సాక్షి, చెన్నై : జయలలిత మరణానంతరం ఖాళీ అయిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్(ఆర్కే నగర్) ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం ఓ స్పష్టత ఇచ్చేసింది. డిసెంబర్ 31 లోపు ఎన్నిక నిర్వహించి తీరతామని ఈసీ ప్రకటించింది.
గురువారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఏకే జ్యోతి ఈ మేరకు వెల్లడించారు. గత నెల మద్రాస్ హైకోర్టు ఆర్కే నగర్ ఉప ఎన్నికను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఎన్నికల సంఘం స్పందించింది.
ఈ యేడాది ఏప్రిల్‌లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఎన్నికల్లో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఎన్నికను వాయిదా వేసింది. అంతేకాదు ఆ సమయంలో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినకరన్ రెండాకుల గుర్తు పొందడం కోసం ఎన్నికల సంఘం ఉన్నతాధికారికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దినకరన్‌ను అరెస్ట్ చేసి.. ఆపై బెయిల్ పై విడుదల చేశారు.
గుజరాత్ షెడ్యూల్ ఏది?
రెండు రాష్ట్రాలకు ఒకేసారి షెడ్యూల్‌ను విడుదల చేస్తారని భావించినప్పటికీ.. ఈసీ కేవలం హిమాచల్ ప్రదేశ్ కు మాత్రమే ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే గుజరాత్ ఎన్నికలను డిసెంబరు 18లోపు పూర్తి చేస్తామని పేర్కొంది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలకు దిగింది. ఎన్నికల సంఘంపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయించిందని ఆరోపించింది.
తన రాజకీయ స్వప్రయోజనాలు నెరవేరే వరకు ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసేలా ప్రధాని మోదీ ఈసీపై ఒత్తిడి తీసుకొచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. కానీ, దీని వెనుక ఓ సాంకేతిక కారణం ఉన్నట్లు ప్రెస్ మీట్ లో ఈసీ చీఫ్ ఏకే జ్యోతి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కాల పరిమితి నిబంధన ఉన్నందున గుజరాత్ షెడ్యూల్ విడుదల చేయలేదని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment