
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో సునామీ సృష్టిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జనవరి రెండో వారం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బలమైన పార్టీగా వైఎస్సార్‌సీపీ ఎదుగుతోందని... ఇటీవల వచ్చిన ఆరు సర్వేల్లో పార్టీ గెలుస్తుందని వచ్చిన నివేదికలే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందన్న ధర్మాన... ఎంత మంది అధికారులను రంగంలోకి దింపినా సీఎం చంద్రబాబు నాయుడు సభలకు మాత్రం ప్రజలు రావడం లేదని ఎద్దేవా చేశారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు....
ఏపీలో శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అని సర్వేలు చెబుతున్నా చంద్రబాబు మాత్రం జిల్లాను పట్టించుకోవడం లేదని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులకు చంద్రబాబు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. దేశం మొత్తం తిరిగి రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయాయని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు... రాష్ట్ర ప్రజల బాగోగులను గాలికొదిలేశారని మండిపడ్డారు. రాజధాని భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియనివ్వకుండా చేయడం కోసం రహస్యంగా జీవోలు తీసుకువస్తున్నారని.. అయినా ప్రజలు బాబు ఎత్తుగడలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మాకు ఆ అవసరం లేదు
చంద్రబాబు ఆగడాలను అరికట్టాలంటే ప్రజలకు వైఎస్సార్‌సీపీ అండ అవసరం... కాబట్టి ఈసారి జల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే తెలంగాణ ఎన్నికలలో ఈసారి తాము పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమకు టీఆర్‌ఎస్ పార్టీ అవసరం ఉండదని..ప్రజలను దోపిడీ చేస్తున్న వారికే అనైతిక పొత్తుల అవసరం ఉంటుందని ఎద్దేవా చేశారు.