పసుపు కుంకుమకు పైసల్లేవు..! | DWCRA Women Fires On Chandrababu Naidu Over Pasupu Kunkuma | Sakshi
Sakshi News home page

పసుపు కుంకుమకు పైసల్లేవు..!

Published Tue, Apr 9 2019 8:16 AM | Last Updated on Tue, Apr 9 2019 8:16 AM

DWCRA Women Fires On Chandrababu Naidu Over Pasupu Kunkuma - Sakshi

మైదుకూరులో ధర్నా చేస్తున్న పొదుపు మహిళలు

సాక్షి, అమరావతి/మైదుకూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత ఊదరగొట్టినా మూడో విడత పసుపు–కుంకుమ డబ్బులు డ్వాక్రా మహిళల చేతికి అందలేదు. అదిగో చెక్కు డబ్బులిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు, వారికి సహకరించే సెర్ప్‌ ఉన్నతాధికారులు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చి బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టించారు. తీరా అక్కడకు చేరుకున్న మహిళలు చివరకు ఉసూరుమన్నారు. రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడేలా చేసి.. సాయంత్రానికి ఈ రోజు బ్యాంకులు చెక్కులే తీసుకుంటున్నాయి, డబ్బులు నాలుగైదు రోజుల్లో ఇస్తారని వెలుగు సిబ్బంది చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో కోప్రోదిక్తులైన మహిళలు  బ్యాంకుల ముందు ధర్నాలు, ఆందోళనలు చేశారు. దీని ద్వారా ఎన్నికల్లో ఎంతో లబ్ధిపొందుదామనుకున్న టీడీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కానీ, ఏప్రిల్‌ ఐదవ తేదీతో ఇచ్చిన పోస్టు డేటెడ్‌ చెక్కులు మూడు నెలల్లోపు ఎప్పుడైనా బ్యాంకులో చెల్లుబాటు అవుతాయని డ్వాక్రా మహిళలకు నచ్చజెబుతున్నారు. చెక్కులు క్లియర్‌ అయితే డ్వాక్రా సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించారు. అందుకనుగుణంగా సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ కూడా జిల్లాలో పనిచేసే ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు, సంఘమిత్ర–యానిమేటర్లకు సెల్‌ ఫోçను మేసేజ్‌ ద్వారా మెసేజ్‌లు పంపారు. లేని పక్షంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. 

చెక్కులు వెనక్కి తీసుకున్న సిబ్బంది
ఏకంగా సెర్ప్‌ సీఈవో పేరుతోనే ఆదేశాలు జారీ కావడంతో ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను బ్యాంకుల వద్దకు రప్పించడానికి జిల్లాల్లో కిందిస్థాయి సిబ్బంది వారికి పంపిణీ చేసిన చెక్కులను బలవంతంగా వెనక్కి తీసేసుకున్నారు. ‘మేమే బ్యాంకుల్లో చెక్కులను జమ చేస్తాం.. మీరందరూ బ్యాంకులకు వచ్చి డబ్బులు తీసుకోండి’.. అని చెప్పారు.  దీంతో సంఘాల్లో మహిళలు సోమవారం ఉ.10 గంటలకే బ్యాంకులకు క్యూకట్టారు. అక్కడ గంటల తరబడి పడిగాపులు పడ్డాక అధికారులు.. ‘ఇప్పుడు చెక్కులే తీసుకుంటాం.. డబ్బులు నాలుగు రోజులు ఆగాక ఇస్తాం’.. అని చెప్పడంతో మహిళలు తిట్టుకుంటూ వెనుతిరిగారు. ఎన్నికలయ్యాక మళ్లీ డబ్బులు ఇవ్వరేమోనని భయపడి తాము ఇంతమంది ఒకేసారి వచ్చామని విజయవాడ బందరు రోడ్డులోని టైమ్స్‌ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఇండియన్‌ బ్యాంకు వద్ద కూలైన్‌లో నిలుచున్న భారతి అనే డ్వాక్రా సంఘం లీడరు ‘సాక్షి’కి వివరించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని యర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాల్లో దాదాపు 420 డ్వాక్రా సంఘాల పేరిట ఇచ్చిన చెక్కులను యానిమేటర్లు వెనక్కి తీసుకున్నారు. సోమవారం వివిధ సంఘాలకు చెందిన 3.15 లక్షల చెక్కులను బ్యాంకుల్లో జమ అయ్యాయని సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ తెలిపారు.

మైదుకూరులో ధర్నా
పసుపు–కుంకుమ కింద ఇచ్చిన మూడో విడత చెక్కులు చెల్లకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మైదుకూరులోని భారతీయ స్టేట్‌ బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ బ్యాంకు ఎదుటే కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో చెక్కులు ఇవ్వడం శోచనీయమన్నారు. అయినా.. ఆ ఇచ్చేదేదో మూడు విడతల్లో ఇవ్వకుండా ఒకేసారి ఇచ్చి ఖాతాల్లో నేరుగా జమచేసి ఉంటే తమకు ఈ తిప్పలు ఉండేవి కావన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement