బరిలో మనవళ్లు.. హసన్‌ను వదులుకుంది అందుకేనా?! | Deve Gowda Grandsons Likely To Contest In Lok Sabha Polls | Sakshi
Sakshi News home page

బరిలో మనవళ్లు.. ఢీ అంటే ఢీ?!

Published Sat, Jan 12 2019 12:48 PM | Last Updated on Sat, Jan 12 2019 1:37 PM

Deve Gowda Grandsons Likely To Contest In Lok Sabha Polls - Sakshi

బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ తెలిపారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వేణుగోపాల్‌, మాజీ సీఎం సిద్ధరామయ్యతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హసన్‌ లోక్‌సభ స్థానం నుంచి దేవెగౌడ మనుమడు, కర్ణాటక మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ ఎన్నికల బరిలో దిగనున్నారనే ప్రచారం జోరందుకుంది.

నిఖిల్‌ కుమారస్వామికి కూడా ఛాన్స్‌!
నెల రోజుల క్రితం బెంగళూరులో జరిగిన జేడీఎస్‌ నేత, ఎమ్మెల్సీ బీఎం ఫరూఖ్‌ కూతురి పెళ్లికి ఎంపీ దేవెగౌడ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనుమలు నిఖిల్‌ (కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు, కన్నడ హీరో), ప్రజ్వల్‌ (మంత్రి రేవణ్ణ కుమారుడు) తమ తాతయ్యతో ముచ్చటించిన దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో నిఖిల్‌, ప్రజ్వల్‌లు త్వరలోనే రాజకీయ అరంగేట్రం ఖరారైందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పోటీ చేసే విషయమై వీరిరువురు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

హసన్‌ను వదులుకుంది అందుకేనా?
జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ప్రస్తుతం హసన్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టు ఉంది. గత ఆరు పర్యాయాలుగా(ఉప ఎన్నికలు సహా) హసన్‌లో జేడీఎస్‌ గెలుపు జెండా ఎగురవేస్తూనే ఉంది. ఇక్కడి నుంచే దేవెగౌడ ఎంపీగా హ్యాట్రిక్‌ కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌.. తాతయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే బరిలో నిలవాలని ఆశిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రజ్వల్‌ పార్టీ టికెట్‌ ఆశించారని.. అయితే అప్పుడు కుదరకపోవడంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించేందుకు దేవెగౌడ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హసన్‌ నుంచి తాను పోటీచేయబోనని, తన స్థానంలో ప్రజ్వల్‌ పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం తాను పోటీచేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. దీంతో నిఖిల్‌ కూడా తనకు టికెట్‌ ఇచ్చే విషయమై దేవెగౌడపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే తండ్రి కుమారస్వామి నుంచి మాట తీసుకున్న నిఖిల్‌ మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు. ‘ ఒకవేళ ప్రజ్వల్‌ పోటీ చేయడం ఖాయమైతే, నిఖిల్‌ కూడా తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి దేవెగౌడ నో చెప్పలేరు అని అభిప్రాయపడ్డారు.

కాగా జేడీఎస్‌ నుంచి ఇప్పటికే దేవెగౌడ ఎంపీగా, కుమారస్వామి సీఎంగా, ఆయన భార్య అనితా కుమారస్వామి ఎమ్మెల్యేగా, రేవణ్ణ మంత్రి(పీడబ్ల్యూడీ)గా, ఆయన భార్య భవానీ హసన్‌ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా వివిధ పదవుల్లో ఉన్నారు. దీంతో ఇప్పటికే కొంతమంది పార్టీ సీనియర్‌ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు వారసులు కూడా అరంగేట్రం చేయనుండటంపై వారు ఎలా స్పందిస్తారోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement