సాక్షి ప్రతినిధి, చెన్నై: ఓటర్లను ప్రలోభపెట్టడంలో తమిళనాడు ఘనకీర్తి ఈసీకి తెలిసిపోయింది. గత అనుభవాలు పునరావృతం కాకుండా అకస్మాత్తుగా మధుమహాజన్ అనే ప్రత్యేక అధికారిణిని ఈసీ నియమించింది. దేశం మొత్తం మీద మహారాష్ట్ర తరువాత తమిళనాడుకే నగదు బట్వాడా కీర్తి దక్కింది.
రాష్ట్రంలో గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో పోలింగ్‌కు ముందురోజు పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇది ఎన్నికల కమిషన్‌కు శిరోభారంగా మారింది. ప్రత్యర్థి అనేకసార్లు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేసినా పోలీసుల అండతో తప్పించుకోవడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు పెట్టినా నగదు పంపిణీ యథేచ్ఛగా జరిగిపోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి, తిరుప్పరగున్రం ఎన్నికలు నగదు బట్వాడా కారణంగానే రద్దయ్యాయి. ఆ తరువాత చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికలను కూడా ఇదే ఆరోపణలతో ఈసీ రద్దు చేసింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రత్యేక పరిశీలకులుగా ఇన్‌కంటాక్స్ అధికారిణి మధుమహాజన్‌ను మంగళవారం రాత్రి అకస్మాత్తుగా నియమించింది. ఎన్నికల నగదు బట్వాడాను అడ్డుకునేందుకు దేశం మొత్తం మీద మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ప్రత్యేక అధికారులను నియమించడం చర్చనీయాంశమైంది. అధికార అన్నాడీఎంకే అధికమొత్తంలో నగదు పంపిణీకి పాల్పడుతూ ఓటర్లను ప్రలోభపరుస్తోందనే ఫిర్యాదులు అందడంతో ఈసీ ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అలాగే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును గమనించేందుకు ఒక బృందం రంగంలోకి దిగింది. బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష అంత కంటే ఎక్కువ జమ అయితే వెంటనే తమకు తెలియజేయాలని బ్యాంకు అధికారులను ఈసీ ఆదేశించింది.
మదురైలో వద్దుబాబోయ్: ఎన్నికలపై మదురైలో విధులా వద్దు బాబోయ్ అంటున్నారు. ఇతర జిల్లాల్లో కంటే మదురై జిల్లాలో అదనంగా రెండుగంటలు పనిచేయాల్సి ఉందని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెనకడుగు వేస్తున్నారు. ఏప్రిల్ 18వ తేదీ ఎన్నికల పోలింగ్ రోజునే మదురైలో చిత్తిరై తిరువిళా జరుగనుంది. తెల్లవారుజామున 5గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మదురై మీనాక్షి అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు మరికొన్ని ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ కారణంగా ఓటేయడం కుదరనందున ఎన్నికలను వాయిదావేయాలని ఈసీకిఅనేక వినతులు అందాయి. మరికొందరు ఈసీపై గట్టిగా ఒత్తిడి తెచ్చారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఎన్నికల వాయిదా కుదరదని ఈసీ తేల్చిచెప్పింది. ఓటు వినియోగానికి ఇతర జిల్లాల్లో కంటే అదనంగా రెండుగంటలు కేటాయించాలని ఈసీ నిర్ణయించింది. దీంతో వామ్మో మదురైలో డ్యూటీనా.. మాకొద్దు అంటూ అధికారులు పలాయనం చిత్తగిస్తున్నారు.
ఓటేసేందుకు 11 గుర్తింపు కార్డులకు అనుమతి: ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు కార్డు మాత్రమే కాదు అదనంగా 11 గుర్తింపు కార్డులు సైతం అనుమతిస్తామని ఈసీ తెలిపింది. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇచ్చిన ఫొటోతో కూడిన గుర్తింపుకార్డులు, బ్యాంకు, పోస్టల్ పాస్ పుస్తకాలు, పాన్‌కార్డు, దేశ జనాభా లెక్కల భారతదేశ ప్రధాన రిజిస్ట్రార్ ద్వారా జారీఅయిన స్మార్ట్‌కార్డు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం గుర్తింపు కార్డు, కార్మిక సంక్షేమశాఖ కార్డు, పెన్షన్ కార్డు, లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ సభ్యులకు అందజేసిన కార్యాలయ గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డుల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎండవేళల్లో బహిరంగ సభలు నిర్వహించరాదు. సభల్లో తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment