సాక్షి, అమరావతిబ్యూరో : ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీకి సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరు పెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అధికారులెవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. గ్రామస్తులు మాత్రం సొమ్మొకరిది.. సోకొకరిది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఆ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కొందరు ఎన్‌ఆర్‌ఐలు తమ వంతు సాయం అందించగా.. ఆ పనులు కూడా తామే చేపట్టామని సీఎం కుటుంబసభ్యులు పేర్కొంటుండటం విశేషం.
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 2015 సెప్టెంబరులో దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ జనాభా సుమారు 2,200. ఎన్టీఆర్ భార్య బసవరామతారకం ఈ గ్రామంలోనే జన్మించారు. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించి దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత పలు దఫాలుగా ఆమె గ్రామాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ఆ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధులతోపాటు గ్రామస్తులు వితరణ ఇచ్చిన డబ్బును కలుపుకుని అభివృద్ధి పనులు చేపట్టారు.
అభివృద్ధి అంతా ఆమె చలువే అంటూ..
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత.. ప్రభుత్వ నిధులతోపాటు పామర్రు జెడ్పీటీసీ దంపతుల సొంత నిధులు కలుపుకుని ఆ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించారు. రైతుల కోసం గ్రామంలో ఉన్న డొంకరోడ్లను జేఎస్పీ రహదారులుగా మార్పు చేసేందుకు ప్రభుత్వం రూ. 45.50 లక్షలు మంజూరు చేసింది. అలాగే భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి రూ. 4.40 కోట్లు, అంతర్గత సిమెంటు రోడ్లకు రూ. 2.06 కోట్లు, 1.7 కిలోమీటర్ల పొడవున్న జిల్లా పరిషత్ రోడ్డును సిమెంటురోడ్డుగా మార్చేందుకు రూ. 1.70 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన అమరలింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి వారి దేవస్థానం పునః నిర్మాణానికి దేవదాయ శాఖ రూ. 38 లక్షలు మంజూరు చేసింది. అలాగే గ్రామస్తులు మరో రూ. 15 లక్షలు వితరణ ఇచ్చారు. ఇలా.. పంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు కూడా ప్రభుత్వ నిధులే కావడం విశేషం. అయితే గ్రామంలో ఈ అభివృద్ధి అంతా నారా భువనేశ్వరి వల్లే జరిగిందని ఆమె బంధువులు, అధికారపార్టీ నాయకులు చెప్పుకోవడాన్ని చూసి గ్రామస్తులు విస్తుపోతున్నారు.
హౌసింగ్ కాలనీకి దేవాన్ష్ పేరు..
అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద కొమరవోలు గ్రామానికి గృహనిర్మాణ శాఖ అధికారులు 250 పక్కా గృహాలు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికీ ప్రభుత్వం 1.50 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామంలో చేపట్టిన 150 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో ఒకే చోట 54 ఇళ్లను ఇటీవలే పూర్తి చేశారు. ప్రభుత్వ నిధులకు అదనంగా లబ్ధిదారులు కూడా కొంత మొత్తం జమ చేసి వాటిని నిర్మించుకోవడం జరిగింది. తమ సొంత నిధులు రూపాయి కూడా వెచ్చించకుండా సీఎం దంపతులు ఆ కాలనీకి తమ ముద్దుల మనవడు దేవాన్ష్ పేరు పెట్టేశారు. ప్రభుత్వ నిధులకు తోడుగా ఎవరైనా దాతలు తమ వంతు సాయం చేస్తే.. వారు కోరినట్లుగా కాలనీలకు గాని, భవనాలకు గాని పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని.. ఈ కాలనీ నిర్మాణం కేవలం ప్రభుత్వ నిధులతో జరిగిందని.. దానికి పథకం పేరు తప్ప వేరే పేరు పెట్టడానికి వీల్లేదని గృహనిర్మాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment