న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏక్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే చాన్సుంది. దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో వచ్చే ఏప్రిల్–మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు అవసరమైన సామగ్రి తరలింపు పూర్తయిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే వారం ఎన్నికల పరిశీలకులు సమావేశం కానున్నారు. 7 లేదా 8 దశల్లో జరగనున్న ఈ ఎన్నికలకు ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని ఈసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి ఆఖరిలోగా విడుదలవనుండగా, పోలింగ్ ఏప్రిల్ ప్రథమార్ధంలో జరిగే వీలుందన్నారు. 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 10 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు.
కొన్ని అసెంబ్లీలకు కూడా..
లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకూ ఎన్నికలు జరిపేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. అదేవిధంగా ఈ మే నెలతో కశ్మీర్ అసెంబ్లీ రద్దుకు ఆరు నెలల గడువు ముగియనుండగా లోక్‌సభతోపాటే అక్కడా అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. గవర్నర్ పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత, వివిధ పరిస్ధితులను అంచనా వేస్తోంది.
ఇంకా సమయముంది!
ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశాయి. ఎన్నికల సంఘం(ఈసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. 2014 ఎన్నికలకు మార్చి 5వ తేదీన ఎన్నికల ప్రకటన వెలువడింది. ఈసారి 5వ తేదీ దాటిపోయినా ఇంకా ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయకపోవడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ ఆలస్యం చేయడం లేదని, నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రకటన జారీకి ఇంకా సమయం ఉందని మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ అన్నారు.
‘ప్రస్తుత లోక్‌సభ గడువు పూర్తయ్యే సరికి కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ 16వ లోక్‌సభ గడువు జూన్ 3వ తేదీతో ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు మొదటి దశ పోలింగు నోటిఫికేషన్‌కు మధ్య3 వారాలు వ్యవధి ఉండాలి. దీని ప్రకారం చూస్తే మార్చి 15వ తేదీలోగా ఎప్పుడయినా ఈసీ ఎన్నికల ప్రకటన జారీ చేయవచ్చు’అని ఆయన వివరించారు. ఎన్నికలను షెడ్యూలును ఫలానా గడువులోగా ప్రకటించాలన్న నిబంధన ఏదీ లేదని మరో మాజీ ఎన్నికల ప్రధానాధికారి నవీన్ చావ్లా అన్నారు. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన జారీలో జాప్యం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment