సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ శుక్రవారం భేటీ అయ్యారు. రాజంపేట ఎంపీ స్థానంనుంచి సత్యప్రభను పోటీ చేయించే విషయంపై చంద్రబాబు ఆమెతో చర్చించారు. అయితే సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేస్తానని సత్యప్రభ వెల్లడించారు. ఆలోచించి రాత్రికి నిర్ణయం ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. కాగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆమెపై అధిష్టానం గత కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తోంది. ఈ ఎన్నికల్లో కీలకమైన ఎంపీ నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ నేతలు ఎవరూ సంసిద్ధత తెలపకపోవడం గమనార్హం. టీడీపీ బలహీనంగా ఉన్న రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు.
ఇంతకుముందు రాజంపేట నుంచి చిత్తూరు ఎంపీ డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులును పోటీ చేయించాలని చంద్రబాబు భావించినా ఆయన సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో డీకే సత్యప్రభను అక్కడినుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ ఆమె కూడా రాజంపేట ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవటంతో వేరే అభ్యర్థిని వెతుక్కోవల్సిన పని పడింది. టీడీపీ ఓడిపోయే నియోజకవర్గంలో తామెందుకు పోటీ చేయాలన్నది వారి ఉద్దేశంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment