‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. భారతదేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని.. భయం, పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’.
‘‘చంద్రబాబు నాయుడు అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, లేదా తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’.
సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 2014 జూన్ 8న ప్రజల సమక్షంలో చేసిన ప్రమాణం ఇది. ఇందులోని ఏ ఒక్క ప్రమాణాన్నీ ఆయన ఈ నాలుగేళ్ల పాలనలో పాటించలేదు. పైగా.. రాజ్యాంగాన్ని పరిహసిస్తూ, ప్రజాస్వామ్య సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ నియంతృత్వ పాలన సాగించారు. పరిపాలనలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చారు. చట్టాలను, శాసనాలను తుంగలో తొక్కారు. కేవలం తన వర్గానికి, తన పార్టీ వారికి మాత్రమే మేలు చేసేలా పాలన సాగించారు. ప్రభుత్వ నేతగా తనకు తెలియవచ్చిన విషయాలను ఏ వ్యక్తికీ, వ్యక్తులకు తెలియపర్చనని దైవసాక్షిగా చేసిన ప్రమాణానికి తొలి అడుగులోనే గండికొట్టారు. రాజధానిని ఏ ప్రాంతంలో పెడతారోనన్న విషయాన్ని తన అనుయాయులకు, తన వర్గానికి ముందుగా తెలియజేసి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.
ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల నుంచి 30 కోట్లు
ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన మరుక్షణం నుంచే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వానికి తెరలేపారు. ప్రతిపక్ష పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి పార్టీలోకి తీసుకోవాలన్న కనీస ధర్మాన్ని గాలికొదిలేశారు. టీడీపీలో చేరితే కనిష్టంగా రూ. 20 నుంచి 30 కోట్లు ఇస్తామని ఎమ్మెల్యేలకు వలవేశారు. ఇందుకు ఏకంగా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతూ దళారీ పాత్ర పోషించడం విశేషం. ఇలా ఇప్పటివరకు మొత్తం 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు (వీరిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిచెందగా ఉప ఎన్నిక జరిగింది), ముగ్గురు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీకి రూ. కోట్లు ఎరచూపి తెలుగుదేశంలో చేర్చుకున్నారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్లో నలుగురికి ఏకంగా కేబినెట్లో చోటు కల్పించారు. గవర్నర్ సమక్షంలో యావత్ రాష్ట్ర ప్రజలు చూస్తుండగా నిస్సిగ్గుగా ప్రమాణ స్వీకారం చేయించి ప్రజాస్వామ్య ప్రమాణాలకు పాతరేశారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నా ప్రజాస్వామ్య వ్యవస్థలు మౌనముద్ర దాల్చాయి. పార్టీ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టాలని స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ పలుమార్లు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. న్యాయస్థానాలను ఆశ్రయించినా, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి విన్నవించినా ఫిరాయింపుదారులపై చర్యలు లేకుండాపోయాయి.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు నిధులు బంద్
ఇదిలా ఉంటే.. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను బెదిరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేసింది. అంతేకాక, ఎలాంటి అభివృద్ధి పనులనూ మంజూరు చేయడంలేదు. ముఖ్యమంత్రి.. ప్రత్యేక నిధి పేరిట తన వద్దనే ప్రత్యేక బడ్జెట్‌ను ఉంచుకుని టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు నిధులు విడుదల చేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన శాసనసభ్యులకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వడంలేదు. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి.. రాజ్యాంగ ప్రమాణాన్ని సైతం ఉల్లంఘించి కేవలం స్వపక్షీయులకే ప్రభుత్వ పథకాలన్న రీతిలో ఈ నాలుగేళ్ల పాలన సాగించారు.
‘ఓటుకు కోట్లు’తో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. 2015 జూన్‌లో తెలంగాణ శాసన మండలికి నిర్వహించిన ఎన్నికల్లో తమ పార్టీకి తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు చంద్రబాబు నీచస్థాయికి దిగజారిపోయారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఎరగా వేస్తూ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారు. ఈ అంశాన్ని శాసనసభలో లేవనెత్తేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేయించారు.
అసెంబ్లీలోనూ ఏకపక్షంగా..
అత్యంత పవిత్రమైన శాసనసభను కూడా చంద్రబాబు నాయుడు తన అప్రజాస్వామిక నియంతృత్వ పోకడలతో అపవిత్రం చేశారు. రాజ్యాంగ నియమాలకు లోబడి ఉండే అసెంబ్లీ నిబంధనలను పూర్తిగా విస్మరించి అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చేశారు. ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా లేకుండా ప్రతిపక్షం గొంతు నొక్కేయించారు. దీంతో 2018 బడ్జెట్ సమావేశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బహిష్కరించింది. వారితో సంప్రదింపులు చేయాలన్న కనీస మర్యాదను కూడా చంద్రబాబు ప్రభుత్వం పాటించలేదు. రాజధాని ఎంపిక సమయంలో కానీ, అమరావతికి శంకుస్థాపన విషయంలోగానీ ప్రధాన ప్రతిపక్షానికి మొక్కుబడిగా చివరి నిమిషంలో ఆహ్వానపత్రం అందించారు. కాగా, గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నోటీసు ఇచ్చింది. దీన్ని నిబంధనలకు విరుద్ధంగా అదే రోజున ప్రభుత్వం చర్చకు చేపట్టి ఫిరాయింపుదారులకు అండగా నిలిచింది. స్పీకర్ తొలగింపుపై ఇచ్చిన నోటీసు వ్యవహారంలోనూ అలాగే వ్యవహరించింది. ద్రవ్య వినిమయ బిల్లు–2016 డివిజన్ ఓటింగ్ విషయంలోనూ ఇదే పునరావృతమైంది. అయితే నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాతే చర్చ చేపట్టాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అలాగే, ప్రజాసమస్యలపై, అధికార పార్టీ నేతల అరాచకాలపై నిలదీసినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజాను అప్రజాస్వామికంగా, శాసనసభా నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
హోదాపై మాటతప్పారు
ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత వంటిది. మేనిఫెస్టోలో హామీ ఇస్తున్నామంటే దానిని నెరవేర్చితీరుతారని ప్రజలు నమ్ముతారు. కానీ మేనిఫెస్టో హామీలన్నిటికీ చంద్రబాబు తూట్లు పొడిచారు. అంతేకాదు మేనిఫెస్టోలోనూ, ఎన్నికల సభల్లోనూ హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అంశాన్నీ అటకెక్కించారు. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా అంటూ ఎద్దేవా చేశారు. హోదా కోసం పోరాటం చేస్తున్న వారిపై పీడీ కేసులు పెట్టించారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు హోదాను కాదని ప్యాకేజీకి సై అన్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇప్పుడు ప్రజల భావోద్వేగాలను గమనించి హోదా పల్లవి అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment