సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని కంపెనీలే కాకుండా వ్యక్తులు, వ్యక్తుల సమూహాలు, ఎన్జీవోలు, మత సంస్థలు, ఇతర సంస్థలు ఇక నుంచి యథేచ్ఛగా నల్లడబ్బును రాజకీయ పార్టీలకు బాండుల రూపంలో చెల్లించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో పారదర్శకతను పాటించేందుకు ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను తీసుకొస్తామని 2017, ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. అందులో భాగంగా ఎన్నికల బాండుల స్కీమ్‌ను గురువారం (4వ తేదీ) ఆయన నోటిఫై చేశారు.
నోటిఫికేషన్ ప్రకారం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వదల్చుకున్న వారు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు, ట్రస్టీలు ఎవరైనా, ఏవైనా కేంద్ర ప్రభుత్వం దేశంలో గుర్తించిన భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచ్‌లకు డబ్బులు చెల్లించి ఎన్నికల బాండులు తీసుకోవచ్చు. ఆ బాండులను ఏ రాజకీయ పార్టీకైనా అందజేయవచ్చు. వెయ్యి, పది వేలు, పది లక్షలు, కోటి రూపాయలకు విలువైన బాండ్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాండులను జారీ చేసేందుకు 26 రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోని భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన 52 బ్రాంచ్‌లను గుర్తించింది. ఈ ఎన్నికల బాండులు తీసుకునే వారు ఆ సొమ్ము తమకు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు. వారు తమ పేరును, తమ ఆదాయం పన్ను పిన్ నెంబర్‌ను, చిరునామాను పేర్కొంటే చాలు. అయితే వాటికి కూడా ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. తప్పుడు నెంబర్లు ఇచ్చినా, తప్పుడు చిరునామాలు ఇచ్చినా సరిపోతుంది.
ప్రతి స్కీమ్‌కు ఆధార్‌ను లింక్ చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు సాక్షిగా బల్లగుద్తి వాదిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్ విషయంలో ఆధార్ కార్డును పూర్తిగా విస్మరించింది. ‘నో యువర్ కస్టమర్’ నిబంధనలను బ్యాంకులు పాటించినప్పుడు మాత్రమే బాండులు తీసుకునేవారు తమ గుర్తింపును రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ‘నో యువర్ కస్టమర్’ నిబంధనలు 50 వేల రూపాయల లోపు లావాదేవీలకు వర్తించవన్న విషయం తెల్సిందే. ఎన్నికల బాండులు అందుకున్న రాజకీయ పార్టీలు తాము ఎవరి నుంచి బాండులు స్వీకరించిందో వారి వివరాలను వారు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. వారు నమోదు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఎన్నికల బాండ్లను తీసుకున్న రాజకీయ పార్టీలు బ్యాంకులకు వెళ్లి వాటిని నగదు రూపంలో మార్చుకున్నప్పుడు ఏ పార్టీకి ఆ విరాళాలు వెళ్లాయో, ఏ వ్యక్తి లేదా సంస్థ నుంచి (వారు సరైన వివరాలను వెల్లడించినట్లయితే) అవి అందాయో ఆ బ్యాంకు బ్రాంచ్‌కు మాత్రమే తెలుస్తోంది. అవసరం అనుకుంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తెలుసుకోగలదు. ఇతర ఏ పార్టీకి ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. కొన్ని ప్రజా పెట్టుబడులు కలిగిన కంపెనీలు తప్పించి వ్యక్తులు, ఎన్జీవో సంస్థలు, ట్రస్టీలు తమ ఆదాయ వివరాలను ప్రభుత్వ విభాగానికి వెల్లడించాలే తప్ప ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా నల్లడబ్బుతో ఎన్నికల బాండ్లను యథేచ్ఛగా కొనుగోలు చేసి, తమకు లబ్ధి చేకూర్చే పార్టీలకు అందజేయవచ్చు. విరాళాలిచ్చే వారి వివరాలు బహిర్గతం చేయరు కనుక నల్లకుబేరులే కాకుండా నేరస్థులు, హవాలా వ్యాపారలు కూడా ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలకు అందజేయడం ద్వారా లబ్ధి పొందవచ్చు.
ఈ రాజకీయ బాండులను కాంగ్రెస్ పార్టీతోపాటు పలు వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు ముందు కంపెనీలు నల్లడబ్బును తమ ఇష్టానుసారంగా రాజకీయ పార్టీలకు కొన్ని నిబంధనలు ఉండేవని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, పార్టీ పరిశోధనా విభాగం అధ్యక్షుడు రాజీవ్ గౌడ తెలిపారు. కంపెనీలు తమ మూడేళ్ల నగదు సరాసరి ఆదాయంలో 7.5 శాతం నిధులను రాజకీయ పార్టీలకు ఇవ్వొచ్చని, అంతేకాకుండా అది కూడా బోర్డు సభ్యుల అనుమతితో ఇవ్వాలన్న నిబంధన ఉండేదని అన్నారు. 2017లో తీసుకొచ్చిన ఆర్థిక బిల్లు ద్వారా బీజేపీ ప్రభుత్వం ఈ నిబంధనలకు నీళ్లొదిలిందని ఆయన ఆరోపించారు. నగదు కాకుండా చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, ఎలక్ట్రానిక్ బదలాయింపుల ద్వారానే ఎన్నికల బాండులను తీసుకోవాలన్న నిబంధనే ఈ స్కీమ్‌లో కాస్త మెరుగైన అంశం.
Comments
Please login to add a commentAdd a comment