రాంపూర్: వివాదాలతో నిత్యం సావాసం చేసే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజామ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మదర్సాలు నాథురాం గాడ్సే, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వంటి వారిని తయారుచేయబోవని వ్యాఖ్యానించారు. మదర్సాలను ప్రధాన (మెయిన్‌స్ట్రీమ్) విద్యావ్యవస్థతో అనుసంధానం చేస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆజామ్ ఖాన్ స్పందించారు. గాంధీని చంపిన నాథురాం గాడ్సే స్వభావం కలిగిన వారిని, మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న బీజేపీ భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వంటి వ్యక్తిత్వం కలిగిన వారిని మదర్సాలు తయారుచేయడం లేదన్నారు.
ముస్లింలకు నాణ్యమైన విద్యను అందించే మదర్సాలకు కేంద్రం నిజంగా సహాయం చేయదలిస్తే వాటిని మెరుగుపరచాలని సూచించారు. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో పాటు ఆధ్యాత్మిక విలువలు, విజ్ఞాన అంశాలను మదర్సాలు బోధిస్తున్నాయని తెలిపారు. మదర్సాలకు భవనాలు, ఫర్నిచర్, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను అందించే కేంద్రాలుగా మదర్సాలను గుర్తించాలన్నారు.
దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న మదర్సాలను సాధారణ, ప్రధాన విద్యా కేంద్రాలతో కలుపుతామని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం ప్రకటించారు. మదర్సాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ సబ్జెక్టులో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని ట్విటర్‌లో నఖ్వీ వెల్లడించారు. మదర్సాలను మెరుగపరిచేందుకు 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ ‘ఒక చేతిలో ఖురాన్ మరో చేతిలో కంప్యూటర్’ ఉండాలి అనే నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment