మాట్లాడారు. తమ కులదైవం శ్రీవేంకటేశ్వరస్వామివారని, అందుకే గతంలో తిరుమలలోనే తమ మనుమడు దేవాన్ష్ అన్న ప్రాసన చేశామని, ప్రస్తుతం అక్షరాభ్యాసం కూడా చేయించామని చెప్పారు. అక్షరాభ్యాసం లో భాగంగా దేవాన్ష్ తో అ–అమ్మ, ఆ–ఆంధ్రప్రదేశ్, అ–అమరావతి, ఆ–ఆనందం, ఆ–ఆరోగ్యం, ఆ–ఆదాయం.. అన్న అక్షరాల్ని దిద్దించి నూత న సంప్రదాయానికి అంకురార్పణ చేయించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు విద్యనందించి మేధస్సు పెంచాలన్నారు. జన్మనిచ్చిన తల్లి పేరుతో ‘అమ్మకు వందనం’ కార్యక్రమం చేపట్టనున్నామని ఆయన తెలిపారు.
గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలిని త్వరలోనే నియమిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఆలయ పవిత్రతతోపాటు సేవ చేసేవారినే కొత్త కమిటీలో నియమిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేసి, తాగునీరు, సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ ఏడాదికి హంద్రీ–నీవా నీళ్లిస్తామని, వచ్చేఏడాది గాలేరు–నగరి, మలిదశలో మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి చేస్తామని, దీనిపై టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలిచ్చానని పేర్కొన్నారు. ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం ఆలయాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.