ప్రమాణ స్వీకారం చేస్తున్న దినకరన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. సచివాలయంలో స్పీకర్ ధనపాల్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా దినకరన్‌కు మద్దతుగా నిలిచారనే ఆరోపణలపై గురువారం 46 మందిపై వేటువేసిన సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం.. శుక్రవారం మాజీ మంత్రి రాధాకృష్ణన్ సహా 164 మంది పార్టీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ బాధ్యతలు, ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు.
ప్రభుత్వం కూలిపోయేవరకు శశికళ మౌనవ్రతం?
అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోయే వరకు శశికళ మౌనవ్రతంలోనే ఉంటారని దినకరన్ అనుచరులు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. దినకరన్ 2 రోజుల క్రితం బెంగళూరు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసు కున్నారు. జయ వర్ధంతి రోజైన ఈనెల 5 నుంచి శశికళ మౌన వ్రతం లో ఉన్నందున ఆమె ఏమీ మాట్లాడ లేదు.. జనవరి చివరి వరకు వ్రతాన్ని కొనసాగిస్తారని మీడియాతో దినకరన్ చెప్పారు. జయ మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సమర్పించాల్సిందిగా విచారణ కమిషన్ సమన్లు జారీచేసిన సమయంలో శశికళ మౌనవ్రతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment