సాక్షి ప్రతినిధి, కర్నూలు : ‘ఎన్నికల్లో ఖర్చు పెట్టమంటూ ఇప్పుడు పిలిచి మర్యాదగానే డబ్బిస్తారు. తర్వాతే అసలు కథ ఉంటుంది. ఓట్లు వేయించలేదని, ఒకవేళ గెలిచినా ఆధిక్యం తగ్గిందని కారణాలు చెబుతూ వెనక్కు ఇవ్వమంటారు. లేదంటే తన్ని మరీ తీసుకుంటారు. అసలెందుకు ఈ గొడవ? తీసుకోకుండా ఉంటే పోలా?’ ఇదీ ప్రస్తుతం కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల మనోగతం. దీనికి వారు గతంలో తమకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకూ అసలు విషయమేమంటే... ఎన్నికల్లో పంపిణీకి డోన్ అధికార పార్టీ నేత డబ్బు ఇస్తా రమ్మని క్యాడర్‌ను పిలుస్తున్నారు. కానీ, నాయకుల నుంచి మాత్రం స్పందన లేదు. కొందరు తీసుకునేందుకే జంకుతుంటే... ఇంకొందరు మా కొద్దు మీ నగదు అంటూ తిరస్కరిస్తున్నారు. మరింకొందరైతే అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ‘మేం నగదు తీసుకెళ్లి జనానికి ఇచ్చినా వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఓట్లు పడేది కూడా కష్టమేనని తెలుస్తోంది. ఫలితం తేడా వస్తే మా నేత మాకిచ్చిన నగదు వెనక్కు తెమ్మంటాడు. మేం ఆస్తులు అమ్మాల్సి వస్తుంది’ అని టీడీపీ నేతలు వాపోతున్నారు. మరోవైపు పార్టీ మారాలని భావిస్తున్న కింది స్థాయి వారిని డోన్ నేత ఇంటికి పిలిపించి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘ముందుగా ఇన్ని రోజులు మాతో చేయించుకున్న పనులకు సమానమైన మొత్తాన్ని తిరిగిచ్చి వెళ్లిపోండి’ అని హెచ్చరిస్తున్నారు.
ఇవీ ఉదాహరణలు
- డోన్‌లో గతంలో కేఈ ప్రభాకర్ పోటీ చేసిన సమయంలో డబ్బు పంపిణీ బాధ్యతను ప్రధానంగా ఆయన అన్న కేఈ కృష్ణమూర్తి కుమారుడు, టీడీపీ ప్రస్తుత అభ్యర్థి కేఈ ప్రతాప్ పర్యవేక్షించేవారు. కోట్ల విజయభాస్కరరెడ్డి రాజీనామాతో 1996లో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ప్రభాకర్ పోటీ చేయగా కోట్ల కంటే 7 వేల ఓట్లు తక్కువగా 32 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో ప్యాపిలి మాజీ మండలాధ్యక్షుడు ఆర్‌ఈ కృష్ణమూర్తి వద్ద నుంచి కేఈ ప్రతాప్ డబ్బు వెనక్కి లాగేసుకున్నారు.
- కృష్ణగిరి మండలం (అప్పట్లో డోన్ నియోజకవర్గంలో ఉంది)లోని ఓ మాజీ సర్పంచ్ వద్ద సైతం ఇలాగే బెదిరించి మరీ గుంజేసుకున్నారు.
- 2014 ఎన్నికల్లో కేఈ ప్రతాప్ ఓడినప్పుడూ ఇచ్చిన డబ్బును తనకు ఓటు వేయలేదని బెదిరించి మరీ వెనక్కు తీసేసుకున్నారని చెప్పుకొంటారు.
- అనుకున్న మేర ఓట్లు వేయించలేదని పెద్దపూజర్ల సర్పంచ్ వద్ద నుంచి బలవంతంగా వసూలు చేశారు.
- తాజాగా ఆవులదొడ్డిలో ఒక నాయకుడు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ‘మా ప్రభుత్వంలో చేయించుకున్న పనులకు సమానమైన నగదు ఇచ్చిన తర్వాతే నువ్వు పార్టీ మారు’ అని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment