సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రిగా, పాలమూరు ఎంపీగా తెలంగాణకు ప్రత్యేకించి పాలమూరు జిల్లా కు ఏం వెలగబెట్టారో చెప్పాలంటూ మాజీ మంత్రి డీకే అరుణ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. శుక్రవారం వనపర్తిలో జరిగిన బహిరంగసభలో తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శనివారం ఆమె తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. ఓటమి భయంతోనే కేసీఆర్ విచక్షణ కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇంకా ఉమ్మడి ఏపీలో ఉన్నట్లు ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోందని, ఆయన మాటల్లో నిరా శ, నిస్పృహ కనబడుతోందన్నారు.
ఉద్యమం రోజు ల్లాగే భాష వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు. మహిళ అని కూడా చూడకుండా తనపై అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళాలోకం గమనిస్తోందన్నారు. సోయి తప్పిన మాటలు బంద్ చేసి సంస్కారం నేర్చుకోవాలని సీఎంకు ఆమె హితవు పలికారు. ఐదేళ్లపాటు మహబూబ్‌నగర్ ఎంపీగా ఉండి జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఏం చేశారో వివరించాలని, అదేవిధంగా సీఎం అయిన తర్వాత నాలుగేళ్లలో పాలమూరు అభివృద్ధికి ఏంచర్యలు తీసుకున్నారో వివరించాలని అరుణ డిమాండ్ చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన ప్రాజెక్టులకు కనీసం కాలువలు కూడా తవ్వించలేని అసమర్ధులని ఆరోపించారు.
‘నా బండారం బయటపెడతానన్నావు. కానీ, ఎవరి బండారం ఏంటో తెలంగాణ సమాజా నికి తెలుసు. జోగులాంబ తల్లి నిన్ను శిక్షించడం ఖాయం. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేసే ముం దు నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారన్న విషయం గుర్తు లేదా’ అని ఆమె ప్రశ్నించారు. ఓ శక్తితో పెట్టుకుంటున్నాడని, ఇక కేసీఆర్ తన దెబ్బకు కాస్కోవాల్సిందేనని హెచ్చరించారు. తన జాతకం బయటపెడతానని మాట్లాడిన కేసీఆర్ అదేంటో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. పాస్‌పోర్టు స్కాం చేసి మందిని అమ్మిన కుటుంబం కాదని, తమ కుటుం బం త్యాగాల కుటుంబమని, 60 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నామని, అలాంటి తనపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గులేని పని అని అన్నారు.
హారతి వీడియో బయటపెట్టాలి...
పాలమూరులోని ప్రాజెక్టుల నీళ్లను రాయలసీమకు తరలించుకు పోయినప్పుడు తాను మంగళహారతి ఇచ్చి రఘువీరారెడ్డిని ఆహ్వానించినట్టు సీఎం చేసిన వ్యాఖ్యలపైనా ఆమె తీవ్రస్థాయిలో స్పందించారు. తాను హారతి పట్టినట్టు వీడియో ఉందని చెప్పిన కేసీఆర్ దమ్ముంటే వీడియో బయటపెట్టాలని, లేనిపక్షంలో రాజకీయ సన్యాసానికి సిద్ధపడాలని అరుణ సవాల్ విసిరారు.
తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ రగిల్చి ఎన్నికల్లో ఓట్లు పొందాలనే వ్యూహంతో తన పై అభాండాలు వేయడం ఆపాలన్నారు. తనపై విమర్శలు చేసే స్థాయి కేసీఆర్‌ది కాదని, గద్వాల ప్రజలకు అరుణ అంటే ఏంటో తెలుసునని బదులిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్ర ప్రజలకు స్వేచ్చ లభించదన్నారు. ముందస్తు ఎన్నికల కోసం మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్, తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతుంటే ఎందుకు మోదీ కాళ్లు పట్టుకోలేదో చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment