‘కమలం’లో కలకలం.. | Disputes Between Leaders In BJP | Sakshi
Sakshi News home page

‘కమలం’లో కలకలం..

Published Sat, Mar 21 2020 9:27 AM | Last Updated on Sat, Mar 21 2020 9:28 AM

Disputes Between Leaders In BJP - Sakshi

వాగ్వివాదానికి దిగుతున్న నాయకులు

సాక్షి, నిర్మల్‌: కమలం పార్టీలో కలకలం చెలరేగింది. రాష్ట్ర నాయకుల ఎదుటే వాగ్వాదం, బాహాబాహీ జరిగింది. జిల్లాలో వర్గ రాజకీయం మరోసారి బయటపడింది. జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా పడకంటి రమాదేవిని రెండోసారి నియమించడంపైనే రగడ కొనసాగింది. ఇందుకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయమే వేదికైంది. స్థానిక కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందే ఆందోళన ప్రారంభమైంది.

పదవి నుంచి తొలగించాలంటూ.. 
రెండోసారి జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన రమాదేవిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ భైంసాకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్‌ను సమావేశానికి రానివ్వకుండా పార్టీ కార్యాలయం ఎదుట బైటాయించారు. శ్రీనివాస్, రమాదేవిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లాలో రమాదేవి అందుబాటులో ఉండకపోవడంతో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్లను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారని ఆరోపించారు. పార్టీ అభివృద్ధికి కాకుండా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి కోవర్టుగా పని చేస్తున్నారని విమర్శించారు. భైంసా అల్లర్లలో నష్టపోయిన బాధితులకు కూడా అండగా నిలువకుండా పోయిందని ఆరోపించారు. ఆమెను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తాము కౌన్సిలర్‌ పదవులకు రాజీనామా చేస్తామని వారు హెచ్చరించారు. 

ఇరు వర్గాల మధ్య తోపులాట..
కౌన్సిలర్లు పార్టీ కార్యాలయం ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టడం, శ్రీనివాస్, రమాదేవిలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈక్రమంలో రమాదేవి వర్గానికి, భైంసా బీజేపీ కౌన్సిలర్‌లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో ఒకరిపైఒకరు బాహాబాహీకి దిగారు. ఈసందర్భంగా నిర్మల్‌కు చెందిన ఒకరిద్దరు నాయకులు తీరుపైనా భైంసా కౌన్సిలర్లు, నాయకులు మండిపడ్డారు. అనంతరం రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్‌ వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. 

పార్టీ నష్టపోతుంది..
జిల్లాలో కాషాయపార్టీ అంటే అభిమానం ఉన్న కార్యకర్తలు, ప్రజలు లక్షల్లో ఉన్నారని, కానీ పార్టీని నడిపించే నాయకులే సరిగా లేరన్న ఆరోపణలు బీజేపీలో వెల్లువెత్తుతున్నాయి. అధిపత్య ధోరణి, అందరినీ కలుపుకొని పోయే తత్వం లేకపోవడంతోనే పార్టీలో వర్గాలు పెరుగుతున్నాయని పలువురు నాయకులు ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో భారీగా ఓట్లు వేసి పార్టీని గెలిపించారని, అలాంటి అభిమానమున్న వారికి బీజేపీని దూరం చేసే విధంగా పనిచేస్తున్నారంటూ విమర్శించారు.

జిల్లా, రాష్ట్ర నాయకుల తీరుతోనే జిల్లాలో పార్టీ నష్టపోతోందని మండిపడ్డారు. డాక్టర్‌ రమాదేవికి రెండోసారి అధ్యక్ష పదవి ఇవ్వడంలో గల ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆమెను తొలగించకుంటే తమ పదవులకు రాజీనామాలు చేస్తామంటూ భైంసా కౌన్సిలర్లు, నాయకులు హెచ్చరించారు. సిద్ధాంత పార్టీగా పేరున్న బీజేపీలో రాష్ట్ర సంఘటన మంత్రి, జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుల ముందే ఆందోళన చెలరేగడం         చర్చనీయాంశమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement