komaravolu
-
కృష్ణా జిల్లా కొమరవోలు గ్రామస్తులపై బాలకృష్ణ అసహనం
-
‘కొమరవోలా.. అదెక్కడుంది? ఆ ఊరికి ఈ జన్మలో రాను’
సాక్షి, కృష్ణా జిల్లా: ఒకసారి మీ అమ్మమ్మగారి ఊరొచ్చి అక్కడ సమస్యలు పరిష్కరించండయ్యా..అని అభ్యర్థిచిన గ్రామస్తులకు ఆ ఊరికి తాను ఈ జన్మలో రానంటూ షాకిచ్చారు సినీ నటుడు, హిందూపూరం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. గురువారం తన స్వస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామానికి బాలకృష్ణ వచ్చారు.అక్కడి స్థానికులు, కుటుంబ సభ్యులు, చుట్టాలతో కొద్దిసేపు మాట్లాడారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్వరలో అమరావతిలో కూడా దాతల సహకారంతో కేన్సర్ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు చెప్పారు. బాలకృష్ణ నిమ్మకూరు వచ్చారని తెలియడంతో సమీపంలోని కొమరవోలు గ్రామస్తులు అక్కడికి వచ్చి ఆయనను కలుసుకున్నారు.మీ అమ్మగారి పుట్టిల్లు, మీ అమ్మమ్మగారి ఊరు కొమరవోలు రావాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు బాలకృష్ణను కోరారు. దీనికి బాలకృష్ణ బదులిస్తూ ‘కొమరవోలా..అదెక్కడుంది? ఆ ఊరికి ఈ జన్మలో రాను’ అని వ్యాఖ్యానించారు. ‘వారు లింగాయతులు..ఆ ఊరుని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నారు.ఇదీ చదవండి: బూతులు తిడుతూ నీతులు.. -
కన్న తల్లి ఊరుని అవమానించిన బాలయ్య
-
భువనేశ్వరి దత్తత గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ!
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామం.. ఇద్దరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న గ్రామం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్య బసవతారకం పుట్టినిల్లు.. మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అమ్మమ్మ ఊరు. పైగా ఈ గ్రామాన్ని భువనేశ్వరి దత్తత కూడా తీసుకున్నారు. అభివృద్ధి చేస్తానంటూ ఆమె భారీఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం అభ్యర్థి కన్నా వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్కుమార్కు 295 ఓట్ల మెజార్టీని ఇక్కడి గ్రామస్తులు కట్టబెట్టారు. ఈ గ్రామంలో 1,474 ఓట్లు పోలవ్వగా అందులో వైఎస్సార్సీపీకి 843 ఓట్లు రాగా, టీడీపీకి 548 ఓట్లు మాత్రమే లభించాయి. దత్తత తీసుకున్నా చేసిందేమి లేదు భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి చేసిందేమి లేదు. గ్రామంలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలను తీర్చలేకపోయారు. నారా దేవాన్ష్ కాలనీ పేరిట గృహనిర్మాణాలు అంటూ హడావుడి చేసినప్పటికీ కేవలం కొందరికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్ని రోజులపాటు టీడీపీని ఆదరించిన గ్రామస్తులు విసుగుచెంది ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. -
ఇది నారా దేవాన్ష్ కాలనీ..
సాక్షి, అమరావతిబ్యూరో : ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీకి సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరు పెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అధికారులెవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. గ్రామస్తులు మాత్రం సొమ్మొకరిది.. సోకొకరిది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఆ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కొందరు ఎన్ఆర్ఐలు తమ వంతు సాయం అందించగా.. ఆ పనులు కూడా తామే చేపట్టామని సీఎం కుటుంబసభ్యులు పేర్కొంటుండటం విశేషం. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 2015 సెప్టెంబరులో దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ జనాభా సుమారు 2,200. ఎన్టీఆర్ భార్య బసవరామతారకం ఈ గ్రామంలోనే జన్మించారు. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించి దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత పలు దఫాలుగా ఆమె గ్రామాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ఆ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధులతోపాటు గ్రామస్తులు వితరణ ఇచ్చిన డబ్బును కలుపుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. అభివృద్ధి అంతా ఆమె చలువే అంటూ.. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత.. ప్రభుత్వ నిధులతోపాటు పామర్రు జెడ్పీటీసీ దంపతుల సొంత నిధులు కలుపుకుని ఆ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించారు. రైతుల కోసం గ్రామంలో ఉన్న డొంకరోడ్లను జేఎస్పీ రహదారులుగా మార్పు చేసేందుకు ప్రభుత్వం రూ. 45.50 లక్షలు మంజూరు చేసింది. అలాగే భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి రూ. 4.40 కోట్లు, అంతర్గత సిమెంటు రోడ్లకు రూ. 2.06 కోట్లు, 1.7 కిలోమీటర్ల పొడవున్న జిల్లా పరిషత్ రోడ్డును సిమెంటురోడ్డుగా మార్చేందుకు రూ. 1.70 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన అమరలింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి వారి దేవస్థానం పునః నిర్మాణానికి దేవదాయ శాఖ రూ. 38 లక్షలు మంజూరు చేసింది. అలాగే గ్రామస్తులు మరో రూ. 15 లక్షలు వితరణ ఇచ్చారు. ఇలా.. పంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు కూడా ప్రభుత్వ నిధులే కావడం విశేషం. అయితే గ్రామంలో ఈ అభివృద్ధి అంతా నారా భువనేశ్వరి వల్లే జరిగిందని ఆమె బంధువులు, అధికారపార్టీ నాయకులు చెప్పుకోవడాన్ని చూసి గ్రామస్తులు విస్తుపోతున్నారు. హౌసింగ్ కాలనీకి దేవాన్ష్ పేరు.. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద కొమరవోలు గ్రామానికి గృహనిర్మాణ శాఖ అధికారులు 250 పక్కా గృహాలు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికీ ప్రభుత్వం 1.50 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామంలో చేపట్టిన 150 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో ఒకే చోట 54 ఇళ్లను ఇటీవలే పూర్తి చేశారు. ప్రభుత్వ నిధులకు అదనంగా లబ్ధిదారులు కూడా కొంత మొత్తం జమ చేసి వాటిని నిర్మించుకోవడం జరిగింది. తమ సొంత నిధులు రూపాయి కూడా వెచ్చించకుండా సీఎం దంపతులు ఆ కాలనీకి తమ ముద్దుల మనవడు దేవాన్ష్ పేరు పెట్టేశారు. ప్రభుత్వ నిధులకు తోడుగా ఎవరైనా దాతలు తమ వంతు సాయం చేస్తే.. వారు కోరినట్లుగా కాలనీలకు గాని, భవనాలకు గాని పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని.. ఈ కాలనీ నిర్మాణం కేవలం ప్రభుత్వ నిధులతో జరిగిందని.. దానికి పథకం పేరు తప్ప వేరే పేరు పెట్టడానికి వీల్లేదని గృహనిర్మాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
సీఎం భార్య దత్తత గ్రామానికే నిధులన్నీ?
మిగతా పల్లెల గతేమిటి? సర్కారుపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం పామర్రు : స్మార్ట్ విలేజ్ అభివృద్ధి అంటూ ఒక్క గ్రామానికే రూ. 7 కోట్ల ప్రభుత్వ నిధుల్ని కట్టబెట్టడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని అసెంబ్లీలో వెఎస్సార్ సీపీ డిప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని కొమరవోలు గ్రామాన్ని సీఎం సతీమణి నారా భువనేశ్వరీ దత్తత తీసుకోగా, ఇప్పటివరకూ గ్రామానికి ఆర్డీఎఫ్ నిధులు రూ.7కోట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు. సీఎం సతీమణి దత్తత తీసుకున్నారని అంత భారీమొత్తంలో ప్రజల సొమ్మును ఒక్క గ్రామానికే ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదన్నారు. నియోజకవర్గంలో అనేక గ్రామాలకు సరైన రహదారులు లేక బరద రోడ్లతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన గ్రామాల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వం స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులను ఉత్సవిగ్రహాలుగా మార్చి, ఓడిపోయినవారికి, పరిపాలనలో భాగస్వామ్యంలేని వారికి పెద్దపీట వేయడం ఏమిటని ప్రశ్నించారు. కావాలంటే సొంత డబ్బును ఖర్చు పెట్టుకోవాలని సూచించారు. దీనిపై రాబోయే అసెంబ్లీ సమావేశాలలో గట్టిగా నిలదీస్తామన్నారు. దాసు గంగాధరరావు, ఆరుమళ్ల శ్రీనా«ద్రెడ్డి, ఎన్సాంబిరెడ్డి పాల్గొన్నారు.