
సాక్షి, అనంతపురం : ధర్మవరం టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూరీపై టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాదు సూరీ ఆడియో టేపులు విడుదల చేసి ఆయన బండారాన్ని బట్టబయలు చేశారు. ‘ మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదు. ఎన్నికల్లో బాగా పనిచేయండి. కౌంటింగ్ పూర్తైన క్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలుపెడదాం. నరుకుదాం. చంపుదాం. ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే చెబుదాం. వారి సహకారం తీసుకుందాం. ఆరు మాసాల్లోగా ప్రత్యర్థులను అంతమొందిద్దాం’ అంటూ సూరీ.. తన కార్యకర్తలతో మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఎమ్మెల్యే సూరి భార్యకు రెండు చోట్ల ఓటు
ఈ నేపథ్యంలో ధర్మవరం టీడీపీ నేతలు మద్దిలేటి, రామకృష్ణ, నాగశేషు, గంటాపురం జగ్గు మాట్లాడుతూ.. ‘ వరదాపురం సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారు. శ్రమించే కార్యకర్తలకు న్యాయం చేయలేదు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేశారు. సూరీ నాయకత్వంలో పనిచేయలేం’ అని అసమ్మతి వెళ్లగక్కారు. కాగా ఇలా వ్యవహరించడం వరదాపురం సూరీకి కొత్తేం కాదు. గతంలో బలవంతపు భూసేకరణను అడ్డుకున్న మహిళా రైతుపై ఆయన నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. మహిళా రైతును చెప్పుతో కొట్టాలని అనుచరుడికి హుకుం జారీ చేసిన సూరీ... దాడి చేసి వచ్చాక ఎలాంటి కేసు నమోదు చేయొద్దని ఎస్సైకు ఆదేశాలు చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment